Alto 800
-
‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...
కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో 800 కారును ఇకపై కొనలేరు. ఎందుకంటే తన ఎంట్రీ లెవల్ మోడల్ కారు ఆల్టో 800 ఉత్పత్తిని మారుతీ సుజుకీ నిలిపివేసింది. దీంతో మధ్యతరగతివారికి సైతం అందుబాటు ధరలో ఉంటూ అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ ఆల్టో 800 కారు కస్టమర్లకు దూరం కానుంది. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) బీఎస్6 (BS6) ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఆల్టో 800ని అప్‌గ్రేడ్ చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని కంపెనీ భావిస్తోంది. దీంతో ఆ కార్ల ఉత్పత్తిని ఆపేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రోడ్డు ట్యాక్స్ పెరగడం, మెటీరియల్ ధర, ఇతర రకాల పన్నులు కూడా వాహనాల కొనుగోలు ఖర్చు పెరగడానికి కారణాలు. ఆల్టో 800 ఉత్పత్తిని నిలిపివేయడం వెనుక మరో కీలక అంశం ఆల్టో కె10కి డిమాండ్ పెరగడం. ఆల్టో 800 ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ తగ్గుముఖం పడుతోందని, ఈ విభాగంలో వాహనాల కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగిందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) ఆల్టో 800 నిలిపివేత తర్వాత ఆల్టో K10 మారుతీ సుజుకీ ఎంట్రీ-లెవల్ మోడల్ కానుంది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ 5.94 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకీ వెబ్సైట్ ఆల్టో 800 ధర రూ. 3.54 లక్షల నుంచి రూ 5.13 లక్షల మధ్య ఉంది. 2000 సంవత్సరంలో లాంచ్ అయిన ఆల్టో 800 కారులో 796 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 2010 వరకు దాదాపు 18 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఆల్టో K10 భారత మార్కెట్లో విడుదలైంది . 2010 నుంచి ఇప్పటి వరకు 17 లక్షల ఆల్టో 800 కార్లను, 9.5 లక్షల ఆల్టో K10 కార్లను కంపెనీ విక్రయించింది. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్) -
కార్ల ధరలు పెంచిన మారుతి.. ఏ మోడళ్లపై అంటే?
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది. రూ. 15,000 మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మోడళ్లపై ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్మార్కెట్లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి. -
కొత్త ‘ఆల్టో 800’
న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తాజాగా ‘ఆల్టో 800’ నూతన వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎంట్రీ లెవెల్ నూతన వెర్షన్ హ్యాచ్‌బ్యాక్ కారు ధరల శ్రేణి రూ.2.93 లక్షల నుంచి రూ.3.71 లక్షలుగా ఉన్నాయి. గడిచిన 15 ఏళ్లుగా బెస్ట్ సెల్లింగ్ మోడల్ రికార్డును కొనసాగిస్తున్న ఆల్టో ఇప్పుడు బీఎస్–సిక్స్ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా.. అధిక భద్రతా ప్రమాణాలు, నూతన డిజైన్‌తో విడుదలైందని కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈకారులో ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), రివర్స్ పార్కింగ్ సెన్సార్, డ్రైవర్‌తో పాటు అతని పక్కన కూర్చున్న వ్యక్తికి సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను జోడించిన కారణంగా ప్రస్తుత మోడల్ కంటే రూ.30,000 అధిక ధరతో ఉందని కంపెనీ ప్రకటన తెలిపింది. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ
న్యూఢిల్లీ : దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ధరల మోత మోగించింది. తన అన్ని మోడల్స్‌పై రూ.8014వరకు ధరలు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి రానున్నాయి. ఎక్స్‌షోరూం న్యూఢిల్లీలో తన అన్ని మోడల్స్‌పై రూ.1500 నుంచి రూ.8014 వరకు ధరలు పెంచుతున్నట్టు మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కమోడిటీ, ట్రాన్స్‌పోర్టేషన్, అడ్మినిస్ట్రేటివ్ ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంచుతున్నట్టు మారుతీసుజుకీ చెప్పింది. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాస్ఓవర్ ఎస్-క్రాస్ వరకు మోడల్స్‌ను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధరలు ఎక్స్ షోరూం ఢిల్లీలో ప్రస్తుతం రూ.2.45 లక్షల నుంచి రూ.12.03 లక్షల వరకు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో ఎంఎస్ఐ తన కాంపాక్ట్ ఎస్యూవీ విటారా బ్రిజాపై రూ.20వేల వరకు ధరలు పెంచింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బెలానో ధర కూడా రూ.10వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మిగతా ఎంపికచేసిన మోడల్స్‌పై ధరలు రూ.1500 నుంచి రూ.5000ల వరకు పెంచుతున్నట్టు చెప్పింది. గతేడాదే వివిధ కార్ల కంపెనీలు తమ ఇన్పుట్ ధరలు పెరగడంతో హ్యాందాయ్ మోటార్ ఇండియా, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా, రెనాల్ట్, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, టాటా మోటార్స్ ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
‘ఆల్టో 800’.. కొత్త వేరియంట్లు
♦ ధర రూ.2.55 లక్షల నుంచి ♦ రూ.3.76 లక్షల రేంజ్లో ♦ మైలేజీ పెట్రోల్ 24.7కిమీ. ♦ సీఎన్జీ మోడల్లో 33.4 కిమీ. న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బాక్ మోడల్ ఆల్టో 800లో అప్డేటెడ్ వేరియంట్లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త ఆల్టో కార్ల ధర రూ.2.55 లక్షల నుంచి రూ.3.76 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్లో ఉన్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. తమ మోడళ్లన్నింటిలోనూ అత్యధికంగా అమ్ముడయ్యేది ఈ ఆల్టో మోడలేనని మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. ఈ తాజా వేరియంట్లలో వివిధ కొత్త ఫీచర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. మైలేజీ లీటర్‌కు 24.7 కి.మీ. వస్తుం దని, ప్రస్తుతమున్న ఆల్టో మోడల్ కంటే ఈ కొత్త వేరియంట్ల మైలేజీ 9 శాతం అధికమని వివరించారు. సీఎన్జీ మోడల్ అయితే 33.4 కి.మీ. మైలేజీ వస్తుందని, ప్రస్తుతమున్న మోడల్ కంటే ఇది 10 శాతం అధికమని పేర్కొన్నారు. తాజా సాంకేతిక ఫీచర్లతో, అత్యున్నతమైన భద్రతాయుతమైన ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని కల్సి పేర్కొన్నారు. గత పన్నెండేళ్లుగా అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ మోడల్ ఇది. చరిత్రాత్మకమైన 30 లక్షల కార్ల విక్రయాల మైలురాయిని సాధించిన తొలి కార్ బ్రాండ్ కూడా ఇదే. కారు ప్రత్యేకతలు.. 0.8 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారులో 5-స్పీడ్ గేర్ బాక్స్, వెనక సీట్లకు హెడ్‌రెస్ట్స్, ప్యాసింజర్ సైడ్ ఓఆర్వీఎం, డ్రైవర్‌సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్-రూ.6,000 అదనంగా చెల్లించాలి), రియర్ స్పాయిలర్, ఫుల్ వీల్ కవర్స్, ముందువైపు పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, వెనక వైపు సీట్లకు చైల్డ్ లాక్, వెనక వైపు బాటిల్ పెట్టుకునే హోల్డర్, కో -డ్రైవర్ సైడ్ మ్యాప్ ప్యాకెట్ తదితర ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. -
అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో 800, ఆల్టో కే10 మోడళ్లలో అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ ఆప్షన్‌ను అందిస్తోంది. డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఉన్న ఆల్టో 800 వేరియంట్ల ధర రూ.2.62 లక్షల నుంచి రూ.3.78 లక్షల రేంజ్లో ఉంటాయని మారుతీ సుజుకీ కంపెనీ తెలిపింది. అలాగే ఇదే ఆప్షన్ ఉన్న ఆల్టో కే10 వేరియంట్ల ధర రూ.3.45 లక్షల నుంచి రూ.4.08 లక్షల రేంజ్లో(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్‌ల వల్ల కార్ల యజమానులందరూ తమ కార్లు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తారని పేర్కొన్నారు. -
మారుతీ ఆల్టోలో యానివర్సరీ ఎడిషన్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్లో యానివర్సరీ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారును మార్కెట్లోకి తెచ్చి ఏడాది అయిన సందర్భంగా, ఈ పండుగల సీజన్లో విజయోత్సవం జరుపుకోవడానికిగాను ఈ వార్షిక ఎడిషన్‌ను అందిస్తున్నామని మారుతీ సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు. ఈ ఆల్టో 800 ధరలు రూ.3.12 లక్షల నుంచి ప్రారంభమవుతాయని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) పేర్కొన్నారు. కొత్త బాడీ గ్రాఫిక్స్, బాడీ సైడ్ మోల్డింగ్స్, కొత్త సీట్ ఫ్యాబ్రిక్ , రియర్ పార్సెల్ ట్రే వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆల్టో 800ను మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటివరకూ 2 లక్షల కార్లు విక్రయించామని పేర్కొన్నారు. , , -
ఇక ఆల్టో డీజిల్ హల్చల్!
ముంబై: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్లో డీజిల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. ఈ ఏడాది ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోను, వచ్చే ఏడాది ఆల్టోలో డీజిల్ వేరియంట్‌ను అందించాలని మారుతీ ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం.... ఎయిర్ బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోలో ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నది. ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన ఆల్టో కార్ల ధరలు రూ.3.35 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుత ఆల్టో ధరల కంటే కొత్త ఆల్టో ధరలు సుమారుగా రూ.20,000 అధికంగా ఉండొచ్చు. వ్యాగన్ఆర్లో కూడా డీజిల్... మాతృకంపెనీ సుజుకి సహకారంతో ఆల్టో డీజిల్ ఇంజన్‌ను మారుతీ కంపెనీ భారత్‌లోనే రూపొందించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క ఆల్టోలోనే కాకుండా మారుతీ 800, వ్యాగన్ ఆర్, ఏ స్టార్ కార్లలో కూడా డీజిల్ ఇంజన్లు తయారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మోడళ్లలో డీజిల్ వేరియంట్లు వస్తే, హ్యుందాయ్ ఈఆన్, ఐటెన్, షెవర్లే బీట్ తదితర కార్లకు గట్టిపోటీనిస్తాయి. అంతేకాకుండా భారత వాహన మార్కెట్లో ప్రస్తుతమున్న 40 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోవడమనే లక్ష్యాన్ని కంపెనీ సులభంగా సాధించగలదని అంచనా. ఆదరణ ఉంటుంది... కొత్తగా కార్లు కొనేవారికి కొనుగోలు ధరే కాకుండా, నిర్వహణ వ్యయాలు కూడా ప్రాధాన్యత గల అంశాలే. మైలేజీని దృష్టిలో పెట్టుకుంటే డీజిల్ కార్లు ఖరీదైనవైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకాడరు. పెట్రోల్ కారును కొనుక్కున్నప్పటికీ, సీఎన్జీ, ఎల్పీజీ కిట్ల కోసం అదనంగా రూ. 50 వేల వరకూ ఖర్చు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తుంటారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మారుతీ చిన్న కార్లలో డీజిల్ వేరియంట్ల అమ్మకాలకు ఢోకా ఉండదనేది నిపుణుల అభిప్రాయం.