ఇక ఆల్టో డీజిల్ హల్‌చల్!
ముంబై: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్‌లో డీజిల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. ఈ ఏడాది ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోను, వచ్చే ఏడాది ఆల్టోలో డీజిల్ వేరియంట్‌ను అందించాలని మారుతీ ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం.... ఎయిర్ బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోలో ఎల్‌ఎక్స్, ఎల్‌ఎక్స్‌ఐ, వీఎక్స్‌ఐ వేరియంట్‌లను మార్కెట్లోకి తేనున్నది. ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన ఆల్టో కార్ల ధరలు రూ.3.35 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుత ఆల్టో ధరల కంటే కొత్త ఆల్టో ధరలు సుమారుగా రూ.20,000 అధికంగా ఉండొచ్చు.
వ్యాగన్‌ఆర్‌లో కూడా డీజిల్...
మాతృకంపెనీ సుజుకి సహకారంతో ఆల్టో డీజిల్ ఇంజన్‌ను మారుతీ కంపెనీ భారత్‌లోనే రూపొందించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క ఆల్టోలోనే కాకుండా మారుతీ 800, వ్యాగన్ ఆర్, ఏ స్టార్ కార్లలో కూడా డీజిల్ ఇంజన్లు తయారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మోడళ్లలో డీజిల్ వేరియంట్లు వస్తే, హ్యుందాయ్ ఈఆన్, ఐటెన్, షెవర్లే బీట్ తదితర కార్లకు గట్టిపోటీనిస్తాయి. అంతేకాకుండా భారత వాహన మార్కెట్లో ప్రస్తుతమున్న 40 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోవడమనే లక్ష్యాన్ని కంపెనీ సులభంగా సాధించగలదని అంచనా.
ఆదరణ ఉంటుంది...
కొత్తగా కార్లు కొనేవారికి కొనుగోలు ధరే కాకుండా, నిర్వహణ వ్యయాలు కూడా ప్రాధాన్యత గల అంశాలే. మైలేజీని దృష్టిలో పెట్టుకుంటే డీజిల్ కార్లు ఖరీదైనవైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకాడరు. పెట్రోల్ కారును కొనుక్కున్నప్పటికీ, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కిట్‌ల కోసం అదనంగా రూ. 50 వేల వరకూ ఖర్చు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తుంటారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మారుతీ చిన్న కార్లలో డీజిల్ వేరియంట్ల అమ్మకాలకు ఢోకా ఉండదనేది నిపుణుల అభిప్రాయం.