Alumni Conference
-
డిసెంబర్ 17న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ప్రత్యేక అతిథిగా అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సీఎండీ ఎ.ఇంద్రకుమార్ హాజరవుతారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జీఎంఆర్ సంస్థల అధినేత జీఎం రావు(జీఎంఆర్) అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. దేశం గర్వించే సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి డిసెంబర్ 17న ఏయూలోని ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫార్మసీ విభాగం, అమెరికన్ కార్నర్ వంటివి సందర్శిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఇటీవల విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ సేవలు ప్రారంభించిందని, యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న నారాయణమూర్తి ఏయూకు అతిథిగా రావడం శుభపరిణామమన్నారు. త్వరలో ఇథియోపియాలోనూ ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వ్యవస్థాపక ఉత్సవ సమారోహన కార్యక్రమాలను 2023, ఏప్రిల్ 26 నుంచి ఘనంగా ప్రారంభిస్తామని, శతాబ్ది ఉత్సవాలు 2025, ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభమవుతాయని వివరించారు. అనంతరం పూర్వవిద్యార్థుల సంఘ కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పూర్వవిద్యార్థుల సంఘ చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ, ఉప్యాధ్యక్షుడు ఎ.మన్మోహన్, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి.మోహన వెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్ రాజా పాల్గొన్నారు. -
సంద్రమంత విషాదం
సాక్షి, పరవాడ : ఆ సంబరం చూసి చూసి సముద్రుడికి ఈర్శ్య కలిగిందేమో వారిని తనలో కలిపేసుకున్నాడు.. వారి వినోదంతో విధికి కన్నుకుట్టిందేమో కన్నెర్ర జేసింది. ఆ కుటుంబాలకు ఆధారం వద్దనుకున్నాడేమో తన దగ్గరికి తీసుకుపోయాడు. కన్నీటికే కన్నీరు వచ్చే విషాదం.. పగవాడికి కూడా రాకూడని కష్టం.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం.. ఆ గ్రామానికి పెను విషాదం. పరవాడ మండలం ముత్యలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో రాకాసి అలలకు ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఇంటికి చేదోడుగా ఉంటాడని ఆశ పడిన ఆ కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చారు. వెన్నెలపాలెంలో నాలుగు నిరుపేద కుటుంబాలు పెట్టుకున్న ఆశలు ఆరిపోయాయి. పరవాడ పోలీసుల కథనం మేరకు.. వెన్నెలపాలేనికి చెందిన ముగ్గురు యువకులు సముద్ర అలలకు బలికావడం.. మరొకరు గల్లంతు అవ్వడంతో జిల్లాలో తీవ్ర విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన పైలా మహేష్(28), మాసవరపు నరేష్(27), సిరపరపు రామకృష్ణ(28) సముద్రంలో మునిగి మృత్యు ఒడికి చేరుకోగా.. లాలం నరసింగరావు(27) గల్లంతయ్యాడు. పరవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’పేరిట ఆదివారం ముత్యాలమ్మపాలెం శివారు తిక్కవానిపాలెం తీరంలో కలుసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడిపాడి, పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ క్రమంలో వెన్నెలపాలేనికి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణ, నరసింగరావు సముద్ర స్నానానికి దిగతా.. ఓ రాకాసి అల వీరిని సముద్రంలోకి లాగేసింది. దీంతో మహేష్, నరేష్, రామకృష్ణలు తీవ్ర అస్వస్తతకు గురై మరణించగా నరసింగరావు సముద్రంలోకి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సౌత్ ఏసీపీ జె.రామ్మోహన్రావు అనకాపల్లిలోని మార్చురీకి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను సీఐ స్వామినాయుడు, ఎస్ఐ వెంకటరావును అడిగి తెలుసుకున్నారు. దేవుడా మేం ఏ పాపం చేశాం... సముద్రంలో మునిగి మృతి చెందిన మహేష్, నరేష్, రామకృష్ణతో పాటు గల్లంతైన నరసింగరావులు ఆయా కుటుంబాల్లో ఒక్కరే మగ సంతానం. మహేష్‌కు మూడేళ్ల కిందట వివాహం జరగ్గా భార్య గౌతమి, రెండేళ్ల పాప రిషిత ఉన్నారు. తండ్రి కలాసీగా పనిచేస్తున్నా మహేష్ సంపాదనే ఆధారం. నరేష్ అవివాహితుడు కాగా తండ్రి రాజు డ్రైవర్‌గా పనిచేస్తూ ప్రమాదానికి గురవడంతో కాలు విరిగిపోయి ఇంటి వద్ద ఉండే పరిస్థితి. కుటుంబ భారం మీద పడడంతో హిందుజా కంపెనీలో పనికి కుదిరిన నరేష్ కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. ఇక రామకృష్ణ కుటుంబానిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. తండ్రి ఉన్న ఎకరంలో సేద్యం చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ. ఇద్దరు ఆడపిల్లల తరువాత రామకృష్ణ జన్మించాడు. గల్లంతైన నరసింగరావు ఏకైక సంతానం. చిన్ననాటి స్నేహితులైన నలుగురిలో ముగ్గురు ఒకే ప్రమాదంలో మరణించడం.. ఒకరు గల్లంతవ్వడంతో ఆయా కుటుంబాలల్లో తీరని విషాదం నెలకొంది. తల్లిదండ్రులతో పాటు బంధవులు, గ్రామస్తులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
చంపేస్తారని ముందే తెలుసు
సింగపూర్: మాజీ ప్రధాన మంత్రి, తన తండ్రి రాజీవ్ గాంధీని హత్యచేసిన వారిని తన కుటుంబం పూర్తిగా క్షమించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజలను ద్వేషించటం తమకు చాలా కష్టమైన పని అన్నారు. సింగపూర్‌లో ఐఐఎం పూర్వవిద్యార్థులతో సంభాషణలో రాహుల్.. పలు అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్నందునే ఇందిర, రాజీవ్‌లు హత్యకు గురయ్యారన్నారు. ‘నాన్న, నానమ్మ చనిపోతారని మాకు ముందే తెలుసు. తనను చంపేస్తారని నానమ్మ నాతో చెప్పేది. నాన్నను కూడా చంపేస్తారంది. రాజకీయాల్లో దుష్టశక్తులతో పోరాటంలో.. ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు చనిపోవటం ఖాయం. మేం (రాహుల్, ప్రియాంక) చాలారోజుల వరకు హంతకులపై ఆవేదనగా, కోపంగా ఉన్నాం. కానీ ఇప్పుడు వారిని మేం పూర్తిగా క్షమించేశాం’అని రాహుల్ పేర్కొన్నారు. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్వీటర్లో పోస్టు చేసింది. ‘చరిత్రలో భిన్న సిద్ధాంతాలు, భిన్న శక్తుల మధ్య పోరాటం జరిగినపుడు ఇలాంటి ఘటనలు సహజమే. మా నానమ్మను చంపిన వారితో నేను బ్యాడ్మింటన్ ఆడేవాణ్ణి. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ హతమైన విషయాన్ని టీవీలో చూస్తున్నపుడు.. ఆయన కుటుంబం, పిల్లలు ఎంత బాధపడి ఉంటారోనని అనిపించింది. ఎందుకంటే తండ్రిపోతే పిల్లలు ఎలా బాధపడతారో నాకు బాగా తెలుసు. వెంటనే ప్రియాంకకు ఫోన్ చేసి అతనే నాన్నను చంపాడని చెప్పా. దీనిపై నేను సంతోషపడాలి కానీ ఎందుకో సంతోషం అనిపించటం లేదన్నా. తను కూడా సంతోషంగా లేనని ప్రియాంక చెప్పింది’ అని రాహుల్ పేర్కొన్నారు. -
పూర్వ విద్యార్థుల సదస్సు
పెద్దాపురం(తూ.గో.జిల్లా) ఎస్‌ఆర్‌వీబీఎస్‌జేబీ మహా రాణి కళాశాల పూర్వ విద్యార్థుల(1977-80 బీకాం) సదస్సు ఈ నెల 22న విశాఖపట్టణం సిరిపురం జంక్షన్ లోని ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగు తుంది. మహారాణి కళాశాలలో చదువుకున్నవారు ఎంతో మంది నేడు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో స్థిరపడిన ఆనాటి విద్యార్థులంతా 22-02-2015 (ఆదివారం)న జరగనున్న పూర్వ విద్యా ర్థుల సదస్సులో ఉత్సాహంగా పాల్గొని సదస్సును విజయవంతం చేయా లని కోరుతున్నాం. 35 ఏళ్ల క్రితం కలసి చదువుకున్న మన మధుర జ్ఞాపకాలను మరోసారి మననం చేసుకుందాం రండి. - బి. తిరుపతిరాజు చార్టర్డ్ అకౌంటెంట్, విశాఖపట్నం ఫోన్: 9849120130 -ఎస్. వీరభద్రరావు - అసిస్టెంట్ మేనేజర్, ఎస్బీఐ, నర్సంపేట, వరంగల్ జిల్లా - veerabhadra_rao.seru@sbi.co.in ఫోన్:9848474257