Am Jyothi Krishna
-
'ఆక్సిజన్' మూవీ రివ్యూ
టైటిల్ : ఆక్సిజన్ జానర్ : యాక్షన్ ఎంటర్ టైనర్ తారాగణం : గోపిచంద్, రాశీఖన్నా, జగపతిబాబు, అను ఇమ్మాన్యూల్ సంగీతం : యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం : చిన్నా దర్శకత్వం : ఏయం జ్యోతి కృష్ణ నిర్మాత : ఎస్.ఐశ్వర్య యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ సమయంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపిచంద్. ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్ కెరీర్ కు ఆక్సిజన్ అందించిందా..? చాలా ఏళ్ల కిందట నా మనసు నీకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జ్యోతికృష్ణ, మరోసారి ఆక్సిజన్ తో తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడా..? కథ : రఘుపతి (జగపతి బాబు) ఎన్నో వ్యాపారాలతో కోట్ల ఆస్తులున్న పెద్ద మనిషి. రాజమండ్రిలో ఉంటూ దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తుంటాడు. తన అన్నాతమ్ముళ్లు వాళ్ల పిల్లలతో కలిసుండే రఘుపతి కుటుంబంలోని వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఇది ముందుగా తన ఊళ్లో ఉన్న ప్రత్యర్థి వీరభద్రం (షియాజీ షిండే) పనే అనుకున్నా.. తరువాత కాదని తెలుస్తుంది. రఘుపతి కుటుంబం ఈ భయాల్లో ఉండగానే ఆయన కూతురు శృతికి అమెరికా సంబందం వస్తుంది. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేసే కృష్ణ ప్రసాద్ (గోపిచంద్) శృతిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. అయితే తన కుటుంబాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టం లేని శృతి ఎలాగైన ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలని ప్లాన్ చేస్తుంది. కానీ కృష్ణ ప్రసాద్ మంచితనం కారణంగా ఇంట్లో వారంతా శృతిని కృష్ణప్రసాద్ కే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. అదే సమయంలో రఘుపతి కుటుంబం అజ్ఞాత శత్రువు కారణంగా ప్రమాదంలో పడుతుంది. అసలు రఘుపతి కుటుంబాన్ని అంతం చేయడానికి చూస్తున్న ఆ అజ్ఞాత శత్రువు ఎవరు..? రఘుపతి కుటుంబాన్ని ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాడు..? రఘుపతి ఇంటికి అల్లుడుగా వచ్చిన కృష్ణప్రసాద్ ఎవరు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఆక్సిజన్ సినిమాతో గోపిచంద్ మరోసారి మాస్ యాక్షన్ సినిమాలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ తో పరవాలేదనిపించిన గోపిచంద్, ద్వితియార్థంలో తనదైన నటనతో అలరించాడు. ముఖ్యంగా ఎమోషనల్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. మంచి మనసున్న అమెరికా అబ్బాయిగా, రఫ్ అండ్ టఫ్ ఆర్మీ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. రాశీఖన్నా పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపించింది. పెద్దగా నటనకు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించింది. (సాక్షి రివ్యూస్) అను ఇమ్మాన్యూల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ.. అయితే కథను మలుపు తిప్పే కీలకమైన గీత పాత్రకు అను పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. సీనియర్ నటుడు జగపతి బాబు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, కిక్ శ్యాం, అభిమాన్యు సింగ్ తదితరులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. కాలకేయ ప్రభాకర్, అమిత్ కుమార్ తివారిలకు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. విశ్లేషణ : నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన ఏయం జ్యోతి కృష్ణ మరోసారి ఈ సారి ఓ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తొలి అర్ధభాగం సాదా సీదా ఫ్యామిలీ డ్రామాలా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్ తో షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు స్లోగా సాగిన కథనం సెకండ్ హాఫ్ లో వేగం పుంజుకుంటుంది. గోపిచంద్ ఇమేజ్ తగ్గ పర్ఫెక్ట్ కథతో మెప్పించిన దర్శకుడు క్లైమాక్స్ తో మరింత ఆకట్టుకున్నాడు. సందేశాత్మక కథను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సక్సెస్ సాధించాడు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్) చిన్నా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చిన్నా సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : గోపిచంద్ నటన కథ యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
'ఆ సినిమా కాస్త ఆలస్యంగా చేసుంటే బాగుండేది'
ప్రముఖ నిర్మాత ఏయం రత్నంగారి తనయుడిగా సినీరంగానికి పరిచయం అయిన దర్శకుడు ఏయం జ్యోతికృష్ణ. తొలి సినిమా నీ మనసు నాకు తెలుసుతోనే దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జ్యోతికృష్ణ ఈ గురువారం ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాశీఖన్నా, అనుఇమ్మాన్యూల్ లు హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, చంద్రమోహన్, అలీ, శియాజీ షిండేలు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 30న రిలీజ్ అవుతున్న సందర్భంగా జ్యోతికృష్ణ సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. హిట్ అవుతుందని తెలుసు ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.. సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను తెరకెక్కించాం. సినిమా రిలీజ్ దగ్గర పడుతుంటే టెన్షన్ గా ఉంది. అదే సమయంలో ఎక్సైటింగ్ గా కూడా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది.. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.. కానీ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. రచయితగా 'స్నేహం కోసం' నా తొలి చిత్రం. ఆ సినిమా పూర్తిగా భావోద్వేగాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు నా దర్శకత్వంలో అలాంటి సినిమా చేయటం ఆనందంగా ఉంది. దర్శకుడిగా నా తొలి చిత్రం నీ మనసు నాకు తెలుసు.. అప్పట్లో తెలుగు సినిమాలో ఉన్న ట్రెండ్ కు భిన్నంగా ఆ సినిమా చేశాను.. అయితే ఆ సినిమా చాలా అడ్వాన్స్డ్ గా చేశాను.. కాస్త లేట్ గా చేసి ఉంటే బాగుండేది. అందుకే ఆక్సిజన్ విషయంలో కాస్త టైం తీసుకున్నా. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. తెలుగు నేటివిటి, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. ఈ సినిమా తరువాత గోపిచంద్ ఇమేజ్ మారిపోతుంది.. ఆక్సిజన్ సినిమా తరువాత ఆయన ఇమేజ్ మారిపోతుంది. పెద్ద స్టార్ హీరోకు సూట్ అయ్యే కథ ఆక్సిజన్. గోపిచంద్ అయితే నా కథకు సరిపోతారన్న నమ్మకంతో ఆయనతో కలిసి పనిచేశాం. మా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. ఇంత వరకు గోపిచంద్ ఎలాంటి ఇమేజ్ లో ఫిక్స్ అవ్వలేదు. అది కూడా మాకు హెల్ప్ అయ్యింది. ఇన్నాళ్లు గోపిచంద్ ను యాక్షన్ హీరోగా మాత్రమే చూశారు. ఈ సినిమాతో నటుడిగా కూడా మీరు కొత్త గోపిచంద్ ను చూస్తారు. ఆయన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. 15 మంది సీనియర్లు కీలక పాత్రల్లో నటించారు.. దాదాపు 15 మంది సీనియర్ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అంతమందిని ఓకేసారి తెర మీద చూపించేందుకు చాలా కసరత్తులు చేశాం. అయితే ఒకసారి సెట్స్ మీదకు వెళ్లాక ఆడియన్స్ కు ఎలా అయితే నచ్చుతుంది అన్న ఆలోచనతోనే సినిమాను తెరకెక్కించాను. సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరి పాత్రకు వారి ఇమేజ్ కు తగ్గ ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే సమయంలో నటీనటులందరూ షూటింగ్ విషయంలో ఎంతో సహకరించారు. వారి సహకారం మూలంగానే అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి చేయగలిగాం. సీనియర్ ఆర్టిస్ట్ ల డేట్స్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని షూటింగ్ ప్లాన్ చేశాం. చిన్నతనం నుంచి సినిమాలకు పనిచేసిన అనుభవం నాకు ఈ సినిమా విషయంలో చాలా హెల్ప్ అయ్యింది. నేను చాలా వేగం గా సినిమా తెరకెక్కిస్తాను. నా మేకింగ్ స్టైల్ కారణంగా డేట్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా షూటింగ్ ముగించగలిగాం. ముందు వెళ్లాల్సిన వారి షాట్స్ ముందుగానే తీసేయటం.. అందుకోసం ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవటం వల్ల ఇంతమంది బిజీ ఆర్టిస్ట్ లతో సినిమా చేయటం వీలైంది. యువన్ చేసిన అన్ని పాటలు సినిమాలో వాడటం వీలుపడలేదు.. యువన్ శంకర్ రాజా నాకు సోదరుడి లాంటి వాడు. ఆయనతో ఈ సినిమా కోసం పనిచేయటం చాలా హ్యాపిగా ఉంది. కథ విన్న తరువాత చాలా ఎగ్జైట్ అయ్యి ఈ సినిమాకు పనిచేశారు. యువన్ ఈ సినిమా కోసం ఆరు పాటలు ట్యూన్ చేశారు. అయితే కథా పరంగా అన్ని పాటలను వాడటం వీలుపడలేదు. ఆడియోలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉంటాయి. మిగిలిన పాటలను తప్పకుండా మా తదుపరి చిత్రాల్లో వినియోగిస్తాం. బిజీ షెడ్యూల్ కారణంగా యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం చేయలేకపోయారు. ఇళయరాజా షోస్ కారణంగా ఫారిన్ లో ఉన్న యువన్ అక్కడే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తా అన్నారు. కానీ నేను పక్కనే ఉండి చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడే చిన్నాతో చేయించాను. కేవలం నేపథ్య సంగీతం కోసం రెండున్నర నెలల సమయం పట్టింది. అదే సమయంలో గ్రాఫిక్స్ కారణంగా కూడా సినిమా కాస్త ఆలస్యం అయ్యింది. దాదాపు 9 నెలలలపాటు గ్రాఫిక్స్ వర్క్ జరిగింది. క్వాలిటీ కోసమే అంత సమయం తీసుకున్నాం. ఏదో పొరపాటున నటించా.. అప్పట్లో ఏదో పొరపాటుగా ఓ సినిమా చేశాను. భవిష్యత్తులో నటుడిగా కొనసాగే ఆలోచనలేదు. ప్రస్తుతానికి నా దృష్టంతా దర్శకత్వంపైనే ఉంది. అదే సమయంలో నిర్మాణ రంగంలోనూ బిజీ అవ్వాలని భావిస్తున్నా. నాన్నగారి వ్యాపారాలకు సంబంధించిన బాధ్యతలు కూడా నామీదే ఉన్నాయి. ఒక సినిమా విజయానికి నిర్మాత, దర్శకుడే కారణమని నా నమ్మకం. నాన్నగారు నిర్మాతగా తెరకెక్కే సినిమాలకు నా వంతుగా నేను సాయం చేస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా ఆక్సిజన్ రిలీజ్ మీదే ఉంది. ఈ సినిమా రిలీజ్ తరువాతే నా తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకుంటా. -
అక్టోబర్ 23న ఆక్సిజన్ ఆడియో
మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఆక్సిజన్ సినిమా ఆడియోను ఈ నెల 23న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళ స్టార్ మ్యూజీషియన్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత మందించారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో జగపతిబాబు మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు. -
అక్టోబర్ 27న గోపీచంద్ 'ఆక్సిజన్'
మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.ఐశ్వర్య మాట్లాడుతూ.. 'హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే స్పెషల్ మూవీ అవుతుంది. హీరో డెడికేషన్, సపోర్ట్ కారణంగా సినిమాను పూర్తి చేయగలిగాం. ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమాను అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై తదితర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఆక్సిజన్ చిత్రాన్ని రూపొందించాం. జగపతిబాబుగారు సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆయన నటనకు సినిమాకు పెద్ద ప్లస అవుతుంది. సీజీ వర్క్స్ అద్భుతంగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను అక్టోబర్ మొదటివారంలో విడుదల చేసి, సినిమాను అక్టోబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అన్నారు.