టైటిల్ : ఆక్సిజన్
జానర్ : యాక్షన్ ఎంటర్ టైనర్
తారాగణం : గోపిచంద్, రాశీఖన్నా, జగపతిబాబు, అను ఇమ్మాన్యూల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
నేపథ్య సంగీతం : చిన్నా
దర్శకత్వం : ఏయం జ్యోతి కృష్ణ
నిర్మాత : ఎస్.ఐశ్వర్య
యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ సమయంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఆక్సిజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గోపిచంద్. ప్రముఖ నిర్మాత ఏయం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్ కెరీర్ కు ఆక్సిజన్ అందించిందా..? చాలా ఏళ్ల కిందట నా మనసు నీకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన జ్యోతికృష్ణ, మరోసారి ఆక్సిజన్ తో తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడా..?
కథ :
రఘుపతి (జగపతి బాబు) ఎన్నో వ్యాపారాలతో కోట్ల ఆస్తులున్న పెద్ద మనిషి. రాజమండ్రిలో ఉంటూ దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తుంటాడు. తన అన్నాతమ్ముళ్లు వాళ్ల పిల్లలతో కలిసుండే రఘుపతి కుటుంబంలోని వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ఇది ముందుగా తన ఊళ్లో ఉన్న ప్రత్యర్థి వీరభద్రం (షియాజీ షిండే) పనే అనుకున్నా.. తరువాత కాదని తెలుస్తుంది. రఘుపతి కుటుంబం ఈ భయాల్లో ఉండగానే ఆయన కూతురు శృతికి అమెరికా సంబందం వస్తుంది. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం చేసే కృష్ణ ప్రసాద్ (గోపిచంద్) శృతిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. అయితే తన కుటుంబాన్ని వదిలి వెళ్లడానికి ఇష్టం లేని శృతి ఎలాగైన ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలని ప్లాన్ చేస్తుంది. కానీ కృష్ణ ప్రసాద్ మంచితనం కారణంగా ఇంట్లో వారంతా శృతిని కృష్ణప్రసాద్ కే ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు. అదే సమయంలో రఘుపతి కుటుంబం అజ్ఞాత శత్రువు కారణంగా ప్రమాదంలో పడుతుంది. అసలు రఘుపతి కుటుంబాన్ని అంతం చేయడానికి చూస్తున్న ఆ అజ్ఞాత శత్రువు ఎవరు..? రఘుపతి కుటుంబాన్ని ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాడు..? రఘుపతి ఇంటికి అల్లుడుగా వచ్చిన కృష్ణప్రసాద్ ఎవరు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఆక్సిజన్ సినిమాతో గోపిచంద్ మరోసారి మాస్ యాక్షన్ సినిమాలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ తో పరవాలేదనిపించిన గోపిచంద్, ద్వితియార్థంలో తనదైన నటనతో అలరించాడు. ముఖ్యంగా ఎమోషనల్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. మంచి మనసున్న అమెరికా అబ్బాయిగా, రఫ్ అండ్ టఫ్ ఆర్మీ ఆఫీసర్ గా రెండు వేరియేషన్స్ అద్భుతంగా చూపించాడు. రాశీఖన్నా పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపించింది. పెద్దగా నటనకు స్కోప్ లేకపోయినా ఉన్నంతలో పరవాలేదనిపించింది. (సాక్షి రివ్యూస్) అను ఇమ్మాన్యూల్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ.. అయితే కథను మలుపు తిప్పే కీలకమైన గీత పాత్రకు అను పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. సీనియర్ నటుడు జగపతి బాబు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ, కిక్ శ్యాం, అభిమాన్యు సింగ్ తదితరులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. కాలకేయ ప్రభాకర్, అమిత్ కుమార్ తివారిలకు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయిన ఏయం జ్యోతి కృష్ణ మరోసారి ఈ సారి ఓ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తొలి అర్ధభాగం సాదా సీదా ఫ్యామిలీ డ్రామాలా నడిపించిన దర్శకుడు ఇంటర్వెల్ ట్విస్ట్ తో షాక్ ఇచ్చాడు. అప్పటి వరకు స్లోగా సాగిన కథనం సెకండ్ హాఫ్ లో వేగం పుంజుకుంటుంది. గోపిచంద్ ఇమేజ్ తగ్గ పర్ఫెక్ట్ కథతో మెప్పించిన దర్శకుడు క్లైమాక్స్ తో మరింత ఆకట్టుకున్నాడు. సందేశాత్మక కథను కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సక్సెస్ సాధించాడు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్) చిన్నా అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చిన్నా సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
గోపిచంద్ నటన
కథ
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment