ఫలించని తంత్రం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ అయిన అవనిగడ్డ స్థానానికి అసలు ఉపఎన్నికే జరపకూడదని భావించిన కాంగ్రెస్‌కు, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని ఆశపడిన తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. వారొకటి తలిస్తే.. వేరొకటైందిప్పుడు. ఉపఎన్నికకు పోరు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీలు కరుణించినా స్వతంత్రులు మాత్రం ససేమిరా అన్నారు. సానుభూతి మంత్రంతో తెలుగుదేశం పార్టీకి అందివచ్చిందనుకున్న ఏకగ్రీవ ఫలం దక్కకుండాపోయింది.
బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో మిగిలిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో టీడీపీ అభ్యర్థి తలపడాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అసలీ ఉపఎన్నిక తొలినుంచి ఉత్కంఠభరితంగానే మారింది. కేవలం ఎనిమిది మాసాల వ్యవధిలో ఎన్నిక ఎందుకనుకున్న అధికార పార్టీ సాచివేత ధోరణి అవలంభించిన విషయం తెలిసిందే. ఈ దశలో నియోజకవర్గానికి చెందిన ఇద్దరు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో ఎన్నికల కమిషన్ స్పందించింది. హైకోర్టు సూచన మేరకు రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ అవనిగడ్డకు ఉప ఎన్నిక నిర్వహించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తప్పదన్నట్టుగానే ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది.
ఈ దశలో తొలి నుంచి ఇక్కడ పోటీ లేకుండా సానుభూతి సాకుతో తిరిగి ఎమ్మెల్యే పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. ఎవరినీ పోటీకి పెట్టకుండా బ్రాహ్మణయ్య కుటుంబానికి చెందిన వారికే ఎమ్మెల్యే పదవి దక్కేలా సహకరించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలకు విజ్ఞాపన లేఖలు రాశారు. ఏకగ్రీవం విషయంలో టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ద్వంద్వ వైఖరిని అనుసరించినప్పటికీ బ్రాహ్మణయ్య కుటుంబంపై సానుభూతితో వైఎస్సార్సీపీ పోటీలో ఉండకూడదని నిర్ణయించుకుంది. అయినా స్వతంత్ర అభ్యర్థుల బెడద తెలుగుదేశానికి తప్పలేదు.
టీడీపీకి ముప్పుతిప్పలు
ఏకగ్రీవం కోసం టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా నామినేషన్ ఉపసంహరణ కోసం స్వతంత్ర అభ్యర్థులు వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆయనతో పాటు మరో 15 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన దశలో ఐదుగురి నామినేషన్లు తిరస్కరించగా.. మరో 11 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం సాయంత్రం మూడు గంటలతో ముగియడంతో వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా టీడీపీ నేతలు నానా పాట్లు పడ్డారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ తదితర నేతలు రాజీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడంలో వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్వతంత్ర అభ్యర్థుల్లో ఎనిమిది మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా, మరో ఇద్దరు మాత్రం ఒప్పుకోలేదు. ఒక దశలో చిలకలూరిపేటకు చెందిన రావు సుబ్రమణ్యం అందరూ ఉపసంహరించుకుంటే తాను కూడా పోటీ నుంచి తప్పుకొంటానని మెలిక పెట్టారు. మరో స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్ ఇదిగో వస్తున్నానంటూ కాలయాపన చేశారు.
రాజశేఖర్ సమైక్యాంధ్ర ఉద్యమకారులు చేపట్టిన రాస్తారోకో వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని, ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నందున నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇవ్వాలని టీడీపీ నేతలు కోరారు. దీంతో మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ మరో గంట పొడిగించి సాయంత్రం నాలుగు గంటల వరకు అవకాశం ఇచ్చారు. అయినా రాజశేఖర్ రాకపోవడంత్ధో సుబ్రమణ్యం కూడా పోటీ నుంచి నిష్ర్కమించబోనని ప్రకటించారు. చివరికి ఉపఎన్నిక తప్పనిసరైంది.
బరిలో ముగ్గురు..
అవనిగడ్డ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నట్టు రిటర్నింగ్ ఆఫీసర్ జి.రవి బుధవారం రాత్రి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా అంబటి శ్రీహరిప్రసాద్‌కు సైకిల్ గుర్తు ఖరారు చేశారు. స్వతంత్ర అభ్యర్థుల సైకం రాజశేఖర్‌కు కప్పు-సాసర్, రావు సుబ్రమణ్యానికి సీలింగ్ ఫ్యాన్ గుర్తులను కేటాయించారు. పోలింగ్ 21న జరగనుంది. ఈ నెల 24వ తేదీన ఫలితం ప్రకటిస్తారు.