సభోత్సాహం
= బెల్గాంలో అసెంబ్లీ సమావేశాలు
= ఉభయ సభల్లో సందడే సందడి
= ముఖ్యమంత్రి, మంత్రులకు మేళ తాళాలతో స్వాగతం
= భారతరత్న సచిన్, రావుకు తొలుత అభినందనలు
= ఇక ఏడాదిలో రెండు సార్లు బెల్గాంలో ‘అసెంబ్లీ’
= ‘షాదీ భాగ్య’ను విస్తరించాలంటూ కేజేపీ డిమాండ్
= వాయిదా తీర్మానానికి అనుమతించని స్పీకర్
= యడ్డి ఆగ్రహం .. కాగితాలు విసిరి నిరసన
= పోడియం వద్ద బైఠాయింపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంను మహారాష్ట్రలో విలీనం చేయాలంటూ మహారాష్ర్ట ఏకీకరణ సమితి (ఎంఈఎస్) పదే పదే చేస్తున్న రచ్చకు సమాధానంగా ఏడాదిలో ఓ సారి అక్కడ శాసన సమావేశాలను నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో సారి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ సమావేశాలను నిర్వహించే విషయమై పాలక, ప్రతిపక్షాలు ఎప్పుడో ఏక తాటిపైకి వచ్చాయి. ఇకమీదట ఏడాదిలో రెండు సార్లు బెల్గాంలో సమావేశాలను నిర్వహిస్తామని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రకటించారు. అధికార పక్షంలో ఉంటూ తొలి సారి ఈ సమావేశాల్లో పాల్గొనడం కాంగ్రెస్‌కు కొత్త అనుభవం.
ఎర్ర తివాచీ స్వాగతం
ముఖ్యమంత్రి, ఆయన మంత్రి వర్గ సహచరులకు మేళ తాళాలతో ఎర్ర తివాచీ స్వాగతం లభించింది. శాసన మండలిలో వందేమాతరం గీతం ఆలాపనతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలు తొలుత భారత రత్న పురస్కార విజేతలు ప్రొఫెసర్ సీఎన్ఆర్. రావు, సచిన్ టెండూల్కర్‌లకు అభినందనలు తెలిపాయి. శాసన సభలో స్పీకర్ కాగోడు తిమ్మప్ప అభినందన తీర్మానాన్ని చదవగానే సభ్యులు బల్లలు చరిచి ఆమోదం తెలిపారు. దీనిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు హెచ్డీ. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్ శెట్టర్, యడ్యూరప్ప పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మరణించిన కన్నడ చిత్ర దర్శకుడు డీ. రాజేంద్ర బాబు, అమర గాయకుడు మన్నాడేలకు సభ శ్రద్ధాంజలి ఘటించింది. నిమిషం పాటు సభ్యులు మౌనం పాటించారు.
యడ్యూరప్ప ధర్నా
షాదీ భాగ్యను అన్ని వర్గాలకు విస్తరించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి ఫ్రీడం పార్కులో నిరవధిక ధర్నా నిర్వహించిన కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వేదికను బెల్గాంకు మార్చారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని అనుతించాలని ఆయన కోరినప్పుడు స్పీకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప పోడియం వద్దకు దూసుకు వచ్చి ఆయనతో వాగ్వాదానికి దిగారు. స్పీకర్ హెచ్చరికలతో తన స్థానానికి తిరిగి వచ్చి, ప్రసంగిస్తూ ఆవేశానికి లోనై టేబుల్‌పై ఉన్న కాగితాలను విసిరి కొట్టారు. అనంతరం పోడియం వద్ద ధర్నాకు ఉపక్రమించారు.
ఎంఈఎస్ ఆర్భాటం
బెల్గాంలో శాసన సభ సమావేశాలు జరిగే ప్రతి సారీ ఎంఈఎస్ సభ్యుల ఆర్భాటం మామూలై పోయింది. ఆ పార్టీకి కేవలం ఇద్దరే సభ్యులున్నారు. ఇదే సందర్భంలో బెల్గాంలో ఎంఈఎస్ నిర్వహించ తలపెట్టిన మహా మేళాకు అనుమతినివ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు ధర్నా నిర్వహించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు రాళ్లు విసరడంతో పోలీసులు లాఠీలను ఝుళిపించాల్సి వచ్చింది. చెన్నమ్మ సర్కిల్లో కార్యకర్తలు ఎంఈఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సందర్భంలో శాసన సభ సమావేశాల్లో పాల్గొనడానికి వెళుతున్న ఎంఈఎస్ ఎమ్మెల్యేల వాహనాలపై ఎవరో రాళ్లు రువ్వారు. వెంటనే పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. దీనిపై ఎంఈఎస్ ఎమ్మెల్యేలు శాసన సభలో నిరసన వ్యక్తం చేశారు.
రెచ్చగొట్టే ప్రసంగం
అనంతరం జరిగిన మహా మేళానుద్దేశించి ఎంఈఎస్ ఎమ్మెల్యే సంభాజి పాటిల్ మాట్లాడుతూ తమపై చేయి పడితే ఏం జరుగుతుందో తెలుసా అంటూ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. తనతో పాటు తన సహచర ఎమ్మెల్యేపై చెయ్యి పడితే తెగి కింద పడుతుందని హెచ్చరించారు. తానిప్పుడే బెంగళూరుకు వెళతానని, ఏం జరుగుతుందో చూస్తానని సవాల్ విసిరారు.