ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఫ్యాక్టరీ ప్రమాద ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జిల్లా పోలీస్ శాఖకు చేరింది. హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషవాయుడు కారణంగానే అయిదుగురు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ ఏడాది మార్చి 30న మొగల్తూరు ఆనంద ఆక్వా పార్క్లో ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో నిజాలు బట్టబయలు అయ్యాయి.
37 రోజులుగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ప్రమాద ఘటనపై ఇప్పటికీ పోలీసులుతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికీ విచారణ చేయలేదు. కాగా ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా విషవాయువులు కారణం ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.