బురఖా ధరించిన వాళ్లు కూడా నీకు ఓటేశారు!
డెహ్రాడూన్: ’అందరినీ కలుపుకొని వెళ్లు. బురఖా ధరించిన మహిళలు కూడా నీకు ఓటేశారు. నువ్వు అన్ని మతాలను గౌరవించు.. అందరి హృదయాలను గెలుచుకో’... ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన తండ్రి ఆనంద్‌సింగ్ బిష్త్ ఇచ్చిన సలహా. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన 84 ఏళ్ల బిష్త్ తన కొడుకు మీద ఎంతో బాధ్యత ఉందని పేర్కొన్నారు.
‘ముస్లిం మహిళలు సైతం బీజేపీకి ఓటేశారు. ట్రిపుల్ తలాక్.. ఇతర సమస్యలపై ఆ పార్టీ తమను ఆదుకుంటుందని వారు ఆశిస్తున్నారు. అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను బీజేపీ, యోగి ప్రగతిపథంలో నడిపించాల్సి ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సాగాలి. సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ప్రజలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేయొద్దని యోగి సూచించారు. అతను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నాడు. అతని చర్యల్లో అది కనిపిస్తోంది’ అని బిష్త్ పేర్కొన్నారు. రిటైర్డ్ అటవీశాఖ అధికారి అయిన అనంద్‌సింగ్ బిష్త్ ప్రస్తుతం భార్య సావిత్రితో కలిసి పౌరి జిల్లా పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు. హిందూత్వ ప్రచారకుడిగా తనపై ఉన్న ముద్రను యోగి చేరిపేసుకోవాల్సిన అవసరముందని బిష్త్ అన్నారు.