ఆసరా.. అస్పష్టత
చిత్రంలో కనిపిస్తున్న ఈ వృద్ధురాలి పేరు అనంతమ్మ, ఈమెది మల్దకల్ మండలం ఉలిగేపల్లివయసు 80 ఏళ్లు. భర్త 20 ఏళ్ల క్రితమే చనిపోయాడు. సొంతిల్లు కూడా లేదు. గంటెడు భూమి అంతకన్నా లేదు. ఉన్న ఒక్కగానొక కూతురు వివాహం కాగా వేరుగా స్థిరపడింది.
ఆమెకు నెలనెలా వచ్చే పింఛనే ఆధారం. రేషన్‌బియ్యంతో కాలం గడిపేది. కాగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో పింఛన్‌కు ఆమెను అనర్హురాలిగా గుర్తించారు. ఉన్న కాస్త పింఛన్‌ను రద్దుచేయడంతో రోడ్డునపడింది. అధికారులు స్పందించి పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకుంటోంది.
సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పథకంలో అస్పష్టత నెలకొంది. పింఛన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటివరకు ఒక స్పష్టత లేకపోయింది. సామాజిక పింఛన్లకు సంబందించి జిల్లాలో దాదాపు 5,55,662 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో పరిశీలనతో పాటు అర్హుల జాబితాను ఆన్లైన్లో పొందుపరచడం వరకు అంతా అస్తవ్యస్తంగా తయారైంది.
ఇప్పటివరకు కేవలం 1,52,400 మంది అర్హులను మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. పింఛన్ల కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు రోజులు కావస్తున్నా అర్హుల జాబితాలో స్పష్టత లేదు. ఇంకా జిల్లాలో ఎంతమంది అర్హులనే ఉన్నారనే విషయాన్ని అధికారులు తేల్చలేకపోతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రసహనంగా సాగుతోంది. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్లు వస్తాయా? రావా? అని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కలెక్టరేట్‌తో మొదలుకొని ఎక్కడ చూసినా ఆందోళనలు చోటు చేసుకుంటన్నాయి. మరోవైపు దరఖాస్తులు పరిశీలన చేసిన అధికారులపై దాడులు జరుగుతున్నాయి.
కొరవడిన స్పష్టత...సామాజిక పింఛన్లకు సంబంధించి.. జిల్లాలో గతంలో 2,45,639 వృద్ధాప్య ఫించన్లు, 1,30,718 వితంతు, 46,484 వికలాంగులు, 14,416 చేనేత, 1,408 గీత కార్మికుల, 20,771 అభయహస్తం ఇలా మొత్తం 4,59,436 మంది ఫించన్లు తీసుకునేవారు. వీరికి ప్రభుత్వం ప్రతినెల రూ.12.97 కోట్లు మంజూరు చేసేది. అయితే వీటన్నింటినీ ప్రభుత్వం తాజాగా రద్దుచేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలోని అయిదు డివిజన్ల నుంచి అన్ని రకాల పింఛన్ల కోసం 5,55,662 దరఖాస్తులు వచ్చాయి.
వీటిలో ఏయే వాటికి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని కూడా ఇప్పటివరకు అధికార యంత్రాంగం తేల్చలేకపోయింది. మరోవైపు అర్హులకు సంబంధించిన నియమ నిబంధనల్లో కూడా స్పష్టత కొరవడింది. ముందు ఒక విధంగా, తర్వాత మరోలా ప్రభుత్వం పేర్కొనడంతో మరింత గందరగోళం నెలకొంది. అలాగే అర్హుల జాబితాకు సంబంధించి కూడా అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. స్థానికంగా దరఖాస్తులను పరిశీలించి వాటిని అర్హుల జాబితాను ఉన్నతాధికారుల చేరవేస్తున్నారు. అయితే అక్కడ కూడా వారికున్న సూచనల మేరకు వాటిని మరింతగా కుదిస్తున్నారు. గ్రామాల్లో జనాభా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలను వర్గీకరించి పలానా వర్గానికి ఇంత శాతం ఇవ్వాలంటూ ప్రభుత్వాధినేతలు పేర్కొనడంతో ఉన్నతాధికారులు అందుకు అనుగుణంగా జాబితాలను ఎప్పటికప్పుడు మార్పుచేర్పులకు గురిచేస్తున్నారు.
లభించని ధైర్యం..
ప్రతినెల మొదటి వారంలోనే పింఛన్లు అందుకునే వారు ఈ నెల 12 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంటుంది. పింఛన్ల కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు అందుతాయని ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కానీ ఇలాంటి హామీని స్థానికంగా ఇచ్చే నాయకుడు కరువయ్యారు. కలెక్టర్ మొదలు కొని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పింఛన్ల విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో మాట ధైర్యం లభించక చాలా ప్రాంతాల్లో గుండెపగిలి మృత్యువాత పడుతున్నారు.