Andhra pradesh- Telangana
-
ఏపీ–తెలంగాణ సరిహద్దులో ప్రశాంతత
దాచేపల్లి (గురజాల): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల కృష్ణానది వారధి వద్ద శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హెల్త్ ప్రొటోకాల్‌ను విస్మరించి తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వచ్చేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవటంతో రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో వారధి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బలగాలతో భద్రత కట్టుదిట్టం - రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా నది వారధి వద్ద పోలీస్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లా రూరల్ ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి, గురజాల డీఎస్పీ శ్రీహరి, ఎస్ఐ బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. - గురువారం రాత్రి ఆందోళనకారులు పోలీసులపై దాడి చేసిన తర్వాత శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు శ్రమించారు. వారధిపై ఆగి ఉన్న సుమారు 500కు పైగా ద్విచక్ర వాహనదారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఆ తర్వాత వారందరికీ నచ్చజెప్పి తెలంగాణ వైపునకు పంపించారు. - శుక్రవారం ఉదయం కృష్ణా నది వారధిపై నుంచి వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించకుండా కంచె ఏర్పాటు చేశారు. వారధి ప్రారంభంలో ఒక బెటాలియన్, వారధి మధ్యలో మరో బెటాలియన్ బలగాలు మోహరించగా, వారధి ఆ చివర తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. - పాల వ్యాన్లు, కూరగాయల వాహనాలు, మెడికల్‌కు సంబంధించిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి.. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణలోకి అనుమతించారు. ఏఎస్పీ, డీఎస్పీ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి రావటంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. - పొందుగల వద్ద పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు గురజాల ఆర్డీవో జె. పార్థసారథి, తహసీల్దార్ గర్నపూడి లెవీ, వీఆర్వోలు, గ్రామ వలంటీర్లు ఉన్నతాధికారులకు సహకరించారు. పీహెచ్సీ డాక్టర్ లక్ష్మీశ్రావణి.. శుక్రవారం కూడా వారధి వద్దనే ఉంటూ పలువురికి వైద్య సేవలు అందించారు. -
ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన
సాక్షి, అమరావతి: ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదని, తెలంగాణ భవనాలను మాత్రమే తెలంగాణకు ఇచ్చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించారని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు. పదేళ్ల కాలపరిమితి ఉన్నా..గతంలో చంద్రబాబు హుటాహుటిన ఎందుకు అమరావతికి పరిగెత్తుకొని వచ్చారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతోనే ఆయన అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయనతోపాటు హుటాహుటిన ప్రభుత్వ ఉద్యోగులు రావడంతో.. భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ.. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైందని, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పుడు హుటాహుటిన పారిపోయి వచ్చి.. ఇప్పుడు భవనాలు వదిలేసి వచ్చామని అంటున్నారని టీడీపీ తీరును తప్పుబట్టారు. ఈ భవనాలు కావాలంటే నాలుగేళ్లపాటు మున్సిపల్ బిల్లులు, కరెంటు, వాటర్ బిల్లులు కట్టాల్సి ఉంటుందని, గత ఐదేళ్లూ వాడని భవనాలను.. తిరిగి అక్కడికి వెళ్లి ఇంకో ఐదేళ్లు వాడే పరిస్థితి లేదని, ఎలాగైనా 2024లో ఆ భవనాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సినవే కనుక ఇచ్చివేశామని తెలిపారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మొన్న ముఖ్యమంత్రుల సమావేశంలో తొమ్మిదో, పదో షెడ్యూల్లోని అంశాలు, నీళ్లు, నిధులు పంపకాలపై చర్చించామని తెలిపారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు బాహాటంగా చెప్పినప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, కృష్ణ, గోదావరి నీళ్లు తెచ్చుకోవడానికి విశాల దృక్పథంతో ఆలోచిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల సఖ్యతతో ఉండి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం చర్యలు తీసుకుంటే.. దానిని అభినందిచాల్సిందిపోయి.. ప్రతిపక్ష విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. -
ఏపీ, తెలంగాణలకు అన్యాయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొత్తపల్లి గీతలతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి పార్లమెంటు వెలుపల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని, కమిటీ వేసి చర్చించి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఆ కమిటీ ఏమిటో, ఎప్పుడు వేస్తారో..! ఈ ప్రాజెక్టుల్లో వేటిని ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం’’ అని అన్నారు. ‘‘విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో కనెక్టివిటీ, విశాఖకు మెట్రో రైలు ప్రస్తావన లేదు. అనేక ఏళ్ల కిందట మంజూరై, బడ్జెట్లో ఆమోదం పొంది అమలుకు నోచుకోని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, కర్నూలు-మంత్రాలయం సహా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ప్రస్తావనే లేదు’’ అని విమర్శించారు.