ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన | Buggana Rajendranath Reddy Reply on AP Assests in Telangana | Sakshi
Sakshi News home page

ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన

Published Thu, Jul 25 2019 11:50 AM | Last Updated on Thu, Jul 25 2019 4:08 PM

Buggana Rajendranath Reddy Reply on AP Assests in Telangana - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదని, తెలంగాణ భవనాలను మాత్రమే తెలంగాణకు ఇచ్చేశామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకే ఏపీ సీఎం, ముఖ్యమైన కేబినెట్‌ మంత్రులు, అధికారులు వెళ్లి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించిన సమస్యలపై చర్చించారని తెలిపారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని భవనాలు 2024 వరకు మనకు చెందుతాయని, ఆ తర్వాత అవి తెలంగాణకే చెందుతాయని స్పష్టం చేశారు.

పదేళ్ల కాలపరిమితి ఉన్నా..గతంలో చంద్రబాబు హుటాహుటిన ఎందుకు అమరావతికి పరిగెత్తుకొని వచ్చారని ప్రశ్నించారు. 
పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. ఓటుకు కోట్లు కేసులో వీడియోలకు అడ్డంగా దొరికిపోవడంతోనే ఆయన అమరావతికి పారిపోయి వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆయనతోపాటు హుటాహుటిన ప్రభుత్వ ఉద్యోగులు రావడంతో.. భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ.. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ అన్నట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైందని, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. 

అప్పుడు హుటాహుటిన పారిపోయి వచ్చి.. ఇప్పుడు భవనాలు వదిలేసి వచ్చామని అంటున్నారని టీడీపీ తీరును తప్పుబట్టారు. ఈ భవనాలు కావాలంటే నాలుగేళ్లపాటు మున్సిపల్‌ బిల్లులు, కరెంటు, వాటర్‌ బిల్లులు కట్టాల్సి ఉంటుందని, గత ఐదేళ్లూ వాడని భవనాలను..  తిరిగి అక్కడికి వెళ్లి ఇంకో ఐదేళ్లు వాడే పరిస్థితి లేదని, ఎలాగైనా 2024లో ఆ భవనాలు తెలంగాణకు తిరిగి ఇవ్వాల్సినవే కనుక ఇచ్చివేశామని తెలిపారు. నీళ్లు, నిధుల పంపకాల వంటి పెద్ద పెద్ద విషయాల్లో సామరస్యంగా పంపకాలు చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

మొన్న ముఖ్యమంత్రుల సమావేశంలో తొమ్మిదో, పదో షెడ్యూల్‌లోని అంశాలు, నీళ్లు, నిధులు పంపకాలపై చర్చించామని తెలిపారు. రాజకీయాల కోసం టీఆర్‌ఎస్‌తో పొత్తుకు సిద్ధమని చంద్రబాబు బాహాటంగా చెప్పినప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, కృష్ణ, గోదావరి నీళ్లు తెచ్చుకోవడానికి విశాల దృక్పథంతో ఆలోచిస్తే తప్పేంటని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల సఖ్యతతో ఉండి.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బాగు కోసం చర్యలు తీసుకుంటే.. దానిని అభినందిచాల్సిందిపోయి.. ప్రతిపక్ష విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement