రైలులో ప్రయాణికుడిపై హిజ్రాల దాడి
కాజీపేట రూరల్: అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిపై హిజ్రాలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. హిజ్రాల దాడిలో గాయాలపాలైన ప్రయాణికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాజీపేట జీఆర్పీ ఎస్సై పి.దయాకర్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌కు చెందిన ఓంప్రకాష్ జైశ్వాల్ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు.
వ్యాపార నిమిత్తం నాగపూర్ నుంచి ఒంగోలుకు అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయల్దేరాడు. జమ్మికుంటలో ఈ రైలులోకి ఎక్కిన హిజ్రాలు ఓం ప్రకాష్ ను డబ్బులు ఇవ్వమని అడగగా ఇవ్వకపోవడంతో అతడిని కాళ్లతో తన్ని కిటికి వద్దకు నెట్టేశారు. దీంతో అతడికి తలకు తీవ్రగాయాలై రక్త స్రావం జరిగింది. హిజ్రాలు కాజీపేట–వరంగల్ మధ్య దిగి పరారయ్యారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఓం ప్రకాష్‌ను ఆస్పతికి పంపించారు. పరారైన హిజ్రాల కోసం గాలిస్తున్నారు.