Anglers
-
స్వదేశానికి పయనమైన 8 మంది జాలర్లు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో బంగ్లా జైలులో 4 నెలలుగా మగ్గిన 63 మంది భారతదేశ మత్స్యకారులు (వీరిలో 8 మంది విజయనగరం జిల్లా, పూసపాటిరేగ, తిప్పలవలస గ్రామానికి చెందిన వారు) విడుదలైన సంగతి విదితమే. భాగర్‌హాట్ జైలు నుంచి బుధవారం విడుదలైన వారిని హైకమిషన్ ఆఫ్ ఇండియా, కుల్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధిగా హాజరైన వాసుపల్లి జానకీరామ్ కలిసి అక్కడి పోలీసుల సహకారంతో మత్స్యకారులను మొంగ్లా పోర్టుకు చేర్చారు. వీరిని ఐదు బోట్ల ద్వారా భారతదేశానికి పంపించాలి. కానీ, నాలుగు నెలలుగా మొంగ్లా పోర్టులో బోట్లు నిలిపివేశారు. బోటులో ఉన్న ఐస్ కరిగిపోయి, వర్షపు నీరు ఇంజన్లలోకి ప్రవేశించడంతో బోట్లు మరమతులకు గురయ్యాయి. వీటి మరమతు అనంతరం శుక్రవారం పొద్దుపోయాక అమృత బోటులోనే స్వదేశానికి పయనమైనట్టు వాసుపల్లి జానకీరామ్ సాక్షికి తెలిపారు. స్వదేశానికి పయనమవుతున్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటామంటూ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆదివారం నాటికి కోల్‌కతా ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు వీరిని హ్యాండోవర్ చేసుకుంటారని జానకీరామ్ తెలిపారు. -
మెట్టు దిగని జాలరన్న
సాక్షి, చెన్నై: ‘అబ్బే..ఫైరింగ్ జరగనే లేదు’ అని ఓ వైపు ప్రకటించి, మరో వైపు మెట్టు దిగి మరీ ‘సారీ’తో జాలర్లను బుజ్జగించే పనిలో కోస్టుగార్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. సారీతో సరి పెట్ట వద్దంటూ పట్టువీడని విక్రమార్కుల వలే జాలర్లు పోరుబాటలో నిమగ్నం అయ్యారు. రామేశ్వరంలో సమ్మె సైరన్ మోగడంతో పాటు, గురువారం భారీ నిరసనకు జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. తమిళ జాలర్లకు కడలిలో నిత్యం శ్రీలంక సేనల రూపంలో ముప్పు ఎదురవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రక్షణగా నిలవాల్సిన భారత కోస్టు గార్డు వర్గాలు, తమ మీదే తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారి తీసింది. అయితే, తమ వాళ్లెవ్వరూ కాల్పులు జరప లేదని, అస్సలు కడలిలో అలాంటి ఘటనే జరగలేదంటూ కోస్టుగార్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జాలర్లు కపటనాటకాన్ని ప్రదర్శిస్తున్నారంటూ, ఓ కుంటిసాకును తెర మీదకు తెచ్చారు. ఫైరింగ్ జరగ లేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. నిషేధిత వలల్ని కప్పి పుచ్చడం లక్ష్యంగా జాలర్లు తమ మీద నిందల్ని వేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్ వర్గాలు రంగంలోకి దిగడం గమనార్హం. సమ్మెబాట: తమ మీద దాడికి నిరసనగా రామనాథపురం జిల్లా జాలర్లు బుధవారం భగ్గుమన్నారు. వీరికి మద్దతుగా నాగపట్నం, పుదుకోట్టై జాలర్లు కదిలే పనిలో పడ్డారు. రామేశ్వరం జాలర్లు వేటను బహిష్కరిస్తూ నిరవధిక సమ్మెబాట పట్టారు. జాలర్లు తమ వైపు నుంచి ఒత్తిడి పెంచే పనిలో పడడంతో సముద్ర తీర భద్రతా విభాగం రంగంలోకి దిగింది. కేసు నమెదు చేసిన ఆ విభాగం అధికారులు, ప్రత్యేక విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం రామేశ్వరం, కచ్చదీవు సమీపంలో పరిశీలించింది. గాయపడ్డ జాలర్లను విచారించింది. అదే సమయంలో తమ మీద ఎక్కు పెట్టిన తూటాను ఆ విచారణ బృందానికి జాలర్లు అందించడంతో కోస్టుగార్డు వర్గాలు సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. అస్సలు కాల్పులే జరగలేదన్నప్పుడు, పేలిన ఆ తూటా శకలం జాలర్లకు ఎలా చిక్కిందోనన్న ప్రశ్న బయలుదేరింది. దీంతో కోస్టుగార్డు వర్గాలు మెట్టు దిగి సారీ చెప్పుకోక తప్పలేదు. మెట్టు దిగని జాలరన్న సముద్ర తీర భద్రతా విభాగం, కోస్టుగార్డు, మత్స్యశాఖ, రెవెన్యూ అన్ని విభాగాల అధికారులు బుధవారం మధ్యాహ్నం ఆగమేఘాలపై జాలర్ల సంఘాల ప్రతినిధులకు సమాచారం అందించారు. మండపంలో ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేసిన హాజరు కావాలని ఆహ్వానం పలికారు. తొలుత ఆ సమావేశానికి వెళ్లడానికి జాలర్ల సంఘాలు నిరాకరించాయి. అయితే, స్థానిక అధికారులు ఆహ్వానించడంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలన్న భావనతో అక్కడికి వెళ్లారు. సమావేశం ప్రారంభం కాగానే, కోస్టుగార్డు తరఫున ‘సారీ’ అన్న పలుకు వినబడడం, క్షణాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం చోటు చేసుకున్నాయి. అలాగే, ఇక ప్రతి నెలలో ఓ రోజు జాలర్లు, కోస్టుగార్డుతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో సమావేశాలు జరిగే విధంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిందని సూచించారు. కోస్టుగార్డు స్థానిక అధికారుల నుంచి సారీ అన్న పలుకు విన్న జాలర్ల సంఘాల ప్రతినిధులు విస్మయంలో పడ్డారు. అయితే, ఆ అధికారులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తూటాల్ని పేల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్థానిక అధికారులు అది జరుగుతుందని, అయితే, అందుకు సమయం పడుతుందని వివరణ ఇచ్చుకున్నారు. విచారణ జరుగుతున్నదని, చర్యలు తప్పనిసరిగానే ఉంటాయన్న హామీని ఇచ్చినా, జాలర్ల సంఘాల నేతలు మెట్టు దిగ లేదు. ఇది తమ ఒక్కరి సమస్య కాదు అని, జాలర్లందరి సమస్యగా గుర్తు చేస్తూ, అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా, అంత వరకు సమ్మె కొనసాగుతుందని, ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం భారీ నిరసన కార్యక్రమం సాగుతుందని జాలర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేయడంతో రామేశ్వరంలో ఉత్కంఠ తప్పడం లేదు. ఇక, నిన్నటి వరకు ఫైరింగ్ జరగ లేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రామనాథ పురం జిల్లా రామేశ్వరానికి చెందిన జాలర్లపై భారత్ కోస్టుగార్డు వర్గాలు తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారితీసింది. ఫైరింగ్ జరగలేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. అనంతరం హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్ వర్గాలు రంగంలోకి దిగాయి. నిన్నటి వరకు ఫైరింగ్ జరగలేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఉత్కంఠ వీడలేదు. -
సముద్రంలో పడవ బోల్తా
సొర్లగొంది సమీపంలో ప్రమాదం ఐదుగురు జాలర్లు సురక్షితం కొట్టుకుపోయిన వలలు, దెబ్బతిన్న పడవ ఇంజిన్ సొర్లగొంది (నాగాయలంక) : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ సొర్లగొంది గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పడవలో ఉన్న ఐదుగురు జాలర్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. గ్రామం నుంచి గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో మేడా వేంకటేశ్వరరావుకు చెందిన చేపల పడవలో అతనితోపాటు, మేడా నాగబాబు, కొల్లాటి ఆంజనేయులు, విశ్వనాథపల్లి వీరబాబు, పెదసింగు వెంకటేశ్వరరావు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లారు. భారీ వలను చేపలకోసం జారవిడిచారు. అయితే వాతావరణంలో కనిపించిన మార్పులను గుర్తించిన ఈ జాలర్లు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తతో జారవిడిచిన వలను చేదుకుని పడవలో వేసుకుని తిరుగుముఖం పట్టారు. నదీ ముఖద్వారం సమీపంలోకి చేరుకునే సమయంలో ఒక్క ఉదుటున అలలు విరుచుకుపడటంతో పడవ తిరగబడింది. ఒడ్డునకు దగ్గరలో ఈ ఘటన జరగడంతో ఐదుగురు జాలర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో రూ.60 వేల విలువైన వలలు కొట్టుకుపోయాయని, పడవ ఇంజిన్ దెబ్బతిందని మేడా వేంకటేశ్వరరావు తెలిపారు. గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి వేరే బోటు సాయంతో దెబ్బతిన్న పడవ, ప్రమాదంలో చిక్కుకుని బయటపడ్డ జాలర్లను సాయంత్రానికి సొర్లగొంది పడవల రేవుకు చేర్చారు. పడవ బోల్తాపడిన విషయాన్ని అవనిగడ్డ మత్యశాఖ అభివృద్ధి అధికారి చెన్ను నాగబాబు ధృవీకరిం చారు. జలర్లు సురక్షితమని జరిగిన సంఘటన, నష్టం వివరాలను మత్యశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చానని ఆయన తెలిపారు. -
ఆగని దాడులు
- మరో ఏడుగురి బందీ - రిమాండ్‌కు రామేశ్వరం, - పుదుకోట్టై జాలర్లు సాక్షి, చెన్నై : రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి నాగపట్నం జాలర్లపై కోడియకరైలో శ్రీలంక సేన విరుచుకుపడింది. ఓ పడవతో పాటు ఏడుగుర్ని బంధీగా పట్టుకెళ్లారు. కడలిలో రాష్ట్ర జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వానికి హద్దులు లేకుండా పోతోంది. కేంద్రం హెచ్చరిస్తున్నా లంక సేనలు ఏ మాత్రం తగ్గడం లేదు. తమ చేతికి చిక్కిన జాలర్లను బందీలుగా పట్టుకెళ్తున్నారు. బుధవారం అర్ధరాత్రి రామేశ్వరం, పుదుకోట్టైలకు చెం దిన జాలర్లపై రెండు శ్రీలంక సేనల బృందాలు దాడు లు చేశాయి. తుపాకుల్ని ఎక్కుపెడుతూ వీరంగం సృష్టించి 46 మందిని బందీగా పట్టుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే నాగపట్నం జాలర్లపై శ్రీలంక నావికాదళం విరుచుకు పడింది. ఏడుగురి బందీ నాగపట్నానికి చెందిన జాలర్లు గురువారం అర్ధరాత్రి కోడియకరై పరిసరాల్లో చేపల వేటలో నిమగ్నమయ్యారు. వలల్ని విసిరి వేటలో ఉన్న జాలర్లకు వేకువ జామున శ్రీలంక సేనల రూపంలో ప్రమాదం ఎదురైంది. వచ్చీరాగానే గాల్లో కాల్పులు జరుపుతూ శ్రీలం క సేనలు వీరంగం సృష్టించారు. అక్కడ పదుల సంఖ్య లో ఉన్న పడవలు ఒడ్డుకు తిరుగు పయనమయ్యాయి. వలల్నితెంచి పడేశారు. ఆపై వెంబడిస్తూ వస్తున్న శ్రీలంక సేనలకు దొరక్కుండా జాలర్లు ముందుకు కదిలారు. అయితే ఒక పడవ మాత్రం శ్రీలంక సేనల చేతికి చిక్కింది. ఆ పడవలోని ఏడుగురు జాలర్లపై తుపాకుల్ని ఎక్కుపెట్టి బెదిరించారు. మిగిలిన పడవలు ఎక్కడికక్కడే ఆపేయాలని హెచ్చరించారు. అయితే పడవలు ఆగమేఘాలపై ఒడ్డుకు దూసుకెళ్లడంతో వాటిని వదలి పెట్టారు. చేతికి చిక్కిన జాలర్లను బందీగా పట్టుకెళ్లారు. నెలకొంది. వరుస దాడులు జాలర్ల సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రెకెత్తిస్తోంది. జాలర్ల విడుదలకు సీఎం జయలలిత కేంద్రానికి లేఖలు రాయడం కాదని, ఈ దాడులకు ముగింపు పలికే రీతిలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జాలర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్ని సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలకు కసరత్తులు చేస్తున్నాయి. కాగా శ్రీలంక సేనల చేతికి చిక్కిన పుదుకోట్టై, రామేశ్వరం జాలర్లను శుక్రవారం మన్నార్ కోర్టులో హాజరు పరిచారు. వారిని రిమాండ్‌కు తరలించారు. కేంద్రం ఒత్తిడి అనంతరం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఇచ్చే సంకేతం మేరకు మళ్లీ కోర్టులో హాజరు పరిచి, ఆ తర్వాత వీరిని విడుదలచేసే అవకాశం ఉంది. లేకుంటే అక్కడి జైళ్లలో మగ్గాల్సిందే.