రెండు రోజుల్లో జల్లికట్టు సమస్యకు పరిష్కారం
న్యూఢిల్లీ: జల్లికట్టు సమస్య ఒకటి రెండు రోజుల్లో పరిష్కారమవుతుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అన్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు పలు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రం గౌరవిస్తుందని అన్నారు.
తమిళనాడులో అధికార పార్టీ అన్నా డీఎంకే ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. జల్లికట్టుపై ఆర్డినెన్స్‌ను జారీ చేయాలని కోరారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడులో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులు వీరికి మద్దతు తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఈ రోజు చెన్నైలో మాట్లాడుతూ.. ఆందోళనలను విరమించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.