ఎథికల్ హ్యాకింగ్
అంకిత్ ఫాదియా
- ఎథికల్ హ్యాకర్
లేటెస్ట్ టెక్నాలజీ.. లైఫ్ స్టైల్‌నే కాదు వార్ స్టైల్‌నూ మార్చేసింది! ఇప్పుడు యుద్ధం చేయాలంటే బాంబులేసి రక్తపాతం సృష్టించాల్సిన అవసరంలేదు. ఒక్క క్లిక్‌తో అగ్రరాజ్యాలను స్తంభింపజేస్తే చాలు.. అణు విస్ఫోటం కన్నా రెండింతల నష్టం జరుగుతుంది! అదే సైబర్‌వార్. టూల్ హ్యాకింగ్! ఈ పేరు వినిపిస్తే చాలు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ గడగడా వణికిపోతాయి. అనుభవంలోకి వస్తే కుప్పకూలిపోతాయి! ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రమాదాన్ని పసిగడుతూ నెట్వర్క్ సిస్టంను కాపాలా కాసే సైనికులూ ఉంటారు. వారే ఎథికల్ హ్యాకర్స్. మనదేశంలో ఫస్ట్ ఎథికల్ హ్యాకర్ అంకిత్ ఫాదియా. 29 ఏళ్ల ఈ టెక్ జంకీ కంప్యూటర్ సేఫ్టీ మీద ఇప్పటికే 15 పుస్తకాలు రాశారు. తన పదహారో పుస్తకం ‘సోషల్ : 50 వేస్ టు ఇంప్రూవ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్’ విడుదల చేయడానికి హైదరాబాద్ వచ్చారు. తొందర్లోనే వైఫై జోన్‌గా మారుతున్న హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ, సోషల్హబ్లో మహిళా భద్రతపై అంకిత్ చెప్పిన విషయాలు...
నేను మూడు నెలలకొకసారి హైదరాబాద్ వస్తుంటాను. ఇక్కడి నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌లకు, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్‌లో మిలిటరీ అధికారులకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ట్రైనింగ్ ఇస్తుంటాను. తొందర్లోనే హైదరాబాద్‌ను వైఫై సిటీగా మారుస్తున్నారన్న వార్త విన్నాను. అందుకు అనువైన నగరం ఇది. సిటీ వైఫై జోన్‌గా మారిన తర్వాత విదేశీ కంపెనీలు భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే మొదటి ఆరు నెలలు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తుందన్న వార్త వినిపిస్తోంది. దీని వల్ల భద్రతా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫ్రీ యాక్సెస్ వల్ల ఇంటర్నెట్ వినియోగదారుడి ఐడెంటిటీ తనిఖీ కష్టం అవుతుంది. ఫ్రీ యాక్సెస్ ఇవ్వాలనుకుంటే ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ పద్ధతి అనుసరించాలి. దీని వల్ల వినియోగదారుడి మొబైల్ ఫోన్‌కు పాస్వర్డ్ పంపించి.. దాని సహాయంతో లాగిన్ అయ్యేలా చూడాలి. దీని వల్ల రిస్క్ కొంత తగ్గుతుంది.
శిక్షణ పెరగాలి..
ఈ కాలంలో పర్సనల్, ఫైనాన్షియల్, చివరకు అఫీషియల్ ఇలా ఏ సమాచారమైనా క్షణాల్లో ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతోంది. ముంబై స్టాక్ మార్కెట్ మీద హ్యాకర్లు దాడి చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ పెరగాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఇప్పుడు దేశంలో సైబర్ సెక్యూరిటీని అంచనా వేయడానికి 4.75 లక్షల మంది ఎథికల్ హ్యాకర్లు అవసరం. మన దగ్గర కేవలం లక్ష మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీన్ని అధిగమించాలంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో హ్యాకింగ్ మీద ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టాలి.
మహిళలపై ప్రభావం ఎక్కువ
ఇంటర్నెట్ వాడకంలో మహిళలకు, పురుషులకు ప్రమాదాలు ఒకేలా ఉన్నాయి. అయితే వాటి ప్రభావం అమ్మాయిలపై ఎక్కువగా ఉంటోంది. అందుకే మహిళలకు జాగ్రత్త తప్పనిసరి. ముంబైలో ఒక అమ్మాయి ప్రతిరోజు ఓ వ్యక్తితో చాటింగ్ చేసేది. ఈ వ్యవహారాన్ని గమనించి ఒక హ్యాకర్ స్పైవేర్‌ను ఆమె కంప్యూటర్లోకి పంపి ఆ అమ్మాయి వెబ్‌క్యామ్‌ని ఆన్ చేశాడు. సైబర్ క్రైమ్‌కి సంబంధించి ఇది చాలా పెద్ద నేరంగా నమోదైంది. అమ్మాయిలే కాదు ఎవరైనా సరే తమ సెల్ఫీస్ను డెరైక్ట్‌గా సోషల్ నెట్వర్కింగ్ సిస్టమ్స్‌లోకి అప్లోడ్ చేస్తే, వాళ్ల డీటెయిల్స్ అన్నీ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. తక్కువ రిజల్యూషన్ ఫొటోలనే అప్లోడ్ చేయాలి. దీని వల్ల మార్ఫింగ్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఏ సోషల్ నెట్వర్కింగ్లో అయినా.. పని అయిపోయాక లాగ్ అవుట్ కావడం మరచిపోవొద్దు.
- సరస్వతి రమ