హడలెత్తించిన శ్రవణ్, అనికేత్
జింఖానా, న్యూస్‌లైన్: బౌలర్లు శ్రవణ్ కుమార్ (3/30), అనికేత్ రెడ్డి (3/4) విజృంభించి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంతో నిజామాబాద్ జట్టుకు విజయం చేకూరింది. అంతర్ జిల్లా అండర్-16 వన్డే టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ 70 పరుగులకే చేతులెత్తేసింది.
అనంతరం బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు 71 పరుగులు చేసింది. మరో వైపు మెదక్, కరీంనగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ 166 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ 35 పరుగులు చేశాడు. తర్వాత బరిలోకి దిగిన కరీంనగర్ 4 వికెట్లకు 54 పరుగులు చేయగా... వర్షం కురవడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. దీంతో పాటు ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా కొసరాజు, సీసీఓబీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.