నేటికీ అందని నజరానా..
మార్కాపురం : ‘ఎన్నికలు జరగకుండా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందజేస్తాం.. ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ప్రజల మధ్య స్నేహభావం కూడా పెంపొందుతుంది..’ ఈ మాటలు అన్నది సాక్షాత్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి. పంచాయతీల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నకుంటే ప్రోత్సాహ కాలు అందజేస్తామని, తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు.
అంతేకాదు గ్రామీణుల మధ్య వివాదాలు ఉండవని, అంతా స్నేహపూర్వకంగా మెలుగుతారని సీఎం చెప్పుకొచ్చారు. ఇంకేముంది జిల్లాలో కొన్ని పంచాయతీల సర్పంచ్‌లను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు పూర్తయి 11 నెలలు దాటినా నిధులు విడుదల చేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
= రాష్ట్ర ప్రభుత్వం ప్రొత్సాహక నిధులు విడుదల చేయకపోవటంతో సర్పంచ్‌ల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.
= దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో నోటిఫైడ్ ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షలు, నాన్ నోటిఫైడ్ పంచాయతీలకు రూ. 5 లక్షలు విడుదల చేశారు.
= ఆ నిధులతో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు పంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు.
= గత ఏడాది జూలైలో జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లా మొత్తం మీద 1028 గ్రామ పంచాయతీలుండగా అందులో 125 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
= మార్కాపురం డివిజన్లో 25 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
= ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు, భూమి పన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, సీనరేజీ ద్వారా మాత్రమే ఆదాయం వస్తోంది.
= సర్పంచ్‌లుగా ఎన్నికై నెలలు కావస్తున్నా ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా జాప్యం చేయటంతో పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోందని ఏకగ్రీవ సర్పంచ్ లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
= 13వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయిస్తారు. ఈ నిధులను ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేస్తోంది.
= అరకొర నిధులతో ఆశించిన స్థాయిలో పంచాయతీల్లో అభివృద్ధి జరగడం లేదు.
= మార్కాపురం మండలం ఇడుపూరు, గోగులదిన్నె గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
= కొనకనమిట్ల మండలం వింజవర్తిపాడు, నాగరాజుకుంట, నాగిరెడ్డిపల్లె, సిద్ధవరం, నాగంపల్లి, కాట్రగుంట, తువ్వపాడు, బచ్చలకూరపాడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
= పొదిలి మండలం అన్నవరం, ఈగలపాడు, మాదాలవారిపాలెం, నందిపాలెం, ఓబులక్కపల్లె, పాములపాడు, తలమళ్ల, సూదనకుంట, జువ్వలేరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
= పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం, మల్లాపాలెం ఏకగ్రీవమయ్యాయి. ప్రొత్సాహక నిధులు ఇస్తే ఏకగ్రీవ పంచాయతీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, వేసవిలో తాగు నీటి ఎద్దడి నివారణకు డీప్‌బోర్ల ఏర్పాటు, డ్రైనేజీలు నిర్మించుకునే అవకాశం ఉందని సర్పంచ్‌లు చెబుతున్నారు.
= ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలోనైనా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు.
నిధులు విడుదల చేయాలి : రామాంజులురెడ్డి, ఇడుపూరు
ఏకగ్రీవ సర్పంచ్
మా గ్రామ ప్రజలు సర్పంచ్‌గా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏడాది కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకూ ప్రొత్సాహక నగదు విడుదల చేయలేదు. ఆ నిధులు వస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏకగ్రీవ పంచాయతీలకు ప్రొత్సాహక నిధులు విడుదల చేయాలి.