అమెరికా షట్‌డౌన్
వాషింగ్టన్: అమెరికా శ్వేతసౌధం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒబామాకేర్ హెల్తపాలసీకి కాంగ్రెస్‌లో చుక్కెదురైంది. అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరుతో ప్రఖ్యాతి పొందిన ఈ పథకంపై ప్రతిష్టంభన ఏర్పడడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెంటనే మూసివేయాలని వైట్‌హౌస్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత అమెరికాలో ప్రభుత్వ సంస్థలు మూతపడనున్నాయి.ప్రతిపౌరుడికి హెల్తపాలసీ ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిన బిల్లుకు నిధులు సమకూర్చే అంశంపై అటు సెనేట్‌లోనూ, ఇటు ప్రతినిధుల సభలోనూ ఏకాభిప్రాయం రాలేదు. దీంతో బడ్జెట్ ఆమోదించాల్సిన చివరి రోజు కూడా ప్రతిష్టంభన కొనసాగింది. బడ్జెట్ ఆమోదించకుండానే సభ ముగిసింది. ఒబామాకేర్ విషయంలో రిపబ్లిక్, డెమోక్రాటిక్ పార్టీల మధ్య సోమవారం అర్ధరాత్రి వరకూ చర్చలు జరిగినా ఏవిధమైన ఒప్పందం కుదరలేదు.
అంతకు ముందు ఈ వ్యయ బిల్లును సెనేట్ తిప్పిపంపింది. దీనిపై ప్రతిష్టంభన తొలగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రిపబ్లికన్లు సెనేట్ను కోరారు. అయినా అది కార్యరూపం దాల్చలేదు. సెనేట్‌లో మెజారిటీగా ఉన్న డెమోక్రాట్ సభ్యుల లీడర్ హ్యారీ రీడ్ దీనిని ఒక గేమ్ ప్లాన్‌గా అభివర్ణించారు. చర్చలు జరుగుతున్న సందర్భంలో షట్‌డౌన్ ప్రతిపాదనలు రావడంతో ‘తలపై గన్ను పెట్టి బెదిరిస్తే తాము చర్చల్లో పాల్గొనేది లేదని’ చెప్పారు. సెప్టెంబర్ 30తో పూర్తయే ఆర్థిక సంవత్సరం చివరి రోజున కొత్త బడ్జెట్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయినా ఎక్కువగా నిధులు ఖర్చయ్యే ఒబామాకేర్పై కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి రాలేక పోయింది. ‘కాంగ్రెస్ తన బాధ్యతను నిర్వర్తించలేదు. బడ్జెట్‌ను ఆమోదించడంలో విఫలమైంది. మళ్లీ నిధులు ఇచ్చే వరకూ ప్రభుత్వం షట్‌డౌన్ చేయాలి’ అని ఒబామా వీడియో సందేశమిచ్చారు.
కాంగ్రెస్ సభ్యులపై కూడా ఆయన విరుచుకు పడ్డారు. ‘మీరు చేసే పనికి మీకు డబ్బులు రావు. ఏమనుకున్నారో అదే చేస్తున్నారు. న్యాయ సూత్రాలు మీకు నచ్చవు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రక్షణ వ్యవస్థకు మాత్రం అత్యవసరనిధి నుంచి నిధులు సమకూరుస్తామని తెలిపారు. ఈ షట్‌డౌన్ వల్ల సైనికులకు, వారి కుటుంబాలకు తలెత్తే ఇబ్బందులను తొలగించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. ఇక షట్డౌన్పై బడ్జెట్ డెరైక్టర్ సిల్వియా మాథ్యూస్ బర్వెల్కు మార్గదర్శకాలు అందాయి. అత్యవసర కార్యక్రమాలకు నిధులు సమకూర్చేందుకు మధ్యంతర బడ్జెట్‌ను ఆమోదించేలా తీర్మానం చేయాలని కాంగ్రెస్‌కు సూచించాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కాగా, ఒబామా కేర్‌ను అంగీకరిస్తే ప్రభుత్వం భరించలేనంత నిధులు ప్రతిపాదిత కార్యక్రమానికి కేటాయించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ పాలసీలో మెడికల్ డివైస్ ట్యాక్స అనే విధానం వల్ల ఇతర దేశాల వారికి ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆ పక్షాలు చెప్పాయి.
షట్‌డౌన్ సమయంలో అత్యవసర సేవలందించే సంస్థలు తప్ప ఇతర సంస్థలు మూసివేస్తారు. ఈ సమయంలో ఉద్యోగులకు జీతాలు కూడా అందవు. మూసివేత ప్రభావం 8 లక్షల మంది ఉద్యోగులపై ప్రత్యక్షంగా పడనుంది. కోర్టు వాదనలు కూడా వాయిదా పడ్డాయి. ఈ షట్‌డౌన్ సమయం ఎంతకాలం కొనసాగుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. ఒక నెల సాగినా జీడీపీపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో 1996లో బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో 21 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగింది. ప్రస్తుత షట్‌డౌన్ నోటీస్ ప్రభావం ఆయిల్ ధరలపై వెంటనే పడింది. సోమవారం 54 సెంట్లు తగ్గగా మంగళవారం నాటికి అది మరింత క్షీణించి మరో 35 సెంట్లు పడిపోయింది. బ్యారెల్ 101.99 డాలర్ల ధర పలికింది. ఉద్యోగులకు జీతాలు లేకపోవడంతో ఆ ప్రభావం చమురు ధరలపై పడుతుందని, అందుకే ధరలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. 68 శాతం వ్యతిరేకత
ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలన్న నిర్ణయాన్ని అమెరికాలోని 68 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని రోజుల పాటు మూత పడ్డా అది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అయితే మిగిలిన వారు ఇది మంచినిర్ణయమేనని కొనియాడారు. ఈ చర్య అమెరికా భవిష్యత్‌ను దెబ్బకొట్టడమేనని డెమోక్రాటిక్, రిపబ్లిక్ పార్టీల అభిమానులు అభిప్రాయపడ్డారు. భారత్‌పై ప్రభావం
అమెరికా షట్‌డౌన్ ప్రభావం భారత్‌పై పెద్ద ఎత్తున పడుతుందని ఈఈపీసీ ఇండియా చెప్పింది. అత్యవసర సర్వీసులకే అమెరికాలో మినహాయింపు ఉన్నందున కమర్షియల్ పోర్టుల్లో దిగుమతులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇది అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా చెప్పారు. అమెరికా దిగుమతుల్లో 12-14 శాతం భారత్ నుంచే ఉంటాయని, వీటిలో ఇంజనీరింగ్ ఉత్పత్తులు 20 శాతంగా ఉన్నాయని తెలిపారు. 2012-13లో 36 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు భారత్ చేసిందని ఆయన వెల్లడించారు. మూతబడే కార్యాలయాలు: 19 మ్యూజియంలు, గ్యాలరీలతో పాటు అన్ని జాతీయ జూపార్కలు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, యోసెమైట్, అల్కట్రాజ్ లాంటి నేషనల్ పార్కలు.
ఉద్యోగులపై ప్రభావం: డిఫెన్స- 4 లక్షలు, వాణిజ్యం-30 వేలు, ఎనర్జీ-12,700, రవాణా-18,481
ఇతర సంస్థలు: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, జాతీయ భద్రత, అణు ఆయుధాలు, ఇంధన సంస్ధలు, ఫెడరల్ రిజర్వ, న్యాయ వ్యవస్థ
ప్రభావం పడని సంస్థలు: పోస్టల్ డిపార్టమెంట్, విద్యాసంస్థలు, డిఫెన్స్