కరోనా ఇండియన్ స్ట్రెయిన్ చాలా ఫాస్ట్!
న్యూఢిల్లీ: కరోనా ఇండియన్ స్ట్రెయిన్ (బి. 1. 617 వేరియంట్) యూకే వేరియంట్‌లాగానే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని, అయితే ఇది అత్యంత ప్రాణాంతకం (లీథల్) అనేందుకు ఆధారాలు స్వల్పమని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. సార్స్– సీఓవీ2(కరోనా వైరస్) బి. 1. 617 వేరియంట్‌ను డబుల్ మ్యూటెంట్ లేదా ఇండియన్ స్ట్రెయిన్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో సెకండ్ వేవ్ సందర్భంగా ఈ వేరియంట్ అధికంగా కనిపించింది. మహారాష్ట్రలో దాదాపు 50కిపైగా కేసుల్లో ఈ వేరియంట్ కనిపించిందని, యూకే వేరియంట్ 28 శాతం మేర కనిపించిందని ఎన్సీడీసీ డైరెక్టర్ సుజిత్ సింగ్ గతవారం చెప్పారు.
కొన్ని వారాలుగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒక్కసారిగా కరోనా విజృంభించింది. పలు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క బాధితులు పలు ఇక్కట్లు పడుతున్నారు. అయితే ఈ రెండు వేరింట్లు అత్యంత ప్రమాదకారులని చెప్పలేమని, కానీ యూకే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకమైతే, భారత వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే రకమై ఉండొచ్చని ఐజీఐబీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ విషయం నిరూపణకు మరిన్ని పరిశోధనలు చేయాల్సిఉందన్నారు.
గతేడాదితో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో మరణాలు పెరగడానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణమైఉంటుందన్నారు. ఎక్కువమంది వ్యాధికి గురైతే మరణాలు కూడా ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. భారత్ వేరియంట్లో మూడు రకాల సరికొత్త ప్రొటీన్ ఉత్పరివర్తనాలున్నాయని ఆయన వివరించారు. ఇండియన్ స్ట్రెయిన్ ప్రాణాంతమైనదని చెప్పేందుకు సంపూర్ణ ఆధారాల్లేవని ఎన్సీబీఎస్ డైరెక్టర్ సౌమిత్ర దాస్ తెలిపారు. భారత్‌లో కనిపిస్తున్న వేరియంట్లు వాక్సిన్‌కు లొంగేవేనని, ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు వీటిపై సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని గతవారం జరిగిన వెబ్‌నార్‌లో ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బీ. 1. 617 వేరియంట్‌పై కోవిషీల్డ్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని సీసీఎంబీ సైతం వెల్లడించింది.