యువకుడి ఔదార్యం
అప్పలఅగ్రహారం(సంతకవిటి), న్యూస్‌లైన్ : ఖాళీ స్థలం కనిపిస్తే చాలు..కబ్జా చేసే రోజులివి. అలాంటిది సొంత స్థలాన్ని ఒక సామాజిక అవసరానికి విరాళంగా ఇవ్వడం నిజంగా ఉదాత్త నిర్ణయమే. అదీ పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఒక యువకుడు ఈ నిర్ణయం తీసుకోవడం.. దానికి సాక్షి పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన జనసభ వేదిక కావడం విశేషం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొన్నాళ్లుగా గ్రామాల్లో జనసభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సంతకవిటి మండలం అప్పల అగ్రహారంలో బుధవారం జరిగిన జనసభలో పలువురు యువకులు, వివేకానంద యూత్ సంస్థ సభ్యులు గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న ఎంపీడీవో ఎల్.త్రినాథరావును కోరారు. ఆయన స్పందిస్తూ స్థలం సమస్యగా ఉందని, ఎవరైనా స్థలం చూపిస్తే గ్రంథాలయం ఏర్పాటుకు వెంటనే నిధులు మంజూరు చేస్తానన్నారు.
దాంతో సభలోనే ఉన్న చిగులపల్లి ఉపేంద్రనాయుడు అనే యువకుడు కలగజేసుకొని ప్రధాన రహదారి పక్కనే ఉన్న తన స్థలంలో గ్రంథాలయానికి ఎంత అవసరమైతే అంతా ఇస్తానని సభా ముఖంగా ప్రకటించాడు. ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాలని, పంచాయతీ సర్పంచ్ ఆమోద పత్రం కూడా కావాలని అధికారులు సూచించడంతో.. అక్కడికక్కడే పెద్దలు, సభలో పాల్గొన్న ప్రజల సమక్షంలో స్థలం విరాళంగా ఇస్తానని రాసి ఇచ్చాడు. అక్కడే ఉన్న సర్పంచ్ దవళ సీతమ్మ కూడా వార్డు సభ్యులందరితో మాట్లాడి పంచాయతీ తరఫున త్వరలోనే ఆమోద పత్రం ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉపేంద్రనాయుడు డిగ్రీ వరకు చదువుకున్నా.. తనకున్న ఐదారు ఎకరాల భూమినే సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనలాంటి చదువరుల కోసం గ్రంథాలయం ఏర్పాటుకు ఆయన ఉదారంగా ముందుకు రావడం ముదావహమని.. సాక్షి జనసభ వల్లే దీర్ఘకాల సమస్య పరిష్కారమైందని వివేకానంద యూత్ సభ్యులు సీహెచ్ సత్యనారాయణ, ఎ.రమేష్, డి.శ్రీనివాసరావు, జి.తవిటినాయుడు, ఇతర గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.