Apparatus
-
పోలీసులంటే ఇంకా భయమే
గాంధీనగర్: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్ఆర్యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు. విపరీతమైన పనిభారం పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్ఆర్యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్ఆర్యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్ఆర్యూ స్థాపన జరిగింది. రెండు రోడ్ షోలు వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్ పటేల్ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది. -
సెంట్రల్ బ్లడ్‌ప్రషర్ అంటే...?
బ్లడ్‌ప్రషర్ కౌన్సెలింగ్ ఒకసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నాకు మామూలు బీపీ చూడడంతో పాటు ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ కూడా చూశారు. ఈమాట వినడమే కొత్త! సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? దీనికీ, మామూలుగా కొలిచే బ్లడ్ ప్రెషర్‌కూ తేడా ఏమిటి? - సుహాసిని, చెన్నై సాధారణంగా మనం బ్లడ్ ప్రెషర్‌ను బీపీ ఆపరేటస్‌తో కొలుస్తుంటాం. ఇందులో ఒక పట్టాలాంటి దాన్ని చేతికి కట్టులా కట్టి, దాన్ని గాలితో నింపి, బిగిసేలాచేసి, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు వేగాన్ని కొలుస్తాం. దీన్నే బీపీ అంటారు. రక్తపోటును గుండె దగ్గరే కొలిస్తే... ఆ విలువ సరైనది అని వైద్యనిపుణులు అభిప్రాయం. అలా నేరుగా గుండె స్పందించినప్పుడు అక్కడి రక్తనాళాల్లో రక్తపీడనాన్ని కొలుస్తారు. ఇలా నేరుగా తీసుకున్న గుండెదగ్గరి రక్తనాళాల్లోని రక్తపు పీడనాన్ని ‘సెంట్రల్ బ్లడ్ ప్రెషర్’ అంటారు. ఇటీవల ఈ విధమైన సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌ను కొలవడానికి ఒక పెన్ వంటి సాధనాన్ని రూపొందించారు. దీని కొనను మణికట్టు (రిస్ట్) వద్ద ఉండే నాడి దగ్గర మృదువుగా ఆనించి, ఆ వచ్చిన కొలతలను కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. ఆ ‘పల్స్ వేవ్’ విలువలను కంప్యూటర్ గణించి, నేరుగా గుండెదగ్గరి రక్తనాళాల్లో రక్తపోటు ఎంత ఉందో లెక్కలు వేస్తుంది. దీని ఆధారంగా మనం గుండెదగ్గరి రక్తపోటును తెలుసుకుంటామన్నమాట. ఇలా నేరుగా గుండెదగ్గర అది స్పందించినప్పుడు రక్తం తొలుత గురైన పీడనాన్నీ అంటే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌నూ, సాధారణంగా చేతి దగ్గర పట్టా చుట్టి, అందులో గాలి నింపి తీసుకునే సాధారణ బ్లడ్ ప్రషర్‌నూ తెలుసుకుంటూ ఇంకా ఈ విలువలను సరిపోల్చి చూస్తున్నారు. మామూలుగా మనం చేతి దగ్గర తీసే బ్లడ్‌ప్రెషర్‌ను కొన్ని కోట్లమందిలో అనేకసార్లు గణించి సాధారణ రక్తపోటు ప్రమాణాన్ని ‘120/80’గా నిర్ణయించాం. కానీ సెంట్రల్ బ్లడ్‌ప్రెషర్‌తో తీసే విలువలకు ఇంకా నిర్ణీత ప్రమాణాలను రూపొందించలేదు. ఎందుకంటే మన రక్తపోటు క్షణక్షణానికీ మారిపోతూ ఉంటుంది. అంతేగానీ స్థిరంగా ఉండదు. కాబట్టి ఒక స్థిరమైన నార్మల్ విలువ వచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇంకా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. త్వరలోనే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్‌కూ ‘ప్రమాణాలను’ రూపొందిస్తే అప్పుడు మామూలు బ్లడ్‌ప్రెషర్ స్థానాన్ని ఆధునికంగా తీసే సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ విలువలు ఆక్రమించడం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ల అంచనా. ప్రస్తుతానికి ఈ సెంట్రల్ బ్లడ్ ప్రెషర్ కొలవడం ఇంకా అన్నిచోట్లా అందుబాటులోకి రాలేదు కాబట్టి అప్పటివరకూ సాంప్రదాయికంగా మనం కొలిచే సాధారణ రక్తపోటు విలువలనే ఇంకా తీసుకుంటున్నాం. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్