ఆ తెర తీయగ రాదా?
విశ్లేషణ
గుమాస్తాలు, అధికారులు, ఇంజనీర్లు, పంతుళ్ల నియామక వివరాలు ప్రజల సమక్షంలో ఆర్టీఐలో అడిగితే ఇవ్వాలన్న నియమాలు అమలు అవుతున్నప్పుడు, పై స్థాయిలో జరిగే నియామకాలలో దాపరికం ఎందుకు?
న్యాయమూర్తుల నియామకాల నియమావళిని మెరుగు పరచవలసి ఉందనీ, ఆ విధానంలో పారదర్శకత తీసుకురావాలనీ న్యాయ వ్యవస్థ పెద్దలు అనుకుంటున్నదే. అందులో కొన్ని తీవ్ర లోపాలున్న సంగతిని ఒక దశలో గుర్తించామని కూడా వారు అన్నారు. కార్యవర్గ ప్రభుత్వం, న్యాయవ్యవస్థ దాపరికాన్ని ఏ మేరకు పరిమితం చేయాలనే అంశంపై వారు తర్జన భర్జన పడుతున్నారు. న్యాయమూర్తుల నియామకాల కమిషన్ ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొట్టేసినా, నియామక పద్ధతుల్లో మార్పులు తేవాలనే భావిం చింది. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బ తీయకుండా ఈ నియమాలు ఉండాలనీ, ఆ వ్యవస్థ ఔన్నత్యాన్ని సార్వభౌమత్వాన్ని కాపాడాలనీ అంతా ఆశిస్తున్నదే. అది ఏవిధంగా అనే అంశంపైన మల్ల గుల్లాలు.
నిజానికి న్యాయమూర్తుల నియామకాల్లో పైచేయి కోసం రెండు మూల స్థంభాలు నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాయి. పారదర్శకత ఉండాలనీ, అది ఆర్టీఐ కిందకు రావాలనీ ప్రభుత్వం మొదట అనుకున్నదనీ; ఆ తరువాత ఆర్టీఐ లేకుండానే ఆ పారదర్శకత ఏదో తేవచ్చు కనుక ఆర్టీఐ వర్తింపు అవసరం లేదని ఆలోచిస్తున్నారనీ పత్రికా కథనాలు వస్తున్నాయి. కాబట్టి ఈ నియామక నియమాల రూపకల్పన కూడా పారదర్శకంగా జరగడం సమంజసం. ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పాలి?
1. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా న్యాయమూర్తికి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించే ముందు సేవాకాలపు ఆధిక్యత (సీనియారిటీ, నైపుణ్యం), నిబద్ధత పరిశీలించాలి. 2. ప్రధాన న్యాయమూర్తులు ఎవరెంత కాలం పనిచేశారనే అంశాన్ని మరువరాదు. సుదీర్ఘానుభవం ఉన్నవారిని నిరాకరిస్తే కారణాలను తెలియజే యాలి. 3. విశిష్ట సేవలందించినట్టు రుజువులున్న న్యాయవాదులు లేదా న్యాయవేత్తల నుంచి గరి ష్టంగా ముగ్గురిని న్యాయమూర్తులుగా నియమిం చాలి. 4. కొలీజియం పెద్దలకు న్యాయమూర్తుల ఎంపికలో సహాయం చేసేందుకు ఒక సచివాలయ వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థలో జడ్జిల డేటాబేస్, కొలీజియం సమావేశాల ఏర్పాటు, సమావేశ చర్చా వివరాల రికార్డులు, ప్రతిపాదిత అభ్యర్థుల గురించి సిఫార్సులు, ఫిర్యాదులు స్వీకరించే ఏర్పాటు ఉండాలి. 5. జాతీయ భద్రతా అంశాలపైన, బహుళ ప్రజాశ్రేయో కారణాలపైన కొందరిని నియమించాలనే కొలీజియం ప్రతిపాదనను తిరస్కరించే వీలు ఉండాలని ప్రభుత్వం భావించినట్టు తెలిసింది.
ఈ అంశంపైన పార్లమెంటరీ స్థాయీ సంఘం చర్చల్లో అభ్యంతరాలు వచ్చాయి. అవి–సీనియర్ జడ్జి ప్రతిపాదనను పక్కన పెట్టినప్పుడు కారణాలు ఇవ్వాలనడం నష్టదాయకం. ఆ కారణాల నమోదు వారి భవిష్యత్ పదోన్నతి అవకాశాలను దెబ్బతీస్తుంది. మూడో అంశంలోని ‘ముగ్గురు’ నియామకం అనడం ద్వారా న్యాయవాదులు, న్యాయవేత్తల నుంచి ఎందరిని తీసుకోవాలనే అంశంపైన రాజ్యాంగంలో లేని పరిమితులను విధించినట్టవుతుంది. జాతీయ భద్రత, ప్రజాశ్రేయో నియమాలు చేర్చితే కొలీజియం సిఫార్సులపైన వీటో అధికారం ప్రభుత్వానికి దక్కే అవకాశం ఉంది. రాజ్యాంగం ఇవ్వని వీటో అధికారాన్ని ప్రభుత్వం ఏ విధంగా నియమాల్లో సృష్టిస్తుందన్నది ప్రశ్న.
కొలీజియం సమావేశాలు చర్చల సారాంశాన్ని, అభ్యంతరాలు సిఫార్సుల వివరాలను నమోదు చేయడం గురించి న్యాయవ్యవస్థలో విభేదాలున్నాయని, న్యాయమూర్తుల నియామకాల వివరాలను ఆర్టీఐ కిందకు తేకుండా ఉండేందుకు ప్రభుత్వం అంగీకరించిందనీ పత్రికలు రాస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత లేదనీ, తెరలు తొలగించాల్సిన అవసరం ఉందనీ, ప్రతి నియామకం ఆర్టీఐ పరీక్షకు నిలబడాలనీ మొదట అభిప్రాయపడిన పెద్దలు, ఇప్పుడూ అదే పంథాలో ఉన్నారా లేక పట్టు సడలించారా? ఈ విషయంలో ప్రభుత్వవర్గాలు మనసు మార్చుకున్నట్టు, ఆర్టీఐ పరిధిలోకి తేకుండానే పారదర్శకత సాధించవచ్చుననే అభిప్రాయానికొచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి.
ప్రభుత్వ రంగంలో, రాజ్యాంగాధికార హోదా ల్లో ఉన్నతస్థాయి నియామకాలన్నీ పారదర్శకంగా ఎందుకు ఉండరాదు? ప్రధాని, సీఎం, మంత్రుల నియామక వివరాలు అందరికీ ఎందుకు తెలియకూడదు? ముఖ్యంగా ఎన్నికల్లో గందరగోళ ఫలితాలు వచ్చినపుడు ఎవరి మద్దతుతో, ఎవరికి, ఏ కారణాలతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారో వివరాలు ప్రజలకు ఎందుకు తెలియకూడదు? గుమాస్తాలు, అధికారులు, ఇంజనీర్లు, పంతుళ్ల నియామక వివరాలు ప్రజల సమక్షంలో ఆర్టీఐలో అడిగితే ఇవ్వాలన్న నియమాలు అమలు అవుతున్నప్పుడు, పై స్థాయిలో జరిగే నియామకాలలో దాపరికం ఎందుకు? (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయమంత్రిత్వ శాఖ Q CIC/VS/A/2014/0009 89&SA– అ కేసులో 3.5. 2017 నాడు సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com