APPS AND SOFTWARE
-
వార్నింగ్: షార్క్‌బాట్ వచ్చేసింది.. మీ స్మార్ట్ఫోన్లలో ఆ యాప్స్‌ని డెలీట్ చేయండి!
గత దశబ్ద కాలంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు కూడా ఉంటాయని సైబర్ నిపుణులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. తాజాగా గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్వేర్ షార్క్‌బాట్ (SharkBot Malware) అనే వైరస్ ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. ఇది యాంటీవైరస్, క్లీనర్ వంటి యాప్‌ల రూపంలో ఉంటుంది. ఇన్స్టాల్ చేస్తే ఇక అంతే.. అల్బెర్టో సెగురా అనే మాల్వేర్ విశ్లేషకుడు ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తం చేసేందుకు తన ట్విట్టర్లో ఈ డేంజరెస్ సాఫ్ట్వేర్ గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో.. ప్రధానంగా ఇది మిస్టర్ ఫోన్ క్లీనర్( Mister Phone Cleaner), కైల్హావీ మొబైల్ సెక్యూరిటీ ( Kylhavy Mobile Security) యాప్‌ల రూపంలో దాగి ఉంటుంది. ముఖ్యంగా యూజర్ల బ్యాంకింగ్, క్రిప్టో సంబంధిత యాప్‌లను ప్రభావితం చేస్తుందన్నారు. అంతేకాకుండా అకౌంట్స్ నుంచి కుకీలను దొంగిలించగలదని చెప్పారు. ఈ మాల్వేర్ షార్క్‌బాట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, డివైజ్‌లోని 'ఫింగర్‌ప్రింట్‌తో లాగిన్' ఫీచర్‌ని పని చేయకుండా చేస్తుంది. దీంతో యూజర్ తప్పకుండా తన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజర్లు పాస్వర్డ్, యూజర్ డీటైల్స్‌ను ఎంటర్ చేయాల్సి వస్తుంది. షార్క్‌బాట్ టూ- ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను కూడా అధిగమించగలదు. చివరికి ఈ మాల్వేర్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ టెక్నిక్ ఉపయోగించి యూజర్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం ప్రారంభిస్తుంది. కనుక ఆ రెండు యాప్‌లు డౌన్లోడ్ చేసేముందు జాగ్రత్త వహించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. గణాంకాల ప్రకారం, మిస్టర్ ఫోన్ క్లీనర్ యాప్‌ని ఇంతవరకు 50,000 పైగా డౌన్లోడ్ నమోదు కాగా, Kylhavy మొబైల్ సెక్యూరిటీ యాప్ భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, ఈ యాప్ 10,000 కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఉన్నట్లు తెలుస్తోంది. -
దేశీ యాప్‌లపై దృష్టి
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో పాల్గొనాలని ప్రధాని మోదీ స్టార్టప్‌లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్ తయారీ యాప్‌లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలని ఆయన కోరారు. ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్‌లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రారంభించడం గమనార్హం. ఈ చాలెంజ్ ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్‌ను రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ‘ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్‌లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో’అని ఆయన లింక్డ్ ఇన్‌లో వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి ‘మేడ్ ఇన్ ఇండియా యాప్స్’ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉందని తెలిపారు. వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఇది సాయపడుతుందని చెప్పారు. టెక్ రంగానికి చెందిన వారంతా ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. కోవిడ్ సృష్టించిన అనేక సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, విద్య రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బీజేపీ శ్రేణులకు ప్రశంస లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధాని మోదీ అతిపెద్ద సేవా యజ్ఞంగా పేర్కొన్నారు. శనివారం ఆయన ఏడు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతలతో ఆన్లైన్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడారు. బుద్ధుని బోధనలు..నేటి సవాళ్లకు పరిష్కారాలు బుద్ధ భగవానుని బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ నాడు పాటించే ధమ్మ చక్ర దినం సందర్భంగా ప్రధాని వర్చువల్ ప్రసంగం చేశారు. ఆశ, ప్రయోజన పూర్వక జీవితమే మానవ దుఃఖాలను దూరం చేసే మార్గమని బుద్ధ భగవానుడు సారనాథ్‌లో తన మొదటి సందేశంలోనే చెప్పారన్నారు. తోటి వారిలో జీవితం పట్ల ఆశను ప్రేరేపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్‌లో శుక్రవారం పర్యటన సందర్భంగా సింధు నది ఒడ్డున చేసిన సింధుపూజ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. -
ఎక్కడో ఉండి, మరెక్కడో ఉన్నట్లు సెల్ఫీ దిగొచ్చు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల పట్ల పెరుగుతున్న మోజును దృష్టిలో పెట్టుకొని ఇందులో విప్లవాత్మక మార్పులకు తెరతీసింది ఫేస్బుక్. ప్రస్తుతం మనకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన వారితో సెల్ఫీ తీసుకోవాలంటే నచ్చిన వారిని తీసుకొని ఆ నచ్చిన ప్రాంతానికి భౌతికంగా వెళ్లాల్సిందే. ఇకముందు అలాంటి అవసరం ఉండదు. ఎక్కడ ఉన్నా మరో ప్రాంతంలో ఉన్నట్టు సెల్ఫీ దిగవచ్చు. నచ్చిన వారు కూడా మన పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. పక్క పక్కనే ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఉదాహరణకు భారత్‌లో ఒకరుండి, లండన్‌లో ఒకరుండి, ఇద్దరు కలసి అమెరికాలో ఉన్నట్లు సెల్ఫీ దిగవచ్చు. ఫేస్బుక్ ఇటీవలనే మార్కెట్లోకి విడుదల చేసిన వర్చువల్ రియాలిటీ యాప్, హెడ్‌సెట్‌ను ఉపయోగించి ఇలాంటి సెల్ఫీలను సాధించవచ్చని ఫేస్బుక్ మంగళవారం నాడిక్కడ నిర్వహించిన వార్షిక సమావేశ వేదికపై ప్రదర్శించి చూపింది. అందులో ఇద్దరు వీఆర్ హెడ్ సెట్ కలిగిన వారు సిలికాన్ వ్యాలీ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల ఉండి, లండన్ వంతెనపై ఉన్నట్లుగా సెల్ఫీ దిగారు. అయితే ఆ ఛాయా చిత్రం మాత్రం ఆర్టిస్ట్ వేసిన రేఖా చిత్రంగానే కనిపించింది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉందని, ఇది భవిష్యత్ రియాలిటీకి నేడు పునాది వేయడమేనని ఫేస్బుక్ డెవలపర్ వివరించారు. వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకోవడం ఎలా సాధ్యమైందో, అలాగే వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌కు వీడియో కాల్‌ను లింక్ చేయడం ద్వారా అసలైన చిత్రాల్లాగా సెల్ఫీలు ఉండేలా చేయవచ్చని చెప్పారు. ఆ దిశగా ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.