Aram Movie
-
నయనతార చిత్ర సీక్వెల్లో కీర్తి సురేశ్
చెన్నె : నయనతార నటించిన చిత్ర సీక్వెల్ లో కీర్తి సురేష్ నటించనుందా? దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. 2017 నయనతార నటించిన చిత్రం అరం. దర్శకుడు గోపి నయినార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో నయనతార కలెక్టర్ గా నటించారు. బోర్‌వెల్‌లో పడిపోయిన పిల్లాడిని రక్షించే కథతో వచ్చిన ఆ చిత్రం ఆమెకు ఓరియెంటెడ్ చిత్రాల నాయికగా క్రేజీ మరింత పెంచింది. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు అప్పుడే ప్రకటించారు. ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార అరం 2లో నటించడానికి సిద్ధపడలేదని సమాచారం.(మహేశ్‌తో ఢీ?) దీంతో దర్శకుడు గోపీ నయినార్ ఆ తర్వాత నటి సమంతను అరం 2లో నటింప చేసే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దర్శకుడు కీర్తి సురేష్ ను నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఆమెతో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే నయనతారతో కీర్తి సురేష్‌ను పోల్చుతూ ఆమె నయనతార లాగా నటించలేదని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు కూడా కీర్తి సురేష్ మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో నటిస్తున్నప్పుడు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. అలాంటి విమర్శలను ఛాలెంజ్ గా తీసుకొని సావిత్రి పాత్రకు జీవం పోసింది. అంతేకాదు మహానటి చిత్రంలోని కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా అందుకుంది. కాగా ఇప్పుడు అరం 2 చిత్రంలో కీర్తి సురేష్ నటించడానికి అంగీకరిస్తే కచ్చితంగా ఆ చిత్రానికి ప్రాణం పోస్తుందని ఒక వర్గం పేర్కొంటోంది. -
ఆపరేషన్@బోరు బావి
లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ దూసుకెళోతున్న నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఆరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో ‘శివ లింగ, విక్రమ్ వేదా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రజలకు ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు’’ అని ఈ టీజర్‌లోని డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘‘తమిళంలో నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రమిది. బోరు బావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా గోపి నైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్రలో నయనతార నటన అద్భుతం. ఆసక్తికి గురి చేసే మలుపులతో సాగే మంచి పొలిటికల్ డ్రామా. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. -
తలైవాకు పోటీగా తలైవి?
సాక్షి, చెన్నై: తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయనతార భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. కోలీవుడ్‌లో తలైవాగా చాలా మంది ఎదిగారు. అలా ప్రస్తుతం తలైవాగా అభిమానులు తలకెక్కించుకుంటున్న హీరో రజనీకాంత్. ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తాడా అని అభిమానులు ఆశతో నిరీక్షిస్తున్నారు. అయితే అనూహ్యంగా విశ్వనటుడు దూసుకొచ్చారు. రజనీకాంత్ కూడా తన పుట్టిన రోజు(డిసెంబర్12)న తన రాజకీయ రంగప్రవేశం గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారనే ప్రచారం వైరల్ అవుతోంది. ఈ ప్రచార విషయాలు జగమెరిగిన సత్యమే. లెడీ సూపర్‌స్టార్‌గా నయన.. ప్రస్తుతం కొత్తగా తలైవి పేరు వేలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు లెడీ సూపర్‌స్టార్ అంటే విజయశాంతినే. ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత నటనకు దూరం ఉండడంతో మరొకరి కోసం ఆ బిరుదు ఎదురు చూస్తోంది. చాలా కాలం తర్వాత హీరోయిన్ నయనతార అభిమానులతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్నారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా నటించిన అరమ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అభిమానులు తలైవిగా పిలుస్తున్నారు.. ఈ చిత్రంలో కలెక్టర్‌గా నయనతార పాత్ర పోషణ విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సంతోషంలో థియేటర్లను విజిట్ చేస్తున్న నయనతారను అభిమానులు తలైవి అంటూ పేర్కొనడం విశేషం. తాజాగా అభిమానులకు తలైవిగా మారిన నయన భవిష్యత్‌ను కూడా రాజకీయాలతో ముడిపెట్టే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏమో గుర్రం ఎగరావచ్చు.. అన్న సామెత గుర్తుకొస్తోంది కదూ. కాగా అరమ్ సక్సెస్ బాటలో పయనించడంతో ఆ చిత్ర నిర్మాత అరమ్కు సీక్వెల్ నిర్మిస్తానని వెల్లడించారు. -
నయన్ కసి అలా తీర్చుకుంటోందా.?
తమిళసినిమా: కొన్ని సంఘటనలు మనసులో బలంగా నాటుకు పోతాయి. వాటి నుంచి అంత తొందరగా బయట పడటం కష్టం. ఇంకా చెప్పాలంటే శత్రువుకు శత్రువు మిత్రుడన్న సామెత ఉంది. నటి నయనతార ఇప్పుడు దాన్ని ఫాలో అవుతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాస్త వివరంగా చెప్పాలంటే నటి నయనతార ఇప్పటి లెవలే వేరు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న ఈ సంచలన నటి ఇప్పుడు శాసించే స్థాయిలో ఉంది. కథానాయకికి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్న నయనతార ఎక్కవగా వర్ధమాన దర్శకుల చిత్రాలలో నటించడం విశేషం. అయితే ఇందుకో కారణం ఉందంటోంది కోలీవుడ్. నయనతార నటించిన తాజా చిత్రం అరమ్ శుక్రవారం తెరపైకి రానుంది. నయన్ కలెక్టర్‌గా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు గోపీనయినార్ తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో నయనతార నటించడానికి కారణం ఇంతకు ముందు గోపీనయినార్ ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన కత్తి చిత్ర కథ తనదంటూ కోర్టు వరకూ వెళ్లి ఆయన్ని రచ్చలోకి లాగాడు. కాగా ఏఆర్. మురుగదాస్‌కు నయనతారకు మధ్య చాలా కాలంగా కోల్డ్‌వార్ జరుగుతోందనే ప్రచారం ఉంది. అందుకు కారణం గజని చిత్రంలో తన పాత్రను తగ్గించి, నటి అసిన్‌కు అధిక ప్రాముఖ్యనివ్వడమేనన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ కసి తీసుకోవడానికే ఆయన్ని ఢీకొన్న గోపి నయినార్కు నయనతార అవకాశం ఇచ్చిందంటున్నారు. ఇక తాజాగా నయనతార కోకో అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. ఈయనకు నయనతార అవకాశం ఇవ్వడం వెనుక ఒక కధ ఉందట. దర్శకుడు నెల్సన్ ఇంతకు ముందు శింబు హీరోగా వేట్టైమన్నన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఆ చిత్రాన్ని శింబు మధ్యలోనే నిలిపేశారు. ఇక శింబుకు నటి నయనతారకు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి మధ్య డీప్ లవ్ చివరికి ఎలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. శింబుపై ఆ కసి తీర్చుకోవడానికే దర్శకుడు నెల్సన్‌కు కోకో చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించినట్లు సోషల్ మీడియాలో ప్రసారం హల్చల్ చేస్తోంది. -
విజయాల బాట పట్టిన హీరోయిన్..!
నయనతార మరో హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారన్నది తాజా సమాచారం. మాయ చిత్రంతో నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించుకున్న నటి నయనతార. అప్పటి వరకూ కమర్శియల్ చిత్రాల నాయకిగా రాణించిన ఈ సంచన నటి మాయ చిత్రంతో కథను తన భూజాన వేసుకుని విజయ తీరానికి చేర్చే స్థాయికి చేరారు. ఆ తరువాత నటించిన డోరా నిరాశ పరచినా నయనకు దాని ఎఫెక్ట్ ఏ మాత్రం పడలేదు. ప్రేమ వివాదాల్లో ఒడుదుడుకులను ఎలాగైతే అధిగమించారో, హీరోయిన్గా అపజయాలను దాటి విజయాల బాట పట్టారు. ప్రస్తుతం అరమ్, కొలైయుధీర్ కాలం, ఇమైకా నోడిగళ్, నేర్‌వళి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతేకాక మరోపక్క హీరోలతో కమర్షియల్ చిత్రాలను నటిస్తున్నారు. శివకార్తకేయన్తో జత కట్టిన వేలైక్కారన్ చిత్రం డుదల కావలసి ఉన్నా, నిర్మాణ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో ఆ చిత్రం వెనక్కు వెళ్లింది. అయితే త్వరలో ఇమైకా నోడిగళ్, ఆరమ్ చిత్రాలు తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. తెలుగులో చిరంజీవికి జంటగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న నయనతార తాజాగా మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. కుట్రం 23 వంటి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన అరివళగన్ దర్శకత్వంలో నయనతార నటించనుందని తాజా సమాచారం. ఇందులో సీనియర్ నటుడు రాజ్‌కిరణ్ ప్రధాన పాత్రను పోషించనున్నారట. ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిసింది. అయితే చిత్ర వివరాలను త్వరలోనే అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.