
నయనతార
లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేస్తూ దూసుకెళోతున్న నయనతార నటించిన తమిళ చిత్రం ‘ఆరమ్’ తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో ‘శివ లింగ, విక్రమ్ వేదా’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించి, 450 పైగా చిత్రాలను డిస్టిబ్యూట్ చేసిన ఆర్. రవీంద్రన్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ సంయుక్తంగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు.
‘‘ప్రజలకు ఏది అవసరమో అదే చట్టమవ్వాలి కానీ చట్టాన్ని ముందే తయారు చేసి దాన్ని ప్రజల మీద రుద్దకూడదు’’ అని ఈ టీజర్‌లోని డైలాగ్ ఆకట్టుకుంటోంది. ‘‘తమిళంలో నయనతారకు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన చిత్రమిది. బోరు బావిలో ఆడుకుంటున్న పిల్లలు పడిపోతే, అక్కడ జరుగుతున్న ఆపరేషన్ కథా వస్తువుగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా గోపి నైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ ఆపరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ పాత్రలో నయనతార నటన అద్భుతం. ఆసక్తికి గురి చేసే మలుపులతో సాగే మంచి పొలిటికల్ డ్రామా. ఈ నెల 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు.