Aravindan Balakrishnan
-
కామ్రేడ్ బాలా కన్నుమూత
లండన్: యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో భారత సంతతికి చెందిన మావోయిస్టు నేత అరవిందన్ బాలాకృష్ణన్ అలియాస్ కామ్రేడ్ బాలా(81) మృతి చెందారు. ఇంగ్లండ్‌లోని హెచ్ఎంపీ డార్ట్మూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన శుక్రవారం మరణించినట్లు యూకే ప్రిజన్ సర్వీసు అధికారి ప్రకటించారు. లైంగిక వేధింపుల కేసులో యూకే కోర్టు 2016 జనవరిలో కామ్రేడ్ బాలాకు 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అసభ్య ప్రవర్తన కింద ఆరు కేసులు, అత్యాచారం కింద నాలుగు కేసులు, చిత్రహింసల కింద రెండు కేసుల్లో 23 ఏళ్లు జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. అప్పటి నుంచి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. లండన్‌లో రహస్యంగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన అరవింద్ బాలకృష్ణన్‌ను అనుచరులు కామ్రేడ్ బాలా అని పిలుచుకునేవారు. కామ్రేడ్ బాలా భారత్‌లోని కేరళ రాష్ట్రంలో ఓ గ్రామంలో జన్మించారు. సింగపూర్, మలేషియాలో పెరిగారు. అక్కడే కమ్యూనిస్టు నాయకుడిగా చెలామణి అయ్యారు. సింగపూర్ పౌరసత్వం పొందారు. 1963లో యూకేకు చేరుకున్నారు. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడే టాంజానియాకు చెందిన చందా పాట్నీని కలిశారు. 1969లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సొంత కుమార్తెను 30 ఏళ్లపాటు బంధించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన నేరం రుజువయ్యింది. సేవా కార్యక్రమాల ముసుగులో ఎంతోమంది మహిళలపై బాలా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, వారిని క్రూరంగా హింసించాడని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అప్పట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. -
మావోయిస్టు నేతకు బ్రిటన్‌లో 23 ఏళ్ల ఖైదు
లండన్: బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వివాదాస్పద మావోయిస్టు నేత అరవిందన్ బాలృష్ణన్ (75)కు శిక్ష ఖరారైంది. సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు అతనికి 23 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. లైంగిక వేధింపులు, అత్యాచారం, సొంత కూతుర్ని అక్రమంగా నిర్బంధించిన కేసులలో దోషిగా తేల్చిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. బాలుగా పేరొందిన అరవిందన్ బాలకృష్ణన్, ఆయన భార్య చందా(69) గతంలో అనుచరులపై లైంగికదాడి, హింస ఆరోపణలు వెల్లువెత్తాయి. లండన్‌లో నిర్వహిస్తున్న కమ్యూనిస్టు సమిష్టి కేంద్రంలో మహిళా సభ్యులను ఆయన హింసిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. సభ్యులను బానిసలుగా చూస్తూ లైంగికదాడులకు గురిచేస్తున్నారని, సొంత కూతురినే 30 ఏళ్ల పాటు నిర్బంధించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు మొత్తం 25 అభియోగాలను నమోదుచేసింది. విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో శనివారం తుదితీర్పును వెల్లడించింది. కాగా 1983 నుంచి 2013 మధ్య కాలంలో బాలకృష్ణన్ ఆ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన విషయం 2013లో వెలుగులోకి వచ్చింది. దీనిపై సరైన ఆధారాలు లభించిన తర్వాతే అభియోగాలు నమోదు చేసినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) తెలిపింది. అతని భార్య చందా పట్టిన్తో కలిసి బాలకృష్ణన్‌ను 2013 నవంబర్లోనే అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో అతని భార్యకు సంబంధం లేదని రుజువు కావడంతో గత ఏడాది మొదట్లో ఆమెను విడుదల చేశారు. ఈ కేసుపై బీబీసీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. -
యూకేలో మావోయిస్టుపై రేప్ కేసు
లండన్: భారత సంతతికి చెందిన ఓ మావోయిస్టుపై యూకేలో అత్యాచారం కేసు నమోదైంది. మావోయిస్టు నాయకుడిగా ఉన్న అరవిందన్ బాలకృష్ణన్(73) గత ముఫ్పై సంవత్సరాలుగా ముగ్గురు మహిళలను అతని ఇంట్లో నిర్భందించి అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూడటంతో అతనిపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. బాలకృష్ణన్ పై ఉన్న పాత కేసులను కలుపుకుని మొత్తం 25 అభియోగాలు నమోదు చేసిన పోలీసులు డిసెంబర్ 17 వ తేదీన కోర్టుకు హాజరపరచనున్నారు. 1983 నుంచి 2013 మధ్య కాలంలో బాలకృష్ణన్ ఆ మహిళలపై ఆకృత్యాలకు పాల్పడిన విషయం గతేడాది వెలుగులోకి వచ్చింది. దీనిపై సరైన ఆధారాలు లభించిన తర్వాతే అతనిపై అభియోగాలు నమోదు చేసినట్లు క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) తెలిపింది. అతని భార్య చందా పట్టిన్ తో కలిసి బాలకృష్ణన్ ను 2013 లో నవంబర్ అదుపులోకి తీసుకున్నా.. ఈ కేసులో అతని భార్యకు ఎటువంటి సంబంధం లేదని రుజువుకావడంతో ఈ ఏడాది మొదట్లో ఆమెను విడుదల చేశారు.