టీ-ఐడియాలోకి సోలార్ పవర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్(టీ-ఐడియా) జాబితాలోకి సోలార్ పవర్ పరిశ్రమలను చేర్చా రు. దీంతో ఇతర పరిశ్రమల మాదిరిగానే సోలార్ పవర్ పరిశ్రమలకు సైతం 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు సహా కొత్త పరిశ్రమలకు వర్తించే రాయితీలు, ప్రోత్సాహకాలన్నీ వర్తించనున్నాయి. ప్రోత్సాహకాలు, రాయితీలు వర్తింపజేయాలని సోలార్ సంస్థల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రివర్గ ఉపసంఘం... గత నెల 19న ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో సోలార్ పవర్ పరిశ్రమలను కూడా టీ-ఐడియా జాబితాలో చేరుస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం జీవో 63ను జారీ చేశారు.
కాగా, తెలంగాణలో నూతన పరిశ్రమల ఏర్పాటు దరఖాస్తులను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించనిపక్షంలో ఆటోమేటిక్‌గా వాటిని ఆమోదించేలా టీఎస్ ఐపాస్ విధానాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా రూపొందించిన ‘డీమ్డ్ అప్రూవల్’ ఫార్మాట్‌ను ఆధారంగా తగిన చర్యలు తీసుకునే అధికారాన్ని పరిశ్రమల శాఖ కమిషనర్‌కు కల్పిస్తూ మరో జీవో ఇచ్చింది.