ఓబీసీ జాబితాలోకి ఆరె కులం
చేర్చేందుకు కృషి చేస్తానన్న పోచారం
సాక్షి, హైదరాబాద్: ఆరె కులాన్ని ఓబీసీల జాబితాలోకి చేర్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఛత్రపతి శివాజీ జయంతి ప్రభుత్వం నిర్వహించే విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకపోతానని తెలిపారు. ఆదివారం రవీంద్రభారతిలో ఆరె కులం సంక్షేమ సంఘం రాష్ట్ర, గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, అగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 నుంచి అగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచారన్నారు.
టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ.. దేశభక్తి నరనరాన జీర్ణించుకొన్న వ్యక్తి మంత్రి పోచారం శ్రీనివాస్ అని కొనియాడారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు బీసీ కమిషన్ ద్వారా చేయదగ్గ సహయం చేస్తామని తెలిపారు. వారికి అండగా ఉంటామన్నారు. అగ్రో చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకి రాజకీయ బిక్ష పెట్టిన గురువని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని చెప్పారు.
అనంతరం మంత్రి చేతుల మీదుగా ముగ్గురు చైర్మన్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాప్ చెర్మన్ వెంకటేశ్వరావు, ఎంపీ బీబీ పాటిక్, బీసీ కమిషన్ మెంబర్ వి. కృష్ణమోహన్, ఆరె కులం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ, ప్రధాన కార్యదర్శి దిగంబర్ రావు, గ్రేటర్ అధ్యక్షులు డి. కిషన్ రావు, జనరల్ సెక్రటరీ ఉమాపతి, నాయకులు బి మధు, ఎ. ప్రశాంత్, మోహన్‌రావు, డి. నాగేశ్వరరావు, ఎం. శ్రావణ్, సంపత్ రావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.