Army Court
-
ఆర్మీ మేజర్ జనరల్‌కు జీవితఖైదు
న్యూఢిల్లీ/గువాహటి: అస్సాంలో 1994లో జరిగిన సంచలన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఓ ఆర్మీ మేజర్ జనరల్, ఇద్దరు కల్నల్లు సహా ఏడుగురికి జీవిత ఖైదు పడింది. డిబ్రూగఢ్ జిల్లాలోని దిన్జన్‌లో సైనిక కోర్టు విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. మేజర్ జనరల్ ఏకే లాల్, కల్నల్లు థామస్ మాథ్యూ, ఆర్ఎస్ సిబిరెన్‌లతోపాటు జూనియర్ కమిషన్డ్, నాన్ కమిషన్డ్ అధికారులుగా ఉన్న దిలీప్ సింగ్, జగ్దేవ్ సింగ్, అల్బీందర్ సింగ్, శివేందర్‌సింగ్‌లను ఆర్మీ కోర్టు ఈ కేసులో దోషులుగా తేల్చింది. 1994 ఫిబ్రవరి 23న ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యు) కార్యకర్తలు ప్రవీణ్ సోనోవాల్, ప్రదీప్ దత్తా, దేవాజిత్ విశ్వాస్, అఖిల్ సోనోవాల్, భాబెన్ మోరన్‌లను దోషులు అపహరించి, నకిలీ ఎన్కౌంటర్ చేసి చంపారు. డంగారి ఫేక్ ఎన్‌కౌంటర్‌గా ఈ కేసు పేరుమోసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నాటి ఏఏఎస్యు అధ్యక్షుడు, ప్రస్తుత బీజేపీ నేత జగదీశ్ భుయాన్ ఒక్కరే హైకోర్టులో పోరాడారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. కొద్ది రోజులు సీబీఐ దర్యాప్తు జరిగిన అనంతరం ఈ కేసును తాము మిలిటరీ చట్టం కింద విచారిస్తామంటూ కోర్టు అనుమతిని ఆర్మీ పొందింది. ఇప్పుడు ఏడుగురికి జీవితఖైదు విధించడంపై భుయాన్ స్పందిస్తూ ‘24 ఏళ్లలో ఒక్కసారి కూడా భారత ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, సైన్యంపై నేను నమ్మకం కోల్పోలేదు. ఆర్మీ తన సొంత సిబ్బందికే గుణపాఠం నేర్పే శిక్ష వేసింది’ అని అన్నారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మాట్లాడుతూ తప్పుచేసే సైనికులపై తాము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తీర్పును కోల్‌కతాలోని తూర్పు ఆర్మీ కమాండ్, ఢిల్లీలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం ఆమోదించాల్సి ఉంది. ఇందుకు మూడు నెలల సమయం పట్టొచ్చు. దోషులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దోషుల్లో ఒకరైన ఏకే లాల్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని సహోద్యోగిని 2007లో ఫిర్యాదు చేయడంతో ఆర్మీ విచారణ అనంతరం 2010లోనే ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. -
ఆర్మీ మేజర్ గొగోయ్ దోషే
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిలో హోటల్లో పట్టుబడ్డ ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్‌ను ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా నిర్ధారించింది. స్థానిక యువతితో సన్నిహితంగా ఉండటం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధి నిర్వహణ ప్రాంతానికి దూరంగా వెళ్లి మేజర్ ఆర్మీ నిబంధనలను ఉల్లంఘిం చారంది. ఈ ఏడాది మే 23న శ్రీనగర్‌లోని ఓ హోటల్లో గొగోయ్ ఓ యువతి(18)తో కలసి గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయన్ను అడ్డుకుంది. ఈ సందర్భంగా వాగ్వాదం తలెత్తడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సైన్యం ఆదేశించింది. అయితే తాను రహస్య సమాచార సేకరణ కోసమే యువతితో హోటల్‌కు వెళ్లానని గొగోయ్ చెప్పారు. గొగోయ్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన కోర్టు మార్షల్ (మిలటరీ చట్టాల ప్రకారం ఆర్మీ కోర్టు విచారణ)ను ఎదుర్కొనే అవకాశముంది. 2017, ఏప్రిల్ 9న శ్రీనగర్ ఉప ఎన్నికల్లో రాళ్లదాడిని తప్పించుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే స్థానిక యువకుడిని జీప్‌కు కట్టేసి మానవకవచంగా గొగోయ్ వాడుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గొగోయ్‌ను కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా తేల్చడంపై మానవకవచం బాధితుడు ఫరూఖ్ అహ్మద్ దార్ స్పందిస్తూ.. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడన్నారు. -
ఆ సైనిక అధికారికి క్లీన్చిట్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో పౌరుడిని జీపుకు కట్టివేసిన ఘటనలో సైనికాధికారిని ఆర్మీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సంక్లిష్ట పరిస్థితుల్లో సమయ స్ఫూర్తితో వ్యవహరించినందుకు మేజర్ నితిన్ గొగొల్ను ఆర్మీ కోర్టు ఆఫ్ ఎంక్వైరీ(సీఓసీ) ప్రశంసించినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. సైనికుల ప్రాణాలకు ఆపద రాకుండా ఆయన చాకచక్యంగా వ్యవహరించారని కొనియాడినట్టు తెలిపాయి. ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా బుద్గామ్‌లో ఆందోళనకారులు హింసకు దిగి భద్రతా సిబ్బందిపై దాడులకు ప్రయత్నించారు. ఆ సమయంలో 53 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన నితిన్ గొగొల్.. ఆందోళనకారులు రాళ్లు తమవైపు విసరకుండా ఉండేందుకు ఫరూక్‌దార్ అనే పౌరుడిని రక్షణ కవచంలా తమ జీపుకు ముందువైపు కట్టివేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోకు బయటకు రావడంతో విమర్శలు వెలువెత్తాయి. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు రాజకీయ నాయకులు సైనికుల చర్యను ఖండించారు.