ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిలో హోటల్‌లో పట్టుబడ్డ ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్‌ను ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా నిర్ధారించింది. స్థానిక యువతితో సన్నిహితంగా ఉండటం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధి నిర్వహణ ప్రాంతానికి దూరంగా వెళ్లి మేజర్ ఆర్మీ నిబంధనలను ఉల్లంఘిం చారంది. ఈ ఏడాది మే 23న శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో గొగోయ్ ఓ యువతి(18)తో కలసి గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయన్ను అడ్డుకుంది. ఈ సందర్భంగా వాగ్వాదం తలెత్తడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సైన్యం ఆదేశించింది.
అయితే తాను రహస్య సమాచార సేకరణ కోసమే యువతితో హోటల్‌కు వెళ్లానని గొగోయ్ చెప్పారు. గొగోయ్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన కోర్టు మార్షల్ (మిలటరీ చట్టాల ప్రకారం ఆర్మీ కోర్టు విచారణ)ను ఎదుర్కొనే అవకాశముంది. 2017, ఏప్రిల్ 9న శ్రీనగర్ ఉప ఎన్నికల్లో రాళ్లదాడిని తప్పించుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే స్థానిక యువకుడిని జీప్‌కు కట్టేసి మానవకవచంగా గొగోయ్ వాడుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గొగోయ్‌ను కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా తేల్చడంపై మానవకవచం బాధితుడు ఫరూఖ్ అహ్మద్ దార్ స్పందిస్తూ.. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment