Leetul Gogoi
-
మేజర్ గొగోయ్‌పై ముగిసిన కోర్ట్ మార్షల్
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఓ యువతితో సన్నిహితంగా ఉంటూ పట్టుబడిన ఆర్మీ మేజర్ లీతుల్ గొగోయ్‌పై సైనిక కోర్టులో విచారణ పూర్తయింది. మేజర్ లీతుల్ గొగోయ్ 2018 మేలో స్థానిక యువతి(18)తో కలిసి శ్రీనగర్‌లోని ఓ హోటల్‌కు వచ్చారు. అక్కడ పోలీసులతో గొడవకు దిగడంతో వారు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్..కోర్టు మార్షల్‌కు ఆదేశించారు. మేజర్ గొగోయ్ మారు పేరుతో ఫేస్బుక్లో పరిచయమైనట్లు శ్రీనగర్ యువతి వాంగ్మూలం ఇచ్చింది. ఈ మేరకు సైనిక న్యాయస్థానం..ఉన్నతాధికారులకు నివేదిక అందజేసింది. ఆదేశాలను ఉల్లంఘించిన మేజర్ గొగోయ్ సీనియారిటీని తగ్గించే అవకాశమున్నట్లు సమాచారం. 2017లో కశ్మీర్లో పెట్రోలింగ్ సందర్భంగా రాళ్లు రువ్వుతున్న మూకల నుంచి రక్షణ పొందేందుకు మేజర్ గొగోయ్ తన జీప్ బోయ్నెట్పై ఓ సాధారణ పౌరుడిని కట్టేసిన ఘటనపై తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. -
ఆర్మీ మేజర్ గొగోయ్ దోషే
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓ యువతిలో హోటల్లో పట్టుబడ్డ ఆర్మీ మేజర్ లితుల్ గొగోయ్‌ను ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా నిర్ధారించింది. స్థానిక యువతితో సన్నిహితంగా ఉండటం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధి నిర్వహణ ప్రాంతానికి దూరంగా వెళ్లి మేజర్ ఆర్మీ నిబంధనలను ఉల్లంఘిం చారంది. ఈ ఏడాది మే 23న శ్రీనగర్‌లోని ఓ హోటల్లో గొగోయ్ ఓ యువతి(18)తో కలసి గదిలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో హోటల్ యాజమాన్యం ఆయన్ను అడ్డుకుంది. ఈ సందర్భంగా వాగ్వాదం తలెత్తడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గొగోయ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిగేడియర్ స్థాయి అధికారి నేతృత్వంలో కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి సైన్యం ఆదేశించింది. అయితే తాను రహస్య సమాచార సేకరణ కోసమే యువతితో హోటల్‌కు వెళ్లానని గొగోయ్ చెప్పారు. గొగోయ్ దోషిగా తేలిన నేపథ్యంలో ఆయన కోర్టు మార్షల్ (మిలటరీ చట్టాల ప్రకారం ఆర్మీ కోర్టు విచారణ)ను ఎదుర్కొనే అవకాశముంది. 2017, ఏప్రిల్ 9న శ్రీనగర్ ఉప ఎన్నికల్లో రాళ్లదాడిని తప్పించుకోవడానికి ఫరూఖ్ అహ్మద్ దార్ అనే స్థానిక యువకుడిని జీప్‌కు కట్టేసి మానవకవచంగా గొగోయ్ వాడుకున్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. గొగోయ్‌ను కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ దోషిగా తేల్చడంపై మానవకవచం బాధితుడు ఫరూఖ్ అహ్మద్ దార్ స్పందిస్తూ.. తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి దేవుడి ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నాడన్నారు. -
‘వార్ జోన్’లో అదే కరెక్ట్!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఆందోళనకారుల నుంచి ఎన్నికల సిబ్బందిని తప్పించడానికి జీపు బాయ్‌నెట్‌కు ఓ వ్యక్తిని కట్టేసి మానవకవచంగా వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విమర్శలను రక్షణమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. ఆర్మీ మేజర్ లీతుల్ గోగొయ్ ‘యుద్ధ తరహా పరిస్థితులు’ నెలకొని ఉండటంతో అలా వ్యవహరించాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని ఆర్మీ అధికారులకు కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. మిలిటరీ అధికారులు కొన్ని సందర్భాల్లో సైనిక పరిష్కారాలు పాటించాల్సి ఉంటుందని, దీనిపై రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై అధికారులు ఎంపీలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. యుద్ధ తరహా పరిస్థితులు నెలకొన్న కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఆర్మీకి ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు. శ్రీనగర్‌లో ఉప ఎన్నిక సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంపై రాళ్లు విసురుతూ ఆందోళనకారులు దాడి చేశారు. ఆందోళనకారుల నుంచి ఎన్నికల సిబ్బందిని తప్పించడానికి ఓ వ్యక్తిని జీపు బాయ్‌నెట్‌కు కట్టి మానవ కవచంగా ఆర్మీ మేజర్ గోగొయ్ వాడుకున్నారు. ఆర్మీ మేజర్ చర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘అందుకే అతడిని జీప్‌కు కట్టేశా’
శ్రీనగర్: ఓ వ్యక్తిని ఆర్మీ జీప్‌నకు కట్టేసినందుకు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ నుంచి పురస్కారం అందుకున్న మేజర్ లీతుల్ గొగోయ్ మంగళవారం ఈ విషయంపై తొలిసారి మీడియాతో మాట్లాడారు. అనేక మందిప్రాణాలను కాపాడేందుకే తాను అతణ్ని జీప్‌నకు కట్టేశానని తెలిపారు. కశ్మీర్లో ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా హింస చెలరేగడం... ఆ సమయంలో ఫరూఖ్ అహ్మద్ దార్ అనే వ్యక్తిని ఆర్మీ మేజర్ లీతుల్ గొగోయ్ జీప్‌నకు ముందువైపున కట్టేసి మానవ కవచంలా వాడుకోవడం తెలిసిందే. ఆ సమయంలో 1,200 మంది ఆందోళనకారులు ఐటీబీపీ సిబ్బంది, ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని చుట్టుముట్టి రాళ్లు విసురుతామనీ, పోలింగ్ బూత్‌ను తగలబెడతామని బెదిరించారని గొగోయ్ తెలిపారు. తాము వెళ్లి వారందరినీ కాపాడామనీ, అప్పుడు ఫైరింగ్‌కు అనుమతించి ఉంటే కనీసం 12 మందైనా చనిపోయుండేవారని ఆయన వివరించారు. లీతుల్ గొగోయ్ చర్యను సైనిక మాజీ అధికారులు సమర్థించారు. ‘విపత్కర పరిస్థితుల్లో గొగోయ్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. రాళ్లు విసురుతున్న ఆందోళనకారుల బారి నుంచి పౌరులు, సైనికులు, పోలింగ్ బూత్ అధికారులను కాపాడారు. ఆయనను వేలెత్తి చూపించేవాళ్లు అవమానంతో తలదించుకోవాల’ని రక్షణ రంగ నిపుణుడు పికే సెహగల్ వ్యాఖ్యానించారు.