‘వార్ జోన్’లో అదే కరెక్ట్!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఆందోళనకారుల నుంచి ఎన్నికల సిబ్బందిని తప్పించడానికి జీపు బాయ్‌నెట్‌కు ఓ వ్యక్తిని కట్టేసి మానవకవచంగా వాడుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విమర్శలను రక్షణమంత్రి అరుణ్ జైట్లీ కొట్టిపారేశారు. ఆర్మీ మేజర్ లీతుల్ గోగొయ్ ‘యుద్ధ తరహా పరిస్థితులు’ నెలకొని ఉండటంతో అలా వ్యవహరించాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకొనే అధికారాన్ని ఆర్మీ అధికారులకు కల్పించాల్సి ఉంటుందని చెప్పారు.
మిలిటరీ అధికారులు కొన్ని సందర్భాల్లో సైనిక పరిష్కారాలు పాటించాల్సి ఉంటుందని, దీనిపై రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై అధికారులు ఎంపీలను సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. యుద్ధ తరహా పరిస్థితులు నెలకొన్న కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ ఆర్మీకి ఉంటుందని జైట్లీ పేర్కొన్నారు.
శ్రీనగర్‌లో ఉప ఎన్నిక సందర్భంగా ఓ పోలింగ్ కేంద్రంపై రాళ్లు విసురుతూ ఆందోళనకారులు దాడి చేశారు. ఆందోళనకారుల నుంచి ఎన్నికల సిబ్బందిని తప్పించడానికి ఓ వ్యక్తిని జీపు బాయ్‌నెట్‌కు కట్టి మానవ కవచంగా ఆర్మీ మేజర్ గోగొయ్ వాడుకున్నారు. ఆర్మీ మేజర్ చర్యపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.