కల సాకారం: జైట్లీ
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుతో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నామని, ఒకే పన్ను, ఒకే మార్కెట్, ఒకే దేశం స్వప్నం సాకారం కానుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాలులో జీఎస్టీ వేడుకల్లో ప్రారంభోపన్యాసం చేస్తూ..‘దేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణ ప్రారంభం కాబోతోంది. ఇది దేశం సాధించిన గొప్ప విజయం. హద్దుల్లేని అవకాశాల్ని సృష్టించడంతో పాటు ఆర్థిక పరిధుల్ని భారత్ విస్తరించుకోనుంది.
జీఎస్‌టీ అమలు భారత రాజకీయ చరిత్రలో గొప్ప మైలురాయి. ఈ అతిపెద్ద పన్ను వ్యవస్థ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే లక్ష్యం, ఒకే శ్రేయస్సు కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధుల మేరకు పనిచేస్తాయి. ఇది సంకుచిత రాజకీయాలపై గెలుపు... అలాగే అందరినీ కలుపుకుపోగలమని ఈ అతిపెద్ద పన్ను సంస్కరణ నిరూపించింది.జీఎస్టీ మన అంతిమ లక్ష్యమైనా నిజానికి ఇది పూర్తిగా కొత్త ప్రయాణం. జీడీపీ వృద్ధికి జీఎస్టీ సాయపడనుంది.
పన్ను ఎగవేతదారులు ఇక నుంచి తప్పించుకోలేరు. జీఎస్టీ కల సాకారానికి రాష్ట్రాలు, అధికారులు ఎంతగానో శ్రమించారు. ఎన్డీఏ–1 హయాంలో ఏర్పాటు చేసిన విజయ్ కేల్కర్ కమిటీ చరిత్రాత్మక నివేదికతో జీఎస్టీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. యూపీఏ ప్రభుత్వం జీఎస్టీ తదుపరి ప్రక్రియను కొనసాగించింది. ఇది ఏ ఒక్క పార్టీ ఘనత కాదు. జీఎస్టీ మండలిలో ప్రతీ నిర్ణయం ఏకాభిప్రాయంతో తీసుకున్నాం. తటస్థ పన్ను విధానమే లక్ష్యంగా, సామాన్యుడిపై అనవసర భారం పడకుండా జీఎస్‌టీ పన్ను రేట్ల నిర్ణయంలో జాగ్రత్తపడ్డా’మని వివరించారు.
కశ్మీర్‌లో జీఎస్టీ వాయిదా
శ్రీనగర్: దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చినా కశ్మీర్‌లో మాత్రం వాయిదాపడింది. ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కలిగిన జమ్మూ కశ్మీర్‌లో జీఎస్టీ అమలవ్వాలంటే.. సీజీఎస్టీ, ఐజీఎస్టీల్ని ఆమోదిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలి. ఆ విషయంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జీఎస్టీ అమలును వాయిదా వేశారు. ఈ నెల ప్రారంభంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం లో జీఎస్టీ అమలుపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు అవకాశాన్ని కోల్పోయినా.. ఏకాభిప్రాయంకోసం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని ఆ రాష్ట్ర మంత్రి నయీం అక్తర్ తెలిపారు. మరోవైపు జీఎస్టీ అమలుపై చర్చించేందుకు మంగళవారం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సమావేశం కానుంది.