ప్రేయసి కోసం ఏకే-47 చేతపట్టి.. కాబోయే భర్తను..! | Kashmir Man Poses As Fake Militant To Scare Off Lover Fiance | Sakshi
Sakshi News home page

ప్రేయసి కోసం ఏకే-47 చేత పట్టి..

Apr 30 2018 1:54 PM | Updated on Jun 4 2019 6:41 PM

Kashmir Man Poses As Fake Militant To Scare Off Lover Fiance - Sakshi

శ్రీనగర్‌, జమ్మూకశ్మీర్‌ : ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి రెడీ అంటారు నేటి యువత. ప్రేయసి కోసం ఎన్ని తప్పులు అయినా చేస్తారు. తాజాగా ప్రేయసి కోసం ఆర్మీ అధికారి అవతారమెత్తాడు ఓ వీర ప్రేమికుడు. చివరకు గ్రామస్తుల చేతిలో చిక్కి తన్నులు తిన్నాడు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కి చెందిన అదిల్‌ అనే యువకుడు ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్‌య్యాడు.

కానీ ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. దీంతో వరుడిని బెదిరించేందుకు ప్రేమికుడు ఆర్మీ అధికారి అవతారమెత్తాడు. తానే కాకుండా మరో ముగ్గురి స్నేహితులను కూడా నకిలీ సైనికులుగా తయారు చేశారు. ఈ నలుగురు డమ్మీ ఏకే-47 గన్స్‌ తీసుకొని నిజమైన ఆర్మీ అధికారిలా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయికి కాబోయే భర్తను బెదిరించారు. అయితే, అతని కుటుంబీకులకు వీరిపై అనుమానం కలిగింది. వారి దగ్గర ఉన్నవి డమ్మీ తుపాకులు అని తెలిసి బంధించేందుకు ప్రయత్నించారు.

అయితే అదిల్‌ ఒక్కడే వీరి చేతికి చిక్కాడు. మిగతా ముగ్గురు పారిపోయారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదిల్‌ను అరెస్ట్‌ చేశారు. తాను అమ్మాయి కోసమే ఆర్మీ అధికారిగా నటించానని, మిగతా ముగ్గురు కూడా తన కోసమే అలా నటించారని అదిల్‌ తెలిపాడు. ఈ విషయంపై సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అదిల్‌ కేవలం ప్రేమ కోసమే నకిలీ ఆర్మీ అధికారిగా నటించాడని చెప్పారు. ఇతనిపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని వెల్లడించారు.

సానుభూతితో అతన్ని వదిలిపెట్టినట్లు వివరించారు. అయితే ఈ చిలిపి ప్రేమికుడు చేసిన పనికి ఆ ఆమ్మాయి పెళ్లి చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. కాగా ఉగ్రవాదులను అంతమొందించాలనే దిశలో భద్రతా బలగాలను 'ఆపరేషన్‌ ఆల్‌ ఔట్-2‌' అనే పేరిట చర్యకు ఉపక్రమించిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement