Article 44
-
ఒకే దేశం, ఒకే చట్టం... సాధ్యమయ్యేనా?
ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ) మరోసారి తెరపైకి వచ్చింది. ఒకే దేశం ఒకే చట్టం ఎజెండాతో గతంలో ఉత్తరాఖండ్ ఎన్నికలప్పుడు యూసీసీ అమలుకు బీజేపీ సర్కారు కమిటీ వేయడం తెలిసిందే. తాజాగా గుజరాత్ కూడా అదే బాట పట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇలా వరసగా యూసీసీ అమలుకు సై అంటూ ఉండడంపై చర్చ మొదలైంది. విభిన్న పరిస్థితులున్న దేశంలో ఒకే చట్టం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి... కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలు లేకుండా దేశ పౌరులందరికీ ఒకే విధమైన చట్టాలను అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి. ఇది అమల్లోకి వస్తే పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వ హక్కులు, జనన మరణాలు, దత్తత ప్రక్రియకు సంబంధించి పౌరులందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. పౌరులందరికీ ఒకే చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని, అప్పుడే సమానత్వ హోదా దక్కుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా చెబుతోంది. హిందూత్వ ఎజెండాతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఉమ్మడి పౌరస్మృతిని ఎన్నడో తన మేనిఫెస్టోలో చేర్చింది. తన రాజకీయ ఎజెండాలో ఆగ్రభాగాన ఉన్న అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయకుండా ముందు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మొదలు పెట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. బీజేపీ పాలిత యూపీ, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అనుమానాలూ లేకపోలేదు... అయితే యూసీసీపై హిందువుల్లోనే కాస్త వ్యతిరేకత వచ్చే ఆస్కారముందా అన్న అనుమానాలూ లేకపోలేదు. ‘‘భిన్న మతాలకు చెందిన వారికి వేర్వేరు లా బోర్డులున్నాయి. హిందూ మతానికి చెందినవారు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు ఆచారాలు పాటిస్తున్నారు. వాటన్నింటికీ ఏకరూపత ఎలా సాధ్యం?’’ అన్నది ఒక వాదన. కేవలం మెజార్టీ ఓటు బ్యాంకును ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకేనని ఒక వర్గం ఆరోపిస్తోంది. ఇది బీజేపీ ఎన్నికల స్టంటని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు అంటున్నారు. అందరికీ ఒకే చట్టాల్లేవా...? ప్రస్తుతం దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలకు వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా వ్యక్తిగత చట్టాలున్నాయి. ముస్లింలకు షరియా చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లా అమలవుతోంది. దాని ప్రకారం ముస్లిం పురుషులకు నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి ఉంది. వేరే మతస్తులకు మాత్రం చట్టప్రకారం ఒక్క భార్యే ఉండాలి. సివిల్ అంశాల్లో కాంట్రాక్ట్ చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ వంటి అనేకానేక ఉమ్మడి చట్టాలనూ పలు రాష్ట్రాల్లో భారీగా సవరించారు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నా అక్కడా కేథలిక్కులకు, ఇతర మతాలకు భిన్నమైన నియమాలు పాటిస్తున్నారు. నాగాలాండ్, మిజోర, మేఘాలయాల్లోనైతే హిందూ చట్టాల్లో కూడా భిన్నత్వం ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివక్ష అంతమే కీలకం
లా కమిషన్ తన తన పదవీకాలం పూర్తయిన చివరిరోజున అనేక ప్రధానాంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇటీవలికాలంలో తరచు చర్చనీయాంశం అవుతున్న ఉమ్మడి పౌర స్మృతి ప్రతిపాదనపై 185 పేజీల సమాలోచన పత్రాన్ని విడుదల చేసింది. పౌర స్మృతి అవసరం ఇప్పుడు లేదని, వర్తమాన పరిస్థితుల్లో దాన్ని తీసుకురావడం వాంఛనీయం కూడా కాదని కమిషన్ అభిప్రాయపడింది. ఇప్పుడున్న వివిధ వైయక్తిక(పర్సనల్) చట్టాల్లో ఉన్న వివక్షను అంత మొందించి వాటన్నిటిలో సమానతకు తావిచ్చేలా మార్పులు చేయొచ్చునని కూడా సూచించింది. మన రాజ్యాంగం పౌరులందరినీ సమానంగా పరిగణించింది. కుల, మత, లింగ ప్రాతిపదికన ఎవరిపైనా వివక్ష ప్రదర్శించకూడదని నిర్దేశించింది. కానీ విషాదమేమంటే... వేర్వేరు మతాలకు చెందిన వైయక్తిక చట్టాల్లో ఏదో మేర ఈ వివక్ష కొనసాగుతోంది. లా కమిషన్ చెప్పినట్టు వీటిని సవరిస్తే నిజానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమే ఉండదు. ఉమ్మడి పౌర స్మృతిపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ చెప్పిన మాటలైనా, రాజ్యాంగంలోని 44వ అధికరణను చూసినా లా కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు సరికాదన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. ఏదో ఒకనాటికి దేశం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించుకోగలదన్న ఆశాభావాన్ని డాక్టర్ అంబేడ్కర్ అప్పట్లో వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ఒకటైన 44వ అధికరణ నిర్దేశిస్తున్నది. ఇప్పుడు లా కమిషన్ సూచనలు ఈ స్ఫూర్తికి భిన్నమైనవిగా అనిపించినా సామాజికంగా, సాంస్కృతికంగా అనేక వైవిధ్యతలతో నిండిన మన దేశంలో అందరికీ ఉమ్మడిగా వర్తించే వైయక్తిక చట్టాలు ఉండాలనుకోవటం సరికాదు. సమస్య ఆ చట్టాల్లోని వివక్షదే అయినప్పుడు దాన్ని పారదోలగలిగితే తమ తమ వ్యక్తిగత విశ్వాసాలకు అను గుణంగా ఎవరు ఏ వైయక్తిక చట్టం అనుసరించినా సమస్య ఉండదు. నిజానికి రాజ్యాంగసభలో 44వ అధికరణపై చర్చలు తీవ్రంగా జరిగాయి. సభ్యులంతా మత ప్రాతిపదికన విడిపోయారు. ఆ సమయంలో డాక్టర్ అంబేడ్కర్ ఈ అధికరణను మైనారిటీలపై రుద్దే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వివిధ మతస్తులకు వారి వారి సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా వేర్వేరు వైయక్తిక చట్టాలున్నాయి. వివాహం, విడాకులు, పునర్వివాహం, దత్తత, వారసత్వం, గార్డియన్షిప్ వగైరా అనేక అంశాలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏ మతాచారాలైనా, విశ్వాసాలైనా రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు, లింగ సమానత్వాన్ని నిరాకరిస్తున్నప్పుడు వాటిని రద్దు చేయాల్సిందేనని లోగడ సుప్రీంకోర్టు చెప్పింది. మన చట్టాలు వివిధ మతాలకుండే వైయక్తిక చట్టాలను గుర్తించాయి. కానీ ఆ చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడే చెల్లుబాటవుతాయన్నది సర్వోన్నత న్యాయస్థానం భావన. స్త్రీల పట్ల వివక్ష చూపుతున్న ఏకపక్ష తలాక్ విధానాన్ని, నికా హలాలా, బహుభార్యత్వ ఆచారాలను రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలని, వాటిని నిషేధించాలని రెండేళ్లక్రితం కొందరు ముస్లిం మహిళలు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అంతక్రితమే ఉమ్మడి పౌరస్మృతిపై అడపా దడపా చర్చలు జరుగుతున్నా ఆ కేసు సందర్భంగా అది మరింతగా చర్చలోకొచ్చింది. ఆ సమయంలోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఉమ్మడి పౌరస్మృతి’కి సంబంధించిన వివిధ అంశాలను పరి శీలించాల’ని లా కమిషన్‌ను కోరింది. ఉమ్మడి పౌరస్మృతి అంశంపై కమిషన్ విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. చాలా అంశాలను లోతుగా పరిశీలించింది. మహిళల పట్ల వివక్ష అన్నది కేవలం ముస్లిం వైయక్తిక చట్టాల్లో మాత్రమే ఉందనుకోనడం పొరపాటు. హిందూ, పార్సీ వైయక్తిక చట్టాల్లో సైతం ఇలాంటి ధోరణులున్నాయి. దాంపత్య పునరుద్ధరణ హక్కులు, సహభాగిత్వం, వివాహేతర సంబంధాల్లో జన్మించిన పిల్లల హక్కులు, దత్తత, సంరక్షకత్వం వగైరా అంశాల్లో ఎన్నో లోపాలున్నాయి. పార్సీ చట్టాల్లో కూడా కొన్ని సమస్యలున్నాయి. అన్యమతస్తుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు వారసత్వ హక్కు లేదు. పిల్లల సంరక్షణకు సంబంధించి కూడా వివిధ వైయక్తిక చట్టాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బహు భార్యత్వం, వైవాహికేతర సంబంధాలు, నికా హలాలా వంటి అంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. అలాగే ఓటేయడానికి 18 ఏళ్ల అర్హత చాలన్నప్పుడు పెళ్లికి మాత్రం మగవాడి వయసు కనీసం 21 ఏళ్లుండాలని, ఆడపిల్లకు 18 ఏళ్లు సరిపోతాయని నిర్దేశించటం అహేతుకమవుతుంది. దీనివల్ల భార్యాభర్తల్లో భార్య మగవాడికన్నా తక్కువ వయసు కలిగి ఉండాలనే అభిప్రాయం పౌరుల్లో స్థిరపడిపోయింది. వీటన్నిటిపైనా సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి వివిధ వైయక్తిక చట్టాల్లో వివక్షకు తావిస్తున్న నిబంధనలను సవరిస్తే, ప్రజాస్వామిక అవగాహనకు అనుగుణమైన నిబంధనలు ఏర్పరిస్తే దానివల్ల మంచి ఫలితాలుంటాయి. అటువంటి ప్రయత్నం మున్ముందు ఉమ్మడి పౌరస్మృతికి బాటలు పరిస్తే మంచిదే. లా కమిషన్ చేసిన మరో మంచి సూచన రాజద్రోహ నేరానికి సంబంధించింది. ఈ నేరానికి సంబంధించిన ఐపీసీ 124ఏ సెక్షన్ దుర్వినియోగమవుతున్నంతగా మన దేశంలో మరేదీ కావటం లేదు. మాట, రాత, గీత, నినాదం... ఇలా ఏం చేసినా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టడం ఈమధ్య కాలంలో ముదిరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయటం రాజద్రోహమ వుతోంది. అత్యంత కఠినమైన ఈ చట్టాన్ని న్యాయనిపుణులతో, భిన్నవర్గాలవారితో చర్చించి సవ రించాలని కమిషన్ వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగినది. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శలకూ, అభిప్రాయాలకూ, ఆలోచనలకూ చోటీయకపోతే అది ప్రజాస్వామ్యం అనిపించుకో దని కూడా నిర్మొహమాటంగా చెప్పింది. వైయక్తిక చట్టాలు, రాజద్రోహం అంశాల్లో లా కమిషన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని తగిన మార్పులు తలపెడితే మన ప్రజాస్వామ్యానికి అర్ధం, పరమార్ధం ఉంటాయి. -
మద్యపాన నిషేధం అమలును ప్రశ్నించరేం...?
సాక్షి, సిటీబ్యూరో: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 గురించి పదే పదే మాట్లాడే హిందుత్వ వాదులు అదే రాజ్యాంగం లోని ఆర్టికల్ 47 ప్రకారం మద్యపాన నిషేధం అమలు కోసం ఎందుకు నోరువిప్పరని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. మంగళవారం అర్థరాత్రి తాడ్‌బన్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ నిజంగా దమ్ముంటే ఆర్టికల్ 47 లోని అంశాల అమలుకు ప్రయత్నించాలన్నారు. మద్యపానం వల్ల వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, రహదారి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. కేంద్రం లోని మోదీ సర్కార్ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. వివిధ అంశాలపై రాజకీయం చేస్తూ మోదీ సర్కారు తన పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గుతున్న ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం దిగిరావడం లేదని ఆరోపించారు. కొందరు హిందుత్వ వాదులకు తన పేరు ఉచ్చరించనిదే నిద్ర పట్టడం లేదని, కేవలం పార్టీల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు తన వాఖ్యలను వక్రీకరిస్తూ అవాకులు, చవాకులు పెల్చుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కలలుకంటున్న హిందూరాజ్యం ఎప్పటికీ సా ద్యం కాదని, హిందూస్థాన్‌గానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో గట్టి ప్రతిపక్షం లేకుండా పోయిందని, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హమీలను పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా వత్తిడి తీసుకొస్తామని అసదుద్దీన్ ప్రకటించారు. దళితులతో కలిసి నడుద్దాం.. ముస్లిం-దళితుల ఐక్యత రాజ్యాధికారానికి సూచిక అని అసదుద్దీన్ అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాబోవు తరాలకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. సభలో పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషాఖాద్రి మోజం ఖాన్, జాఫర్ హుస్సేన్ తదితతరులు ప్రసంగించారు. ఎన్ఐఏ రెండు నాల్కల ధోరణి మాలే గాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ యూ టర్న్ తీసుకోవడం పట్ల మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండి పడ్డారు. బుధవారం దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాలేగాం బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ వ్యవహరిస్తున్న తీరు రెండు నాల్కల ధోరణిగా ఉందన్నారు. కేసులో అరెస్ట్ చేసిన ముస్లిం యువకులకు క్లిన్ చిట్ ఇచ్చి తిరిగి అనుమానాలు వ్యక్తం చేయడమేమిటని ప్రశ్నించారు. ఈ కేసులో హిందూ యువకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. ముస్లిం యువకులను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.