షెల్టర్ కన్నా రోడ్డే భేష్!
* నైట్ షెల్టర్లు అపరిశుభ్రంగాఉంటున్నాయన్న నిరాశ్రయులు
* ‘ఉచితం’ ఆశించే రోడ్డునాశ్రయిస్తున్నారంటున్న అధికారులు
న్యూఢిల్లీ: తమకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్లు అపరిశుభ్రంగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కాగా, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ఇచ్చే దుప్పట్లు, బట్టల కోసమే నిరాశ్రయులు రోడ్లపై నిద్రిస్తున్నారని ప్రభుత్వ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ‘‘ఒక రాత్రి నైట్‌షెల్టర్‌లో నిద్రపోయి చూడండి. మేము ఎటువంటి దురవస్థను అనుభవిస్తున్నామో’’ అని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వలస కార్మికుడు అరుణ్‌కుమార్ అన్నాడు. బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలో నైట్ షెల్టర్ ఉన్నప్పటికీ అరుణ్ రిజర్వు బ్యాంకు వద్ద పేవ్‌మెంట్‌పై నిద్రించేందుకే ఇష్టపడుతున్నాడు. నైట్‌షెల్టర్లలో ఇచ్చే దుప్పట్ల నిండా పేలు ఉంటాయని చెప్పారు.
ఢిల్లీ పట్టణ ఆశ్రయ అభివృద్ధి బోర్డు (డీయూఎస్ఐబీ) తెలిపిన ప్రకారం నగరంలో ప్రస్తుతం 219 నైట్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో 15వేల మందికి పైగా ఆశ్రయం పొందవచ్చు. పాత ఢిల్లీ వీధుల నుంచి లూటియన్స్ వరకు రాత్రి సమయంలో ఎముకలు కొరికే చలి వాతావరణం ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తున్నారు. నైట్షెల్టర్లకు వచ్చే వారిని పశువుల్లా కుక్కుతున్నారని, పడుకున్న తరువాత కనీసం అటుఇటు పొర్లడానికి కూడా స్థలం ఉండదని రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల ప్రేమ్ అనే కార్మికుడు చెప్పాడు. అక్కడ వసతులు బాగుంటే తాము ఈ చలిలో రోడ్లపై ఎందుకు పడుకుంటామని ప్రేమ్ ప్రశ్నించాడు.
ఈ ఆరోపణలను డీయూఎస్ఐబీ ఖండించింది. నిరాశ్రయుల్లో కొందరు కావాలనే రోడ్లపై నిద్రిస్తుంటారని పేర్కొంది. స్వచ్ఛంద సంస్థలు, నిరాశ్రయుల సంక్షేమం కోసం పని చేసే వ్యక్తుల నుంచి ఉచితంగా లభించే దుప్పట్లు, వస్త్రాలను పొందేందుకే వీరు రోడ్లపై నిద్రిస్తుంటారని డీయూఎస్ఐబీ డెరైక్టర్ కమల్ మల్హోత్రా చెప్పారు. ప్రతిరోజు, ప్రతి షెల్టర్‌ను తనిఖీ చేసేందుకు 31 మంది సీనియర్ అధికారులు వెళ్తుంటారని అన్నారు. వారు చెబుతున్నంత అధ్వానంగా నైట్ షెల్టర్లు లేవని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలోనే 13 వేల దుప్పట్లను ఉతకడం ప్రారంభించామని, కొత్తగా మరో 6,781 బ్లాంకెట్లను నైట్ షెల్టర్లకు సరఫరా చేశామని మల్హోత్రా తెలిపారు.
ప్రస్తుతం తమ వద్ద 14వేలకు పైగా దుప్పట్లు ఉన్నాయని, మరో 20 వేల బ్లాంకెట్ల కోసం టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. నైట్ షెల్టర్లుగా ఉపయోగించేందుకు కొన్ని భవనాలను గుర్తించాలని హైకోర్టు సూచించింది కదా అన్న ప్రశ్నకు, అందుకు కొన్ని పరిమితులున్నాయని మల్హోత్రా పేర్కొన్నారు. ఆ భవనాల్లో మరుగుదొడ్లు ఉండాలని, లేదా సంచార మరుగుదొడ్డిని పంపే వెసులుబాటు ఉండాలని అన్నారు. అటువంటి భవనాలను గర్తించాలని తాము ఇప్పటికే ఎన్డీఎంసీకి సూచించామని చెప్పారు.