నేడు ఆషాఢ పూర్ణిమ
తెనాలి : రాష్ట్ర రాజధాని అమరావతిని బౌద్ధపర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనీ, ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఇక్కడకు వచ్చి ఆరాధనా కేంద్రాలు స్థాపించుకునేలా ఈ ప్రాజెక్టును రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఆషాఢ పౌర్ణమి విశిష్టతను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. బుద్ధుని తొలి ప్రవచనమైన ధర్మచక్ర ప్రవర్తన సూత్రాన్ని బోధించింది ఆషాడ పూర్ణమి రోజునే. ఆ క్రమంలో ఆవిర్భవించిన ఆరామాల్లో ఒకటి అమరావతి.
సిద్ధార్థుడు సత్యకాముకుడై, మానవులు, ఇతర జీవరాశుల సుఖం, హితంకోసం దుఃఖ నివృత్తికై ఇంటిని వదిలి అనేకమంది ధార్మిక తాత్వికులను కలుస్తాడు. అయినా ప్రయోజనం లేకపోవటంతో తానే సత్వాన్వేషణకు పూనుకుంటాడు. ఆరేళ్ల కఠోర తపస్సుతో దుఃఖం ఉందనీ, నిరోధించవచ్చనీ, నిరోధానికీ మార్గముందనీ, ఆ మార్గమే ఆర్య అష్టాం గ మార్గం (చతుర్థ ఆర్యసూత్రాలు)గా విశ్వసించాడు. దుఃఖ నివృత్తికి ఒక చక్కటి మార్గా న్ని చూపి, మానవాళికి శాశ్వతానందాన్నిచ్చాడు. మధ్యమ మార్గాన్ని సూచించి, కార్యకారణ సంబంధాన్ని వివరించి, ఆత్మ లేదని నిరూపించాడు. బోధ్‌గయలో సంయక్సంబుద్ధత్వం ప్రాప్తించిన తర్వాత సిద్ధార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు. వైశాఖ పౌర్ణమినాడు పరిపూర్ణ జ్ఞానిగా మారాడు. తాను కనుగొన్న ధర్మాన్ని మానవాళికి చేర్చాలన్న తపనతో బోధగయ నుంచి బయలుదేరి కాలినడకన సారనాధ్ (వారణాశి దగ్గర)లోని జింకల వనం చేరుకొన్నాడు. అక్కడే ఆషాఢపున్నమి రోజున అయిదుగురు భిక్షువులకు తాను కనుగొన్న ధర్మాన్ని ప్రబోధించాడు. దీన్ని ధర్మా న్ని ప్రచారం చేయటంగా, బుద్ధుని మొదటి ప్రవచనాన్ని ధర్మచక్ర ప్రవర్తన సూత్రంగా పిలిచారు.
అప్పటి నుంచి సంఘం స్థాపన జరిగి, సభ్యుల సంఖ్య పెరుగుతూ పోయిం ది. బుద్ధుడు, ధర్మం, సంఘాలను త్రిరత్నాలంటారు. బుద్ధుడు నడయాడిన విహారదేశం బీహారు దేశంగా పేరొందినా, బుద్ధుని కాలంలోనే బౌద్ధధర్మం తెలుగునేలకు చేరింది. దాదాపు 250 పైగా సంఘారామాలు ఆవిర్భవించాయి. వీటిలో అమరావతి, భట్టిప్రోలు, వడ్డమాను, శాలిహొండం (శ్రీ’కాకుళం దగ్గర)లు అశోకుని కాలంలోనే ఉన్నాయని ది కల్చరల్ సెంటర్, విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చె ప్పారు. శాతవాహన కాలంలో ప్రతి ఊరు ఒక ఆరామమై త్రిచరణాలతో మారుమోగిందనీ, బుద్ధగీత ప్రతిఇంట ఆలాపించారని, వర్గ, వర్ణ, వ్యత్యాసాలు లేని సమసమాజానికి తెలుగు నేల నాంది పలికిందని వివరించారు. రాజధానికి అమరావతి పేరు పెట్టుకున్న నేపథ్యంలో శుక్రవారం ఆషాఢ పున్నమిని ప్రభుత్వపరంగా జరపటం మంచిదని బౌద్ధసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.