
అశేష భక్తుల మధ్య ముందుకు సాగుతున్న రథం
సింహాచలం: ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ మంగళవారం ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు కాలినడకన గిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి తరించారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం భక్తజన సంద్రంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ ప్రచార రథాన్ని ప్రారంభించి అధికారికంగా గిరి ప్రదక్షిణని ప్రారంభించారు.
సింహాచలంలోని కొండ దిగువన తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణలో పాల్గొన్నారు. రథంతో పాటు లక్షలాది మంది భక్తులు హరి నామస్మరణలు చేస్తూ ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో దేవస్థానం, పలు శాఖల అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సారథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు దారి పొడవునా పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సేవలందించాయి.