Asadullah Akhtar
-
‘భత్కల్ పోలీసు వ్యాన్‌ను పేల్చాలనుకున్నాడు’
ముంబై: 2011, జూలై 13 బాంబు పేలుళ్ల కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ జనసంచారం అధికంగా ఉన్న దాదర్‌లో పోలీసు వ్యాన్‌ను పేల్చేందుకు కుట్ర పన్నాడు. అయితే అతను ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి పోలీసు వ్యాన్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) వర్గాలు శుక్రవారం తెలిపాయి. వ్యాన్‌లోని పోలీసులను చంపాలనుకున్నాడని వివరించాయి. చెత్తకుండీకి సమీపంలో నాలుగో పేలుడు పదార్థాన్ని పెట్టిన భత్కల్ పథకం వేసిన రోజు పోలీసు వ్యాన్ లేకపోవడంతో ఆ బాంబును పేల్చలేదని చెప్పాయి. 2011, జూలై 13న ముంబైలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మూడు వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 21 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. సాయంత్రం 6.50 గంటలకు జావేరి బజార్‌లోమొదటిది, నిమిషం తర్వాత ఓపెరా హౌస్, 7.04 నిమిషాలకు సెంట్రల్ ముంబైలోని పశ్చిమ దాదర్‌లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్టయిన భత్కల్ను విచారించగా మొత్తం నాలుగు పేలుడు పదార్థాలను అమర్చామని, అయితే నాలుగో బాంబును మాత్రం పేల్చలేదని అంగీకరించాడు. తూర్పు దాదర్‌లోని పూల మార్కెట్‌కు సమీపంలో సహచరుడు తహసీన్ అక్తర్ షేక్‌తో కలిసి రెండు పేలుడు పదార్థాలు నాటామని తెలిపాడు. అయితే పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, ఆ రోజు అనుకున్న సమయంలో ఆ వాహనం లేకపోవడంతో ఆలోచనను విరమించుకున్నామని వివరించాడు. 2011 బాంబు పేలుళ్ల కేసులో భత్కల్, అక్తర్లను విచారించేందుకు న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పోలీసులు విచారించారు. వీరిని గురువారం మోకా కోర్టు ముందు హాజరుపరచగా ఈ నెల 18 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించింది. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏ
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తరలించారు. దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో విచారణ నిమిత్తం ఆ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇటీవల దేశ సరిహద్దుల వద్ద యూసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ హాదీ తబ్రేజ్‌ను 15 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 4 వరకు తబ్రేజ్‌ను కస్టడీలో విచారించొచ్చని, గడువు ముగిసిన తర్వాత వైద్యుల ధ్రువీకరణపత్రంతో అతన్ని 5న కోర్టులో హాజరుపర్చాలని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తబ్రేజ్‌ను పీటీ వారంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. అతనికి హైదరాబాద్‌లో ఆశ్రయమిచ్చిందెవరు? నిషేధిత పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇందుకు సహకరించిందెవరు? విధ్వంసం తర్వాత ఎవరి సహాయంతో తప్పించుకున్నారు? తదితర అంశాలపై తబ్రేజ్ నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని, అతన్ని కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో తబ్రేజ్‌ను రిమాండ్ నిమిత్తం ఎన్ఐఏ అధికారులు రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు ఒక కాన్వాయ్ జైలు వరకు పరిశీలనకు వెళ్లొచ్చింది. తీరా జైలు నిబంధనల ప్రకారం సమయం ముగిసిందని చెప్పి జైలు అధికారులు తబ్రేజ్‌ను వెనక్కి పంపించివేశారు. శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలులో హాజరుపరిచిన తరువాతే అతన్ని ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తండ్రి వైద్యుడు... కొడుకు ఉగ్రవాది! ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన యాసిన్ భత్కల్‌కు కుడి భుజంగా ఎదిగిన తబ్రేజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్. అతనికి జావేద్ అక్తర్, హడ్డీ, షకీర్, డానియల్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి బి.ఫార్మసీ పూర్తి చేశాడు. తబ్రేజ్ తండ్రి డాక్టర్ జావేద్ అక్తర్ ప్రముఖ వైద్యుడు. ఎముకల వైద్యు నిపుణుడిగా పేరొందిన అతను గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగానూ పోటీ చేశారు. 2008లో ఉద్యోగం కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి ఇంటికి రాలేదని అతడి కుటుంబీకులు చెప్తుంటారు. 2011లో ముంబై పేలుళ్లు, గత ఏడాది ఆగస్టు 1న పుణేలోని జేఎం రోడ్డు పేలుళ్లలో ఇతని పాత్ర స్పష్టం కావడంతో నిఘా వర్గాలు వేట ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, అబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత ఏడాది నలుగురు ఐఎం ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరిలో నగరంలో నివసించిన మగ్బూల్ కూడా ఒకరు. ఈ కేసు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. -
వేగవంతమైన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై విచారణ
హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అఖ్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’లు పోలీసులకు పట్టు బడటంతో దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల విచారణ వేగవంతమైంది. పేలుళ్ల సూత్రదారి అసదుల్లా అఖ్తర్‌ను అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్ తరలించారు. పేలుళ్లకు ముందు తాను షెల్టర్ తీసుకొన్న ఇంటిని సోదాచేసి పలు కీలక ఆధారాలు సేకరించారు. అనంతరం ఉదయాన్నే డిల్లీ తరలించారు. పిటి వారెంట్‌పై పట్టబడిన నిందితులను హైదరాబాద్ తరలించేందుకు రాష్ట్ర పోలీసులు కోర్టును కోరనున్నారు. ఫిబ్రవరి 21 దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల సూత్రధారులు ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదాలు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఆరునెల్ల తర్వాత ఎట్టకేలకు పట్టుబడ్డారు. ఇండో-నేపాల్ సరిహద్దులో బీహార్ పోలీసులు అగస్ట్ 28న వారిని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం డిల్లీ తరలించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పలుకోణాల్లో వీరిద్దరిని విచారించింది. భక్తల్, అక్తర్‌లు ఇచ్చిన సమాచారంతో బీహార్‌లో పలుచోట్ల ఎన్ఐఎ బృందం సోదాలు నిర్వహించింది. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులలో భత్కల్ నిందితుడు. -
హైదరాబాద్‌కు ఉగ్రవాది అసదుల్లా అక్తర్
హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ను విచారణ కోసం ఎన్ఐఏ హైదరాబాద్ తీసుకొచ్చింది. అసదుల్లా అక్తర్‌ను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో విచారిస్తున్నట్లు సమాచారం. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు ముందు అసదుల్లా నివాసమున్న బహదూరుపూరా ఇంట్లో కొన్ని బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లలో 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు. ఈ కేసులో యాసిన్ భత్కల్‌కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు. -
హైదరాబాద్‌కు ఉగ్రవాది అసదుల్లా అక్తర్
-
యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే
పాట్నా/న్యూఢిల్లీ: నేపాల్ సరిహద్దుల్లో పోలీసులకు పట్టుబడ్డ ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఆరు నెలలుగా నేపాల్‌లోనే ఉంటున్నాడు. తాను చెబితే ఏమైనా చేయగల వంద మంది ఉగ్రవాదులను సైతం తయారు చేశాడు. ఇంటరాగేషన్‌లో అతడు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. భత్కల్ను, అతడి సహచరుడు అసదుల్లా అక్తర్‌ను ఎన్ఐఏ పోలీసులు శుక్రవారం ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారిని పన్నెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. భత్కల్, అక్తర్లను బుధవారం రాత్రి నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్న ఎన్ఐఏ అధికారులు, తొలుత వారిని బీహార్‌లోని మోతిహారి కోర్టులో ప్రవేశపెట్టి, మూడు రోజుల బదిలీ రిమాండ్ పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ కోర్టులో గోప్యంగా జరిగిన విచారణలో నిందితుల తరఫు న్యాయవాది ఎస్.ఎం.ఖాన్, నిందితుల్లో ఒకరు మహమ్మద్ అహ్మద్ అని, అతడు యాసిన్ భత్కల్ కాదని వాదించారు. అయితే, మహమ్మద్ అహ్మద్ సిద్దిబప్ప, యాసిన్ భత్కల్ ఒక్కరేనని, అతడిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిందని ఎన్ఐఏ తన రిమాండ్ దరఖాస్తులో తెలిపింది. నిందితులను ఇతర రాష్ట్రాలకు తీసుకు వెళ్లేటప్పుడు వారి చేతులకు సంకెళ్లు వేసి తీసుకు వెళ్లేందుకు అనుమతించాలని ఎన్ఐఏ అభ్యర్థించగా, కోర్టు అంగీకరించింది. ఉత్తర కర్ణాటకలోని ఉడిపి జిల్లా భత్కల్ గ్రామానికి చెందిన యాసిన్ భత్కల్ దాదాపు 40 ‘ఉగ్ర’ కేసుల్లో కీలక నిందితుడు. హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, పుణే, ఢిల్లీ, బెంగళూరు దాడుల్లో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ గత నెలలో ఢిల్లీ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొంది. కాగా, ఇటీవల ఈద్ పర్వదినం సందర్భంగా భత్కల్ తన భార్యకు కానుకగా లక్ష రూపాయలు బ్యాంకు ద్వారా పంపాడు. ఈ చర్య ఆధారంగానే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అతడి ఆచూకీని కనిపెట్టగలిగినట్లు సమాచారం. ఇంటరాగేషన్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తంచేయని భత్కల్, హెచ్చరిక పంపేందుకే తాను బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు చెప్పాడని సమాచారం. నేపాల్‌లో ఉన్న ఆరు నెలల్లోనూ తరచుగా ఇళ్లు మార్చేవాడినని, యునానీ వైద్యుడిగా చెప్పుకుంటూ అక్కడి ముస్లింలకు వైద్యం చేసేవాడినని చెప్పినట్లు మోతిహారి ఎస్పీ చెప్పారు. అయితే, గతనెల 7న బుద్ధగయలో జరిగిన పేలుళ్లలో తమ పాత్ర లేదని అతడు విచారణలో చెప్పినా, అతడి పాత్ర ఉందనే తాము అనుమానిస్తున్నామని తెలిపారు. -
యాసిన్ భత్కల్ కు 12 రోజుల కస్టడీ
ఢిల్లీ:నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత అయిన యాసిన్ భత్కల్ ను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’కి కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించారు.. -
హైదరాబాద్‌కు యాసిన్, తబ్రేజ్!
సాక్షి, హైదరాబాద్: యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ల అరెస్టు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు దర్యాప్తును ఒక కొలిక్కి తేగలదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. స్థానిక పోలీసు లు రెండు వారాలపాటు దర్యాప్తు చేశారు. తర్వాత కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ మార్చి 14న కేసు నమోదు చేసింది. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్సీ-01/2013/ఎన్ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద పేలుడుకు సంబంధించి ఆర్సీ 02/2013/ఎన్ఐఏ/హైదరాబాద్‌గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టం ప్రకారం ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు. యాసిన్‌కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు. అరెస్టయిన యాసిన్ భత్కల్, తబ్రేజ్‌లను జంట పేలుళ్ల కేసులో విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. యాసిన్ అరెస్టుతో రాష్ర్టవ్యాప్తంగా అన్ని నగరాలు, పుణ్యక్షేత్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సిందిగా డీజీపీ దినేష్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలు జారీచేశారు.