ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ను విచారణ కోసం ఎన్‌ఐఏ హైదరాబాద్ తీసుకొచ్చింది.
హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ను విచారణ కోసం ఎన్‌ఐఏ హైదరాబాద్ తీసుకొచ్చింది. అసదుల్లా అక్తర్‌ను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన ఎన్‌ఐఏ అధికారులు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో విచారిస్తున్నట్లు సమాచారం. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు ముందు అసదుల్లా నివాసమున్న బహదూరుపూరా ఇంట్లో కొన్ని బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
పేలుళ్లలో 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్‌భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు.
ఈ కేసులో యాసిన్ భత్కల్కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు.