భత్కల్ సహా ఆ ఐదుగుర్ని వెంటనే ఉరితీయాలి
అప్పీలు చేసే అవకాశం ఇవ్వకూడదు
రక్షాపురం (చంద్రాయణగుట్ట): దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులైన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించడంపై మృతుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18మంది అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ముష్కరుల్ని వెంటనే ఉరితీయాలని, వారికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యావత్ హైదరాబాద్‌ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 140మందికి గాయాలయ్యాయి.
ఈ ఘటనలో చంద్రాయణగుట్ట రక్షాపురానికి చెందిన స్వప్నారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వప్నారెడ్డి కుటుంబసభ్యులు స్వాగతించారు. అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న దోషులకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని, వారిని తొందరగా ఉరితీయాలని వారు డిమాండ్‌చేశారు. స్వప్నారెడ్డిని ఉగ్రవాదులు ఆ కారణంగా పొట్టనబెట్టుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నగరవాసులకు చేదు అనుభవం మిగిల్చిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లపై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు.. దోషులు యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.