తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ | Hadi tabrez 15 days of Custody to National Investigation agency | Sakshi
Sakshi News home page

తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ

Published Fri, Sep 20 2013 2:51 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ - Sakshi

తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ

సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ హాదీ తబ్రేజ్‌ను 15 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 4 వరకు తబ్రేజ్‌ను కస్టడీలో విచారించొచ్చని, గడువు ముగిసిన తర్వాత వైద్యుల ధ్రువీకరణపత్రంతో అతన్ని 5న కోర్టులో హాజరుపర్చాలని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
 
  తబ్రేజ్‌ను పీటీ వారంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఎన్‌ఐఏ అధికారులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. అతనికి హైదరాబాద్‌లో ఆశ్రయమిచ్చిందెవరు? నిషేధిత పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇందుకు సహకరించిందెవరు? విధ్వంసం తర్వాత ఎవరి సహాయంతో తప్పించుకున్నారు? తదితర అంశాలపై తబ్రేజ్ నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని, అతన్ని కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో తబ్రేజ్‌ను రిమాండ్ నిమిత్తం ఎన్‌ఐఏ అధికారులు రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు ఒక కాన్వాయ్ జైలు వరకు పరిశీలనకు వెళ్లొచ్చింది. తీరా జైలు నిబంధనల ప్రకారం సమయం ముగిసిందని చెప్పి జైలు అధికారులు తబ్రేజ్‌ను వెనక్కి పంపించివేశారు. శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలులో హాజరుపరిచిన తరువాతే అతన్ని ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు.
 
 తండ్రి వైద్యుడు... కొడుకు ఉగ్రవాది!
 ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన యాసిన్ భత్కల్‌కు కుడి భుజంగా ఎదిగిన తబ్రేజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్. అతనికి జావేద్ అక్తర్, హడ్డీ, షకీర్, డానియల్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి బి.ఫార్మసీ పూర్తి చేశాడు. తబ్రేజ్ తండ్రి డాక్టర్ జావేద్ అక్తర్ ప్రముఖ వైద్యుడు. ఎముకల వైద్యు నిపుణుడిగా పేరొందిన అతను గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగానూ పోటీ చేశారు. 2008లో ఉద్యోగం కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి ఇంటికి రాలేదని అతడి కుటుంబీకులు చెప్తుంటారు. 2011లో ముంబై పేలుళ్లు, గత ఏడాది ఆగస్టు 1న పుణేలోని జేఎం రోడ్డు పేలుళ్లలో ఇతని పాత్ర స్పష్టం కావడంతో నిఘా వర్గాలు వేట ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత ఏడాది నలుగురు ఐఎం ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరిలో నగరంలో నివసించిన మగ్బూల్ కూడా ఒకరు. ఈ కేసు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి ఎన్‌ఐఏకు బదిలీ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement