అనుష్క కాదు అలీ!
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో అనుష్క అనే మహిళే లేదని సైనికాధికారుల విచారణలో తేలింది. పటన్ కుమార్‌ను మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది అసిఫ్ అలీ అనే మరో సైనికుడేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మీరట్ సైనిక విభాగంలో పని చేస్తున్న అలీని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. అలీ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి. ఆమె ద్వారా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అలీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క అనే పేరుతో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్‌ను పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు అతని బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తూ ఉండేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వీరి మధ్య ఫేస్బుక్ సంభాషణే ఎక్కువగా జరిగేది. ఒక్కసారి మాత్రం ఫోన్లో మాట్లాడారు. అయితే అప్పుడు అలీనే ఓ మహిళతో మాట్లాడించాడు. ఆ మహిళ అలీ భార్యగా భావిస్తున్నారు. అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళ.
అలీనే మహిళగా చెప్పి, తరచూ డబ్బు ఇస్తూ పటన్‌కుమార్ నుంచి దేశ మిలటరీకి సంబంధించిన కీలకమైన రహస్యాలను తెలుసుకున్నాడు. ఏడాది కాలంగా పటన్ 104 పేజీల రహస్యాలను పంపినట్లు విచారణలో తేలింది. అయితే అలీకి సంబంధించి, అతని భార్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మిలటరీ, పోలీసు అధికారులు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.