మళ్లీ తెరపైకి ‘ప్రత్యేక విదర్భ’
ప్రత్యేక విదర్భ అంశం తరచూ తెరపైకి వ స్తూనే ఉంది. శాసనసభ ఎన్నికల సమయంలో పలు పార్టీల నాయకుల హామీలు, ఆ తర్వాత శాసనసభతోపాటు పార్లమెంట్లో చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. గడ్చిరోలి ఎంపీ అశోక్నేతే ఈ అంశాన్ని ప్రస్తావించారు.
సాక్షి, ముంబై: ప్రత్యేక విదర్భ అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ సమావేశాలలో ఈ అంశాన్ని గడ్చిరోలి పార్లమెంట్ సభ్యుడు అశోక్ నేతే ప్రస్తావించారు. నాగపూర్, అమరావతి విభాగాలలో ఉన్న 11 జిల్లాలను మహారాష్ట్ర నుంచి వేరుచేసి ప్రత్యేక విదర్భరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1918 నుంచి ఇందుకు సంబంధించిన పత్రాలను జతపరిచారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం అంశాన్ని బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందే ప్రకటించారు.
ఇప్పటికీ తమ ప్రభుత్వం ప్రత్యేక విదర్భ హామీకి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వంలో ఇటీవలే చేరిన మిత్రపక్షమైన శివసేన మాత్రం మహారాష్ట్రను ముక్కలు చేయనివ్వమంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక విదర్భ అంశాన్ని ఇప్పుడే లేవనెత్తుతుందా..? కొద్దికాలం తరువాత మాట్లాడుతుందా ..? అనే విషయం వేచిచూడాల్సిందే.
స్వాతంత్య్రానికి ముందునుంచే!
స్వాతంత్య్రానికి ముందు అంటే 1938 నుంచే ప్రత్యేక విదర్భఉద్యమం ప్రారంభమైంది. అయితే మధ్య మధ్యలో దీని ప్రభావం కొద్దిగా తగ్గిన ప్పటికీపలు సందర్భాల్లో అనేకమంది ఆందోళనలు చేశారు. అయితే ఇప్పటివరకూ ప్రత్యేక విదర్భ మాటలకే పరిమితమైంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉండేవారని, 1953లోనే విదర్భ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఫజల్ అలీ కమిషన్కు వినతి పత్రం కూడా సమర్పించారని విదర్భవాదులు చెబుతున్నారు. హైకోర్టు, శాసనసభ తదితరాలతోపాటు ఒక రాజధానికి కావాల్సిన వనరులు, మౌలిక సదుపాయాలన్నీ నాగపూర్లో ఉన్నాయి. ఇప్పటికే సంవత్సరానికి ఒక సారి శాసనసభ శీతాకాల సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి.