Ashok Singh
-
గ్వాలియర్ ‘మహారాజు’ ఎవరో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘2014లోలాగా ఇప్పుడు నరేంద్ర మోదీ హవా లేదు. ఆయన నాడిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదు. రైతుల్ని అయితే పూర్తిగా విస్మరించారు. మోదీ అయినా, రాహుల్ అయినా మాకు ఒరిగేది ఏమీ ఉండదు. ప్రస్తుతం మాకు అభ్యర్థే ముఖ్యం. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్వాలియర్ మేయర్ వివేక్ షెజావాల్కర్ ఏ నాడు మా వూరును సందర్శించలేదు. అదే కాంగ్రెస్ అభ్యర్థి అదే అశోక్ సింగ్ మా ఊరుకు 15 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా రైతుల యోగ క్షేమాలు అడుగుతారు. ఆయన పట్ల మాకు సానుభూతి కూడా ఉంది. 2007లో జరిగిన ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యశోధర రాజె సింధియా చేతుల్లో అశోక్ సింగ్ ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీ హవా కారణంగా బీజేపీ అభ్యర్థి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోవడానికి రాజూ లేడు. మోదీ ప్రభావమూ లేదు. ఆయన్నే గెలుస్తారు. ఆయనకే ఓటు వేస్తాం’ అని గ్వాలియర్‌లోని సముదాన్ గ్రామంలో నీడపట్టున ముచ్చటిస్తున్న రైతులను మీడియా కదిలించగా వారీ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశామని, ఈసారి కూడా ఆ పార్టీకే ఓటు వేస్తామని కొందరు రైతులు చెప్పారు. గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గంలోని పరదిలో ఏడు అసెంబ్లీ సెంగ్మెంట్లు ఉండగా, వాటిలో ఆరింట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 231 సీట్లు ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. అప్పటి ఎగ్జిట్ పోల్‌లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని చెప్పిన రైతుల్లో ఎక్కువ మంది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని చెప్పారు. ఇప్పుడు వారి వైఖరి మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రైతుల రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం కొంత మార్పునకు కారణం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే రాష్ట్రానికి నిధుల కొరత ఉండదని ఒకరిద్దరు రైతులు అభిప్రాయపడ్డారు. గ్వాలియర్ నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులతోపాటు దళితుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. వారిలో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నారు. మే 12వ తేదీన ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. -
రాహుల్‌గాంధీకి పెళ్లి కావాలని!
గోరఖ్‌పూర్: రాహుల్ గాంధీకి జీవితభాగస్వామి రావాలని భగవంతుడిని వేడుకున్నానని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి సోమవారం వ్యాఖ్యానించారు. ఉత్తరభారతంలో తొలి శ్రావణ సోమవారం సందర్భంగా సాధ్వి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అని సాధ్వి వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలుచేయడం ఇలాంటి వ్యక్తులకు ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడే వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. -
పెద్దాయనా.. ఇదేం పని?
ములాయంపై కాంగ్రెస్, బీజేపీ మండిపాటు లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఓటమికి కాంగ్రెస్ పార్టీతో పొత్తే కారణమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. ములాయం మాటలకు చేతలకు పొంతనే లేదని పేర్కొంది. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినప్పుడల్లా ములాయం దూరంగా వెళ్లారని గుర్తు చేసింది. అలాగే ములాయం కుటుంబంలో తలెత్తిన సంక్షోభం ప్రజల వరకు చేరకుండా, ఇరు వర్గాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఉండాల్సిందని యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఓటమికి కాంగ్రెస్‌తో పొత్తే కారణమని ములాయం చేసిన వ్యాఖ్యలు నిరాధారమని కొట్టిపారేశారు. కాగా, ప్రధాని మోదీపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. యూపీ ప్రజల తీర్పును ఆయన అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ములాయం ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది. తన కుమారుడే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టిన తీరుతో ఆయన ఇలాంటి మానసిక స్థితిలో ఉన్నారని, ఆయన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి మనీశ్శుక్లా పేర్కొన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ రూ.15వేలు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని ములాయం విమర్శించిన విషయం తెలిసిందే. -
‘ప్రమాద సమయంలో కారును నేనే నడిపా’
ముంబై: బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు కారు నడిపింది తానేనని సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. 2002 సెప్టెంబర్ 28న జరిగిన కారు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, నలుగురికి గాయాలయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ మద్యం సేవించి, కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ కేసులో శుక్రవారం సల్మాన్ ఖాన్ సరికొత్త సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేసింది. ఆ సమయంలో కారును తాను నడపలేదని, మద్యం కూడా తాగి లేనని కోర్టులో తెలిపారు. తనపై మోపిన అభియోగాలను సల్మాన్ ఖాన్ ఖండించాడు. ఆ సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్ కారు నడుపుతున్నట్లు సల్మాన్ చెప్పారు. అయితే అంతకు ముందు సాక్ష్యం ఇచ్చినవారిలో ఒకరు మాత్రం ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతుండగా తాను చూసినట్లు కోర్టులో చెప్పారు. సల్మాన్ మాత్రం అదేమీ లేదంటున్నారు. ఆ సమయంలో తన వైపున్న డోర్ తెరుచుకోకపోవడంతో డ్రైవర్ సీటు వైపు నుంచి కిందకు దిగినట్లు చెప్పారు. సల్మాన్ చెప్పిన విధంగాగే, ఆ రోజు కారు తానే నడిపినట్లు డ్రైవర్ అశోక్ సింగ్ కోర్టుకు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో సీఎం సోదరుడికి గాయాలు
రాయ్‌పూర్ - బల్డాబజార్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సోదరుడు అశోక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ఆయన భార్య అర్తీ సింగ్‌తోపాటు వ్యక్తిగత సహాయకుడు, కార్ డ్రైవర్ గాయపడ్డారు. అశోక్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీ కొట్టింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం రాయ్‌పూర్‌లోని రామకృష్ణ కేర్ ఆసుపత్రికి తరలించారు. సోదరుడుకి ప్రమాదం జరిగిందన్న వార్త తెలిసన వెంటనే రమణ్ సింగ్ రామకృష్ణ కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. సోదరుడి క్షేమ సమాచారాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి స్థిరంగా, ఎటువంటి ఆందోళన చెందన వలసి అవసరం లేదని రమణ్‌సింగ్‌కు వైద్యులు తెలిపారు. అయితే అదే కారులో ప్రయాణిస్తున్న అశోక్ సింగ్ అల్లుడుకి ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే పరారైన ట్రక్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.