రాయ్పూర్ - బల్డాబజార్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సోదరుడు అశోక్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో ఆయన భార్య అర్తీ సింగ్తోపాటు వ్యక్తిగత సహాయకుడు, కార్ డ్రైవర్ గాయపడ్డారు. అశోక్ సింగ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మినీ ట్రక్ ఢీ కొట్టింది.
అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన నలుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం రాయ్పూర్లోని రామకృష్ణ కేర్ ఆసుపత్రికి తరలించారు. సోదరుడుకి ప్రమాదం జరిగిందన్న వార్త తెలిసన వెంటనే రమణ్ సింగ్ రామకృష్ణ కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. సోదరుడి క్షేమ సమాచారాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రుల పరిస్థితి స్థిరంగా, ఎటువంటి ఆందోళన చెందన వలసి అవసరం లేదని రమణ్సింగ్కు వైద్యులు తెలిపారు. అయితే అదే కారులో ప్రయాణిస్తున్న అశోక్ సింగ్ అల్లుడుకి ఎటువంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే పరారైన ట్రక్ డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.