సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రమాదం జరిగిన రోజు కారు నడిపింది తానేనని సల్మాన్ కారు డ్రైవర్ అశోక్ సింగ్ కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చాడు. 2002 సెప్టెంబర్ 28న జరిగిన కారు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, నలుగురికి గాయాలయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ మద్యం సేవించి, కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ కేసులో శుక్రవారం సల్మాన్ ఖాన్ సరికొత్త సాక్ష్యాన్ని కోర్టు నమోదు చేసింది. ఆ సమయంలో కారును తాను నడపలేదని, మద్యం కూడా తాగి లేనని కోర్టులో తెలిపారు. తనపై మోపిన అభియోగాలను సల్మాన్ ఖాన్ ఖండించాడు. ఆ సమయంలో తన డ్రైవర్ అశోక్ సింగ్ కారు నడుపుతున్నట్లు సల్మాన్ చెప్పారు.
అయితే అంతకు ముందు సాక్ష్యం ఇచ్చినవారిలో ఒకరు మాత్రం ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కారు నడుపుతుండగా తాను చూసినట్లు కోర్టులో చెప్పారు. సల్మాన్ మాత్రం అదేమీ లేదంటున్నారు. ఆ సమయంలో తన వైపున్న డోర్ తెరుచుకోకపోవడంతో డ్రైవర్ సీటు వైపు నుంచి కిందకు దిగినట్లు చెప్పారు. సల్మాన్ చెప్పిన విధంగాగే, ఆ రోజు కారు తానే నడిపినట్లు డ్రైవర్ అశోక్ సింగ్ కోర్టుకు తెలిపారు.