నలిగిపోయిన నాలుగో సింహం! | The life and death of Ravindra Patil | Sakshi
Sakshi News home page

నలిగిపోయిన నాలుగో సింహం!

Published Fri, May 20 2016 4:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:32 AM

నలిగిపోయిన నాలుగో సింహం!

నలిగిపోయిన నాలుగో సింహం!

సినిమాకూ, నిజజీవితానికీ చాలా తేడా ఉంటుంది. సినిమాలో డ్రామా ఉంటే..రియల్‌లైఫ్‌లో లైఫ్‌ మాత్రమే ఉంటుంది. అందుకేనేమో ఎక్కడలేని ఆసక్తినీ రేకెత్తించే సినిమా కథలే హిట్టై కూర్చుంటున్నాయి. సామాన్యుల జీవితాలేమో ఫట్‌మంటున్నాయి. సినిమా హీరోలు రారాజులుగా వెలుగుతుంటే.. వారిని ఆరాధించే సామాన్యుడు దిక్కులేని చావు చస్తున్నాడు. వారి చక్రాల కిందపడి నలిగిపోతున్నాడు. జీవితపు చరమాంకంలో ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకు తిరిగిన రవీంద్ర పాటిల్‌ కూడా అలాగే నలిగిపోయాడు.

మహారాష్ట్రలోని చాలామంది కుర్రాళ్లలాగే రవీంద్ర పాటిల్‌కు కూడా సల్మాన్‌ ఖాన్‌ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచీ అతడి కండలు తిరిగిన దేహాన్నే చూస్తూ పెరిగాడు. తన హీరోలాగే తానూ కండలు పెంచాలనుకున్నాడు. చివరకు పెంచాడు కూడా. ఈ దేహదారుఢ్యమే అతడిని పోలీస్‌ శాఖలో ఉద్యోగం సంపాదించేలా చేసింది. 1997లో ముంబై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. కెరీర్‌ ప్రారంభించిన రెండేళ్లకే ఉగ్రవాదుల ఆటకట్టించే ‘స్పెషల్‌ ఆపరేషన్‌ స్క్వాడ్‌’ కమాండోగా శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాడు.

సరిగ్గా అప్పుడే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌కు ముంబై అండర్‌వరల్డ్‌ నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కావాలనీ పోలీస్‌ కమిషనర్‌కు విన్నవించుకున్నాడు సల్మాన్‌. కమీషనర్‌ ఆదేశంతో బాడీగార్డ్‌ కోసం వేటలో పడ్డారు అధికారులు. ఆ సమయంలోనే వారి కంటపడ్డాడు రవీంద్ర పాటిల్‌. రూపంలో సల్మాన్‌కు పోటీగా ఉన్నాడు. ఓ రకంగా సల్మాన్‌ను మించిన ఫిజిక్‌తో పోలీసు అధికారుల దష్టిని ఆకర్షించాడు. ఇలాంటి వాడైతేనే సూపర్‌స్టార్‌కు సరైన జోడు అనుకున్నారో ఏమో.. స్పెషల్‌ ఆపరేషన్‌ స్క్వాడ్‌ నుంచి పాటిల్‌ను తప్పించారు. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేయమంటూ ఆదేశించారు.

ఇది పాటిల్‌లో ఎక్కడలేని సంతోషాన్ని నింపింది. ఎగిరి గంతేశాడు. ‘‘ఇకపై సల్మాన్‌కు దగ్గరగా ఉండబోతున్నాను.. సల్మాన్‌ను రోజూ చూస్తాను.. సల్మాన్‌ కుటుంబంలో ఒకడిగా మారబోతున్నాను..’’ ఇలా ఒకటా రెండా బోలెడన్ని ఆలోచనలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వెంటనే విధుల్లో చేరిపోయాడు. అయితే, ఆ రోజు అతడికి తెలియలేదు. అదే అతడి జీవితాన్ని సర్వనాశనం చేయబోతోందని..!

రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. సల్మాన్‌తో కలిసి తిరగడం వల్ల ప్రముఖులతో పరిచయాలు, భారీ పార్టీలు, ఖరీదైన గిఫ్టులు, బ్రాండెడ్‌ దుస్తులు.. ఇలా తన జీవితంలో ఎన్నడూ చూడని మార్పును చూస్తున్నాడు పాటిల్‌. సల్మాన్‌ను చూడాలని ఉందనే తన స్నేహితుల కోరికా కాదనేవాడు కాదు. ఎలాగోలా వారు సూపర్‌స్టార్‌ని కలిసేలా చేసేవాడు. దీంతో బంధుమిత్రుల దగ్గర పరపతినీ పెంచుకున్నాడు. అలా జీవితం కొన్నాళ్లు సాఫీగానే సాగింది.

కానీ, 2002 సంవత్సరం పాటిల్‌ జీవితంపై కోలుకోలేని దెబ్బ కొట్టింది. సెప్టెంబర్‌ 28 అర్ధరాత్రి రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఐదుగురి మీదుగా సల్మాన్‌ఖాన్‌కు చెందిన టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా మిగిలినవారు గాయపడ్డారు. అయితే, ఆ సమయంలో కారు వెనక సీటులో కూర్చున్న రవీంద్ర పాటిల్‌.. ప్రమాదానికి కారణం సల్మాన్‌ ఖాన్‌ తప్పతాగి డ్రైవ్‌ చేయడమేనని పేర్కొన్నాడు. తాను వద్దని వారిస్తున్నా, వినకుండా వేగంగా కారు నడిపాడని.. ఫలితంగా ప్రమాదం సంభవించిదనీ సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.

ఇదే అతడి జీవితాన్ని తలకిందులు చేసింది. సల్మాన్‌ లాంటి హై ప్రొఫైల్‌ వ్యక్తికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచీ, వెలుపలి నుంచీ పాటిల్‌ తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకపోయాడు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఎవరెన్ని చెప్పినా దానికి అంగీకరించలేదు. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా అదశ్యం కావడంతో కేసు విచారిస్తున్న న్యాయస్థానం పాటిల్‌పై అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో, 2006లో మహాబలేశ్వరంలో పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెట్టాడు. తర్వాత బెయిల్‌పై విడుదలైనా కుటుంబ సభ్యులు అతడిని ఆదరించలేదు. భార్య విడాకులు తీసుకుంది. ఎక్కువ కాలం విధులకు హాజరు కాలేదంటూ పోలీస్‌ శాఖ పాటిల్‌ను ఉద్యోగం నుంచి తప్పించింది. దీంతో, ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకునే స్థితికి దిగజారాడు. మరోవైపు, అతడిని క్షయ వ్యాధి పట్టిపీడించింది. ఈ దశలో 2007లో బిచ్చమెత్తుకున్న డబ్బుతోనే ఆసుపత్రికి చేరాడు. అక్కడే అక్టోబర్‌ 4న కన్నుమూశాడు.

తాను చనిపోవడానికి రెండ్రోజుల ముందు కలిసిన స్నేహితుడితో..,‘‘ఆ ప్రమాదం నా జీవితాన్ని సర్వనాశనం చేసింది’’ అని వ్యాఖ్యానించాడు. చివరి వరకూ ఒకే మాటపై నిలబడిన ఆ కానిస్టేబుల్‌ తుదిశ్వాస వరకూ న్యాయం జరుగుతుందనే భావించాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement