సాక్షి, ముంబై : బాలీవుడ్ సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. హిట్ అండ్ రన్ కేసులో దాఖలు చేసిన వారెంట్‌ను ముంబై సెషన్స్ కోర్టు శనివారం కొట్టేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు ఆదేశాలనుసారం సల్మాన్ వ్యవహరించకపోవటంతో ఈ నెల 4వ తేదీన కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. అయితే శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. ఆ ప్రక్రియను పూర్తి చేశారు.
షూరిటీ ప్రక్రియ.. హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు షూరిటీని సమర్పించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మరో కొత్త షూరిటీ పేరుతో రెన్యువల్ చేయాల్సి ఉంది. దీంతో సల్మాన్ తన బాడీగార్డ్ గుర్మీత్‌సింగ్ జోలీ అలియాస్ షేరా పేరును కోర్టుకు సమర్పించాడు. అయితే అందుకు సంబంధించిన అధికార ప్రక్రియను మాత్రం సల్మాన్ పూర్తి చేయలేదు. దీంతో ఏప్రిల్ 4న సెషన్స్ కోర్టు సల్మాన్‌కు బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. దీనిపై సల్మాన్ కోర్టును అభ్యర్థించటంతో ఏప్రిల్ 11న దానిపై స్టే విధిస్తూ.. షూరిటీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏప్రిల్ 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం కోర్టుకు హాజరైన సల్మాన్.. షేరాతో ఆ ఫామ్‌లపై సంతకాలు చేయించాడు. దీంతో కోర్టు వారెంట్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
హిట్ అండ్ రన్ కేసు నేపథ్యం... 2002లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి సల్మాన్ తన కారును పోనివ్వటంతో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 13 ఏళ్ల విచారణ తర్వాత బాంబే సెషన్స్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ మే 2015లో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ సల్మాన్ హైకోర్టును ఆశ్రయించగా.. డిసెంబర్ 2015లో కోర్టు ఆయన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... అది పెండింగ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment